అంతటా అరెస్టులు..కొనసాగుతున్న సమీక్షలు


బేషరతుగా సమ్మెను విరమిస్తున్నామని, ఇక కార్మికులు విధుల్లోకి చేరుతారని ఆర్టీసీ జేఏసీ నేతలు చేసిన ప్రకటన తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తాము ఎట్టి పరిస్థితుల్లో విధుల్లోకి తీసుకోబోమంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో కార్మికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ సంస్థపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పలు దఫలాలుగా చర్చలు జరిపారు. తాజాగా సమీక్ష కూడా చేపట్టారు. ప్రగతి భవన్‌లో జరిగిన మీటింగ్ లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌, ఆర్టీసీ ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ నివేదికపై ఈ సమీక్షా సమావేశంలో కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ నివేదికను రాష్ట్ర కేబినెట్‌ భేటీలో చర్చించనున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రూట్లను ప్రైవేటీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర హైకోర్టు కూడా రూట్ల ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆర్టీసీకి సంబంధించిన తాజా పరిణామాలను సీఎం కేసీఆర్‌ అధికారులను అడిగి తెలుసు కున్నట్టు తెలుస్తోంది. మరో వైపు ప్రజలు, కార్మికుల కోణంలో ఆలోచించి సమ్మె విరమించాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ జేఏసీ తెలిపింది. ప్రభుత్వం అవునన్నా, కాదన్నా కార్మికులు విధులకు హాజరు కావాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. అయితే, కార్మికులు సమ్మె విరమించినా, విధుల్లోకి తీసుకునేది లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.

విధుల్లో చేరతామని ఆర్టీసీ జెఏసీ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందంటూ ఆర్టీసీ ఇంచార్జ్‌ ఎండీ సునీల్‌ శర్మ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఓ వైపు పోరాటం కొనసాగుతుంది అని ప్రకటిస్తూనే..మరోవైపు సమ్మె విరమించి విధుల్లో చేరతామని జేఏసీ చెప్పడాన్ని తప్పు బట్టారు. ఈ క్రమంలో విధుల్లోకి చేరేందుకు డిపోల వద్దకు పెద్దసంఖ్యలో కార్మికులు చేరుకున్నారు. భారీ ఎత్తున మోహరించిన పోలీసులు కార్మికులను అడ్డుకొని ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా డిపోల వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. 

కామెంట్‌లు