మరాఠాలో మహా పాలిటిక్స్

రోజుకో ట్విస్టుతో మరాఠా రాజకీయం మరింత హీటెక్కిస్తోంది. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.నిన్నటి దాకా బీరాలు పలికిన ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్‌ పవార్‌ ఉన్నట్టుండి డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీలో బలపరీక్ష చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పవార్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అజిత్‌ తాజా నిర్ణయంతో బీజేపీకి ఊహించని షాక్‌ తగిలింది. ఎన్సీపీలో సగం మంది ఎమ్మెల్యేలతో ఫడ్నవిస్‌కు మద్దతు ప్రకటించిన అజిత్‌.. వెంటనే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అజిత్‌ నిర్ణయానికి షాకైన.. ఆ పార్టీ చీఫ్‌ శరద్‌ పవార్‌ తన చాతుర్యంతో తిరుగుబాటు ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకున్నారు.

మొత్తం 54 ఎమ్మెల్యేలలో దాదాపు 52 మంది సభ్యులు తమతో ఉన్నారని శరద్‌ ప్రకటించారు. దీంతో పార్టీని చీల్చిన అజిత్‌ చివరికి ఒంటరిగా మిగిలారు. ఈ నేపథ్యంలో అజిత్‌ను వెనక్కి తీసుకొచ్చేందుకు కూడా శరద్‌ పావులు కదిపారు. పలువురు కీలక నేతలను పంపి..ఆయనతో చర్చలు జరిపారు. ఎంతకూ అజిత్‌ వెనక్కి తగ్గక పోవడంతో శరద్‌ పవార్‌ భార్యను రంగంలోకి దింపారు. ఆమె అజిత్‌తో సమావేశమైన గంటల వ్యవధిలోనే డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో బలపరీక్షలో ఫడ్నవిస్‌ ప్రభుత్వం నెగ్గుకు రావడం సవాలుగా మారింది.

ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడ బలంలేని నేపథ్యంలో సీఎం పదవికి ఫడ్నవిస్‌ కూడా రాజీనామా చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామం ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్‌ శిబిరంలో సంతోష వాతావరణం నెలకొనగా, అధికార బీజేపీ శ్రేణులకు మాత్రం ఇది మింగుడు పాడడం లేదు. ఇప్పటికే తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలం తమకు ఉందంటూ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన ప్రకటించాయి. అంతే కాకుండా బల నిరూపణకు సిద్ధమని ఇప్పటికే ప్రకటించారు. మొత్తం మీద మరాఠా ప్రజలు మాత్రం తీవ్ర ఉత్కంఠకు లోనవుతున్నారు.

తాజాగా మరో ట్విస్టు చోటు చేసుకుంది. ఉన్నపలంగా సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన ఆనందం కొద్దిసేపే అనుభవించారు ఫడ్నవిస్. సరైన సంఖ్యా బలం లేని కారణంగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రిజిగ్నేషన్ లెటర్ ను గవర్నర్ ను కలిసి అందజేశారు. దీంతో వెంటనే గవర్నర్ ఆయన రాజీనామాను ఆమోదించారు. ప్రొటెం స్పీకర్ గా కాళిదాస్ కోలంకర్ ను నియమించారు. ఉదయం ఎనిమిది గంటలకు అందరు ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించాలని ఆదేశించారు గవర్నర్ కోశ్యారి. దీంతో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

కామెంట్‌లు