దీపికకు అనురాగ్ అండ

ఇది పబ్లిసిటీ స్టంట్‌ లేదా మరొకటి అయితే ఏంటి? ఈ వ్యాపారంలో ఉన్న ప్రతీ ఒక్కరు ఇలాగే మాట్లాడతారు. ముఖ్యంగా నువ్వు ఈ సినిమాకు ఓ నిర్మాతవు కాబట్టి ఇంకా ఎక్కువ చేస్తారు. అయినా పర్లేదు అంటూ బాలీవుడ్‌ దర్శక, నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌..బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనెకు అండగా నిలిచాడు. దీపిక చూపించిన ధైర్యానికి ప్రతీ ఒక్కరు ఆమెను ప్రశంసించాలని పేర్కొన్నాడు. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్‌ యూనివర్సిటీని సందర్శించినందుకు నెటిజన్లు దీపికపై మండి పడుతున్న సంగతి తెలిసిందే. జేఎన్‌యూ విద్యార్థులు, ప్రొఫెసర్లపై ముసుగు దుండగుల దాడిని నిరసిస్తూ నలుపు రంగు దుస్తులు ధరించిన దీపిక.. అక్కడికి వెళ్లడాన్ని కొంతమంది సహించలేక పోతున్నారు. తన తాజా సినిమా ఛపాక్‌ ప్రమోషన్‌ కోసమే దీపిక చవకబారు చర్యలకు దిగిందని ట్రోల్‌ చేస్తూ.. సినిమాకు బుక్‌ చేసుకున్న టికెట్లను రద్దు చేసుకుంటున్నారు. 

ఈ విషయం గురించి అనురాగ్ కశ్యప్‌ మాట్లాడుతూ..ఆయిషీ ఘోష్‌ ముందు చేతులు జోడించి నిల్చున్న దీపిక ఫొటో ప్రతీ ఒక్కరికి గొప్ప సందేశాన్ని ఇచ్చింది. అది కేవలం దీపిక ప్రకటించిన సంఘీభావం మాత్రమే కాదు. నీ బాధను నేను కూడా అనుభవిస్తున్నాను అని చెప్పడం. తన చర్య ఎంతో మందికి ధైర్యాన్నిచ్చింది. భయం లేకుండా జీవించాలని చెప్పింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. అయితే దీపిక.. జేఎన్‌యూకు వెళ్లడం ద్వారా ఆ భయాన్ని జయించింది. అందుకే తన పేరు మారు మ్రోగిపోతుంది అని దీపికపై ప్రశంసలు కురిపించాడు. తను ఇచ్చిన స్పూర్తితో భయంతో విసుగెత్తి పోయిన ప్రజలు..దానిని దాటుకుని ముందుకు సాగుతారని అభిప్రాయ పడ్డాడు.

ఇక అనురాగ్‌ కశ్యప్‌ సైతం ట్రోలింగ్‌ బాధితుడన్న సంగతి తెలిసిందే. జేఎన్‌యూలో దాడిని నిరసిస్తూ.. మాస్క్‌లు ధరించిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిషాల ఫోటోను ట్విటర్‌ ప్రొఫైల్‌ పిక్‌గా పెట్టి విమర్శల పాలయ్యాడు. ప్రస్తుతం ఆ స్థానంలో దీపిక ఫొటో పెట్టి మరోసారి ట్రోలింగ్‌ బారిన పడ్డాడు. కాగా మేఘనా గుల్జార్‌ దర్శకత్వంలో యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల​ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఛపాక్‌..ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు దీపిక ఓ నిర్మాతగా వ్యవహరించాన్న సంగతి తెలిసిందే. అయితే తన సినిమాను ప్రమోట్ చేసేందుకే దీపికా ఇలా చేస్తోందని కామెంట్స్ వచ్చాయి. 

కామెంట్‌లు