దాడులపై క్రీడాలోకం ఫైర్

దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో దుండగుల వీరంగాన్ని భారత క్రీడాలోకం ఖండించింది. ముఖాలకు ముసుగులు ధరించిన దుండగులు వర్సిటీలోకి చొరబడి విద్యార్థులు, ప్రొఫెసర్లపై విచక్షణ రహితంగా కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఇందులో విద్యార్థి యూనియన్‌ అధ్యక్షురాలు ఆయుషి ఘోష్‌ సహా 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఉదంతంపై భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్, ఇటీవల రిటైర్మెంట్‌ ప్రకటించిన ఇర్ఫాన్‌ పఠాన్, అగ్రశ్రేణి టెన్నిస్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న, బ్యాడ్మింటన్‌ స్టార్‌ గుత్తా జ్వాల ట్విట్టర్‌లో స్పందిస్తూ దాడిని ముక్త కంఠంతో ఖండించారు. వర్సిటీ క్యాంపస్‌లో జరిగిన హింస భారత దేశ సంస్కృతికి విరుద్ధమైంది. కారణాలేవైనా కావొచ్చు, కానీ విద్యార్థులే లక్ష్యంగా దాడి చేయడం హేయమైన చర్య. ఇలాంటి దుండగులను కఠినంగా శిక్షించాల్సిందేనని పేర్కొన్నారు.

ఈ ఘటన దారుణమైనది. దీనిని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఏకంగా క్యాంపస్‌లోపలే ఉన్న హాస్టళ్లలో చొరబడి ఇలా విచక్షణా రహితంగా దాడి చేయడం మన దేశ ప్రతిష్టను మరింత దిగ జార్చుతుంది. యూనివర్సిటీ క్యాంపస్‌లో భయానక దాడి జరిగింది. ఇది సిగ్గుచేటు. ఎవరైతే ఈ దురాగతానికి పాల్పడ్డారో వారిని కచ్చితంగా కఠినంగా శిక్షించాలని కోరారు. ఇంత జరిగాక కూడా మౌనమేంటి. విద్యార్థుల్ని ఎలా చావబాదారో చూశాం. దుండగుల్ని ఉపేక్షించడం ఎంత మాత్రం తగదు. పట్టుకొని శిక్షించాల్సిందేనని అన్నారు గుత్తా జ్వాలా. ఇదిలా ఉండగా దేశమంతటా ఈ సంఘటనపై భారీ ఎత్తున నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఫైర్ అయ్యారు. ఈ దాడిని ముంబై పేలుళ్ల దాడితో పోల్చారు.

ఇనుప రాడ్లు, హాకీ స్టిక్‌లతో విద్యార్ధులు, టీచర్లపై విరుచుకు పడటం హేయమైన చర్యగా అభివర్ణించారు. దాడులను తమ ప్రభుత్వం ఎంత మాత్రం సహించదని, ఈ ఘటనకు వ్యతిరేకంగా పెద్దసంఖ్యలో వీధుల్లోకి వచ్చిన విద్యార్దులకు ఆయన భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై సత్వరమే నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని ఢిల్లీ పోలీసులను ఆయన కోరారు. దేశంలో విద్యార్ధులు అభద్రతకు లోనయ్యే పరిస్థితి నెలకొందని, జేఏన్‌యూలో జరిగిన ఘటనలు మహారాష్ట్రలో తాను జరగనివ్వనని స్పష్టం చేశారు. యువతను రెచ్చగొట్టి వారితో చెలగాట మాడవద్దని హెచ్చరించారు.  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!