ఇంట‌ర్ బోర్డు తీరుపై హైకోర్టు ఆగ్ర‌హం - పిల్ల‌ల భ‌విత‌వ్యం ముఖ్యం

తెలంగాణ‌లో ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల ప్ర‌భావం విద్యార్థుల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. అధికారుల తీరుపై ..ప్ర‌భుత్వం స్పందించ‌క పోవ‌డంపై ధ‌ర్మాస‌నం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. మ‌రో వైపు ఇంట‌ర్ బోర్డు కార్యాల‌యం వ‌ద్ద బాధితులు, పేరెంట్స్ ఆందోళ‌న చేప‌ట్టారు. పోలీసులు బాధితుల ప‌ట్ల అమానుషంగా ప్ర‌వ‌ర్తించారు. ఏం జ‌రుగుతుందో తెలుసుకోవాల‌ని అక్క‌డికి వెళ్లిన మాజీ ఎమ్మెల్సీ, విద్యావేత్త డాక్ట‌ర్ నాగేశ్వ‌ర్ ప‌ట్ల ఖాకీలు అనుస‌రించిన తీరుపై స‌ర్వ‌త్రా నిర‌స‌న వ్య‌క్త‌మైంది. అటు పిల్లల్ని ఇటు పేరెంట్స్, విద్యార్థి సంఘాలు, ఆయా పార్టీల నేత‌ల‌ను అరెస్ట్ చేశారు. ప‌రిస్థితి కంట్రోల్ త‌ప్ప‌డంతో అస‌లు బోర్డులో ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొని ఉన్న‌ది. ఈ విష‌యంపై బాల‌ల హ‌క్కుల సంఘం హైకోర్టులో ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం పిటిష‌న్ దాఖ‌లు చేసింది. దీనిపై స్పందించిన హైకోర్టు తాత్కాలిక న్యాయ‌మూర్తి జ‌స్టిస్ రాఘ‌వేంద్ర సింగ్ రాథోడ్, న్యాయ‌మూర్తి ఎ. రాజశేఖ‌ర్ రెడ్డిల‌తో కూడిన ధ‌ర్మాస‌నం తీవ్రంగా స్పందించింది. మీ పిల్ల‌లకు ఇలాంటి స‌మ‌స్య ఎదురైతే ఇలాగే ప్ర‌వ‌ర్తిస్తారా అంటూ ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాదిని ప్ర‌శ్నించారు.

త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని, త‌క్ష‌ణ‌మే న్యాయం చేయాల‌ని కోరుతూ స్టూడెంట్స్, పేరెంట్స్ రోడ్డుపై బైఠాయించారు. స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి ఇల్లును ముట్ట‌డించేందుకు ఏఐఎస్ ఎఫ్ ఆధ్వ‌ర్యంలో విద్యార్థులు ప్ర‌య‌త్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థుల‌కు సంబంధించిన అంశం ప‌ట్ల ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు ఇంత ఉదాసీనంగా ఎందుకు ప్ర‌వ‌ర్తిస్తున్న‌దో ఆలోచిస్తున్న‌దా అంటూ బోర్డు కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ అశోక్ కుమార్ ను నిల‌దీసింది. విద్యాశాఖ కార్య‌ద‌ర్శి జ‌నార్ద‌న్ రెడ్డి కూడా హైకోర్టుకు హాజ‌ర‌య్యారు. పొర‌పాట్లు జ‌రిగాయ‌ని సాక్షాత్తు ఉన్న‌తాధికారే ఒప్పుకుంటున్న‌ప్పుడు .. ఆ త‌ప్పుల్ని స‌రిదిద్దాల్సిన బాధ్య‌త సంబంధిత బోర్డుకు లేదా అని ప్ర‌శ్నించారు. త‌ప్పు జ‌రిగిన‌ప్పుడు న్యాయం చేయాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వానిదేన‌ని స్ప‌ష్టం చేసింది. మీరు స‌మ‌ర్పించిన గ‌ణాంక‌ల‌తో మాకు సంబంధం లేదు. ప‌రిష్కార‌మే అంతిమ మార్గం కావాలంటూ పేర్కొంది. ఏం చేశారో సోమ‌వారం వ‌ర‌క‌ల్లా స్ప‌ష్టం చేయండి అంటూ ధ‌ర్మాస‌నం ఆదేశించింది.

త‌క్ష‌ణ‌మే విద్యార్థుల ప‌ట్ల సానుకూలంగా స్పందించ‌క పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుందంటూ హెచ్చ‌రించింది. ఇంట‌ర్ బోర్డు ప‌రీక్షా ప‌త్రాల మూల్యాంక‌న విష‌యంలో ఏమేం ప‌ద్ద‌తులు పాటిస్తున్నారో తెలియ చేయాల‌న్నారు. ఉత్తీర్ణులు కాలేక పోయిన 3 ల‌క్ష‌ల మంది విద్యార్థుల ప‌త్రాల‌ను పున‌ర్ మూల్యాంక‌నం చేసేందుకు ఉన్న అవ‌కాశాలు ఏమిటో తెలియ చేయాల‌ని సూచించింది. ఈ మొత్తం వ్య‌వ‌హారం విద్యార్థుల‌కు సంబఃధించిన వ్య‌వ‌హార‌మ‌ని..ఎంత మాత్రం తేలిగ్గా తీసుకోవ‌ద్ద‌ని హెచ్చ‌రించింది. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాల‌కు ప‌రిహారం ఇవ్వాల‌ని, ఆ కుటుంబంలో ఒక‌రికి ఉద్యోగం ఇవ్వాల‌ని బాధితుల త‌ర‌పున పిటిష‌న‌ర్ కోరారు. దీనిపై ప్ర‌భుత్వ త‌ర‌పు లాయ‌ర్ మాట్లాడుతూ..ఈ స‌మ‌స్య‌పై త‌క్ష‌ణ‌మే ప్ర‌భుత్వం ఓ క‌మిటీని ఏర్పాటు చేసింద‌న్నారు. ఆ క‌మిటీ నివేదిక ఇచ్చాక చ‌ర్య‌లు తీసుకుంటుంద‌న్నారు. దీనిపై ధ‌ర్మాస‌నం మ‌రోసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. మొత్తంగా చూస్తే ప్ర‌భుత్వ ఉదాసీన వైఖ‌రి, ఇంట‌ర్ బోర్డు నిర్ల‌క్ష్యం క‌నిపిస్తోంద‌న్నారు.

త‌గినంత యంత్రాంగం లేద‌ని చెప్పొద్దు. మ‌రింత సిబ్బందిని ,ఉద్యోగుల‌ను నియ‌మించండి. స‌మ‌స్య ఉంద‌ని, త‌ప్పు జ‌రిగింద‌ని మీరే ఒప్పుకుంటున్నారు. అలాంట‌ప్పుడు న్యాయం జ‌ర‌గాల్సిన అవ‌స‌రం లేదా. అస‌లు ప్ర‌భుత్వానికి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌న్న చిత్త‌శుద్ధి లేదు. చేయ‌బోమ‌న్న భావ‌న‌లో ఉన్నారు. ఒక‌వేళ అనుకోకుండా సునామీ వ‌స్తే మీరు ఇలాగే ప్ర‌వ‌ర్తిస్తారా అంటూ ధ‌ర్మాస‌నం ప్ర‌శ్నించారు. వారంతా మ‌న పిల్ల‌లు. మీ పిల్ల‌లు అయితే ఇలాగే వ్య‌వ‌హ‌రిస్తారా ..బాధితులు , కుటుంబాల‌కు భ‌రోసా ఇవ్వాల్సిన బాధ్య‌త స‌ర్కార్‌దేనంటూ స్ప‌ష్టం చేసింది. అనుభ‌వం లేని సంస్థ‌కు ప‌రీక్ష‌ల బాధ్య‌త‌ను ఎలా అప్ప‌గించారో పున‌ర్ ఆలోచించు కోవాల్సిన అవ‌స‌రం ఇపుడు బోర్డుకు, స‌ర్కార్‌కు ఉంది. ఇంకో వైపు ఈనెల 27 వ‌ర‌కు రీకౌంటింగ్, రీ వెరిఫికేష‌న్ గ‌డువును ఇంట‌ర్ బోర్డు పెంచింది. త‌ప్పులు జ‌రిగితే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, క‌మిటీ నివేదిక రావాల్సి ఉంద‌ని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి చెప్ప‌డంపై పేరెంట్స్, స్టూడెంట్స్ మండిప‌డ్డారు.

కామెంట్‌లు