దిగ్గజ కంపెనీలకు ఝలక్

భారతీయ వ్యాపార రంగాన్ని శాసిస్తున్న ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ కంపెనీ మరో సంచలనానికి శ్రీకారం చుట్టబోతోంది. దేశంలోని ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లకు షాకిస్తూ మరో సంస్థను ప్రారంభించింది. రిలయన్స్‌ జియోతో  దూసుకు పోయిన అంబానీ, తాజాగా ఈ కామర్స్ రంగంలోకి అడుగు పెట్టారు. జియో మార్ట్‌ పేరుతో ఆన్‌లైన్‌ గ్రాసరీ సంస్థను తీసుకొచ్చారు. దేశ్ కి నయీ దుకాన్‌ అనే  ట్యాగ్‌లైన్‌ తో జియో మార్ట్‌ను రిలయన్స్‌ లాంచ్‌ చేసింది. అంతే కాదు తన కొత్త వెంచర్‌లో నమోదు చేసుకోవాల్సిందిగా జియో వినియోగదారులకు ఆహ్వానాలు పంపింది. భారీ తగ్గింపు ధరలు, ఆఫర్లతో ఆకట్టుకున్న రిలయన్స్‌ ఇపుడు జియో మార్ట్‌ ద్వారా మరోసారి విధ్వంసానికి తెరతీసింది.

ముందుగా రిజిస్టర్‌ చేసుకున్న వారికి 3 వేల విలువైన కూపన్లను అందివ్వనుంది. వాటిని వినియోగదారులు జియో మార్ట్‌లో వస్తువులను కొనుగోలు చేసే సమయంలో ఉపయోగించుకుని ఆ మేర డిస్కౌంట్‌ పొందవచ్చు. ప్రస్తుతం పైలట్‌ ప్రాజెక్టు కింద మూడు ప్రాంతాల్లో నవీ ముంబై, థానే, కళ్యాణ్‌ ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులో వుంటాయి. త్వరలోనే దేశ వ్యాప్తంగా విస్తరించనుంది. హోం డెలివరీ, రిటన్‌ పాలసీ, ఎక్స్‌ప్రెస్ డెలివరీ లాంటి సేవలను కూడా అందిస్తోంది. రిలయన్స్‌ జియో మార్ట్‌ ద్వారా 50 వేలకు పైగా సరుకులను విక్రయించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే స్థానికంగా ఉంటున్న రిటైలర్లను రిలయన్స్‌ ఈ సేవలో భాగస్వామ్యం చేయనుంది.

కాగా రిలయన్స్ రిటైల్, జియో సంయుక్తంగా దేశంలో కొత్త వాణిజ్య సంస్థను ప్రారంభించనున్నట్లు ముకేష్ అంబానీ గతేడాది లో ప్రకటించిన విషయం విదితమే. ఇదిలా ఉండగా ఇప్పటికే అతిపెద్ద టెలికాం నెట్ వర్క్ కలిగిన ఈ కంపెనీకి మార్ట్ ను విస్తరించడం ఏమంత కష్టం కాదు. దీంతో మిగతా ఈ కామర్స్ కంపెనీలకు ఒకరకంగా బుగులు పుట్టించేలా చేశారు ముకేశ్ అంబానీ. అయితే వినియోగదారులకు మాత్రం ఎటూ పాలుపోని పరిస్థితి నెలకొన్నది. ఓ వైపు ఊరించే వస్తువులు, భారీ డిస్కౌంట్లతో ఏది కొనాలో తెలియక టెన్షన్ కు గురయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!