ఇందూరు రైతన్నలకు తమిళ తంబీల బాసట
తమ గోడు వినాలని..తాము పండించిన పంటకు కనీస మద్ధతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధానిలో తమిళనాడుకు చెందిన రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఏళ్ల తరబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కనీసం తమను మనుషులుగా కూడా గుర్తించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటకు గిట్టుబాటు రావడం లేదని, మినిమం మార్కెట్ ప్రైజ్ కూడా ఇవ్వడం లేదంటూ ధర్నా నిర్వహించారు. ఈ విషయంపై తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని కోరుతూ నిరనస వ్యక్తం చేశారు. అంతకు ముందు ముంబయి నుండి భారీ ఎత్తున రైతులు ఢిల్లీకి పాదయాత్ర చేపట్టారు. ఇందులో వేలాది మంది రైతులు పాల్గొన్నారు. వారు పార్లమెంట్‌ను ముట్టడించకుండా పోలీసులు అడ్డుకున్నారు.
టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ విషయంపై ప్రధాన పార్టీలన్నీ అభ్యంతరం వ్యక్తం చేశాయి. వీరిని స్పూర్తిగా తీసుకున్న తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతులు పోరుబాట పట్టారు. దేశంలోనే అత్యధికంగా పసుపు, చెరుకు, కందులను సాగు చేస్తారు ఈ జిల్లాలో. ప్రత్యేకంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని గత కొన్నేళ్లుగా కోరుతూ వస్తున్నారు. పాలకులు మారినా ..కొత్త రాష్ట్రం ఏర్పడినా ఎలాంటి మార్పు కనిపించలేదు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన కవిత రైతులకు తప్పకుండా పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని, మార్కెట్ గోదాములు నిర్మిస్తామని, యార్డులలో మధ్య దళారుల ప్రమేయం ఉండనీయమంటూ హామీ ఇచ్చారు. ఐదేళ్లు పూర్తయినా దాని ఊసే ఎత్తక పోవడం, సీఎం స్పందించక పోవడంతో రైతులు బాధితులుగా మారారు.
సర్కారు తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రైతులంతా ఒక్కటయ్యారు. రైతు పోరాట కమిటీగా ఏర్పడ్డారు. 178 మంది రైతులు ఒక్కరొక్కరుగా ఎంపీ స్థానానికి పోటీ చేశారు. దీంతో ఒక్కసారిగా నిజామాబాద్ జిల్లా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భారీగా పోలింగ్ సిబ్బందిని నియమించింది. పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.
రైతులు మాత్రం ..తమకు గెలుపు, ఓటములతో సంబంధం లేదని, ప్రభుత్వాల తీరును దేశానికి తెలియ చేయాలనే ఉద్ధేశంతోనే తాము బరిలో నిలిచామన్నారు. తమ స్వంత ఖర్చులతో ఎన్నికల ప్రచారం నిర్వహించామని, ప్రతి రైతు కుటుంబాన్ని కలిసి విన్నవించామని, ప్రజలకు తమ సమస్య ఏమిటో తెలియ చేయడం జరిగిందన్నారు.
తమ సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు తమ ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు కొనసాగుతూనే ఉంటాయని రైతు సంఘం నేతలు స్పష్టం చేశారు. రైతుల శ్రేయస్సు కోసం పనిచేస్తుందని చెప్పుకుంటున్న ప్రభుత్వం ..తమ పట్ల దారుణంగా ప్రవర్తించిందంటూ వాపోయారు. రాష్ట్ర సర్కార్, ఎంపీ పట్టించుకోక పోవడంతో ..సమస్య తీవ్రతను తెలియ చెప్పాలని ..యుపీలోని వారణాసిలో పోటీ చేస్తున్న ప్రధానికి వ్యతిరేకంగా అక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయించామన్నారు. ఈ రైతుల నిర్ణయానికి దేశ వ్యాప్తంగా రైతుల మద్ధతు లభిస్తోంది. తమిళనాడుకు చెందిన రైతులు వీరికి బాసటగా నిలిచారు. మొత్తం మీద కేంద్ర, రాష్ట ప్రభుత్వాల బాధ్యతా రాహిత్యాన్ని సూచిస్తోంది ఈ సంఘటన.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి