టీసీఎస్‌కు భారీ షాక్
ఐటీ సెక్టార్ లో దిగ్గజ కంపెనీగా పేరున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ - టీసీఎస్‌కు భారీ షాక్ తగిలింది. తాజాగా క్యూ - 2 ఫలితాలు అంచనాలు తలకిందులయ్యాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు ఆరంభంలో 400 పాయింట్లకు పైగా ఎగిసినప్పటికీ టీసీఎస్ షేరు టాప్ లూజర్‌గా నిలిచింది. గతేడాది సెప్టెంబరు త్రైమాసిక ఆదాయాలు మార్కెట్ అంచనాలను అందు కోలేక పోవడంతో టీసీఎస్ షేర్లు 4 శాతం క్షీణించాయి. అటు కీలక సూచీలు కూడా ట్రేడర్ల అమ్మకాలతో భారీ లాభాల నుంచి వెనక్కి తగ్గాయి. సెన్సెక్స్, నిఫ్టీ కీలక మద్దతు స్థాయిలను కోల్పోయి స్వల్ప లాభాలతో తీవ్ర ఊగిసలాట మధ్య కొనసాగుతున్నాయి.
మార్కెట్ ముగిసిన తరువాత ప్రకటించిన ఫలితాల ప్రకారం.. ఈ ఏడాది రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలను అందు కోలేక పోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో కంపెనీ నికర లాభం 1.8 శాతం వృద్ధి చెంది 8,042 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నికర లాభం 7,901 కోట్లు. ఇక జూలై, సెప్టెంబర్ త్రైమాసికంలో ఆదాయం 5.8% పెరిగి 36,854 కోట్ల నుంచి 38,977 కోట్లకు చేరింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఆదాయ వృద్ధి 8.4 శాతంగా నమోదైంది.
ఒక రూపాయి ముఖ విలువ గల షేరు ఒక్కింటికి 5 చొప్పున రెండో విడత మధ్యంతర డివిడెండుతో పాటు 40 మేర ప్రత్యేక డివిడెండ్ చెల్లించాలని టీసీఎస్ బోర్డు నిర్ణయించింది. ఇదే సమయంలో ఇతర ఐటీ కంపెనీలు సైతం భారీ లాభాలు మూట గట్టుకున్నాయి. మరో వైపు ఆర్ధిక మందగమనం వ్యాపార, వాణిజ్య, తదితర రంగాలను ప్రభావితం చేస్తోంది. దీంతో కాస్ట్ కటింగ్ మంత్రాన్ని అన్ని కంపెనీలు జపిస్తున్నాయి. ప్రత్యేకించి ఐటీ సెక్టార్ లో కొత్త శకం ప్రారంభమైంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ, మెషిన్ లెర్న్ , ఎథికల్ హ్యాకింగ్, డేటా అనలిటిక్స్ కోర్సులకు భారీ డిమాండ్ ఉంటోంది. మొత్తం మీద దిగ్గజ కంపెనీలన్నీ నష్టాలను పూడ్చుకునే పనిలో పడ్డాయి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి