సెంటిమెంట్ వర్కవుట్


మన ఇండియన్స్ కు సెంటిమెంట్స్ ఎక్కువ. దేనిని తట్టుకోలేరు. సంతోషం వచ్చినా చివరకు కన్నీళ్లు వచ్చినా ఆపుకోలేరు. భారతదేశంలో ఇప్పుడు ఒకే ఒక్క టాపిక్ వైరల్ గా మారింది. మరాఠాలో ఎవరు పీఠాన్ని చేజిక్కిచ్చుకుంటారో తెలియక తంటాలు పడుతున్న సమయంలో ఒక్కసారిగా సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు శరద్ పవార్. దీంతో మాహారాష్ట్ర రాజకీయాలు మరింత రంజుగా మారాయి. ఇప్పటికే భారతీయులకు సెంటిమెంట్‌ ఎక్కువ అన్నది ఎవరు కాదనలేని వాస్తవం. అందుకే మనోళ్లను సెంటిమెంటల్‌ ఫూల్స్‌ అని వెక్కిరిస్తుంటారు. సెంటిమెంట్‌కు ఆయింట్‌మెంట్‌ కూడా లేదని సరదాగా అంటుంటారు. ఈ మాటకేమో గానీ సెంటిమెంట్‌తో రాజకీయాల్లోనూ బాగా నెగ్గుకు రావొచ్చని తాజాగా నిరూపితమైంది.

మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న తీవ్ర సంక్షోభం ఒక్క సెంటిమెంట్‌ సీన్‌తో సమసి పోయిందంటే ఆశ్చర్య పడాల్సిన పని లేదు. వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ఎత్తులు, పైఎత్తులతో నెల రోజులుగా వేడెక్కిన మరాఠ రాజకీయాలు చివరకు సెంటిమెంట్‌‌ సీన్‌తో కొలిక్కి వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన కలిసి రాక పోవడంతో బీజేపీ తెలివిగా ఎన్సీపీ శాసనసభా పక్షనేతగా ఉన్న అజిత్‌ పవార్‌ను తన వైపు తిప్పుకుంది. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి ఎన్సీపీలో చీలిక తేవాలని కుట్ర చేసింది. వెంటనే అప్రమత్తమైన ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ తమ ఎమ్మెల్యేలు చేజారి పోకుండా మంత్రాంగం నడిపారు. అజిత్‌ పవార్‌ను శాసనసభా పక్షనేత పదవి నుంచి తొలగించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తనతో పాటు మిత్రపక్షాల ద్వారా అజిత్‌ను వెనక్కి పిలిచారు. ఇన్ని చేసినా అజిత్‌ పవార్‌ కమళ దండును వదిలి వెనక్కు రాలేదు. ఈలోగా మూడు రోజులు గడిచి పోయాయి.

తన ప్రయత్నాలు ఫలించక పోవడంతో ‘పెద్దాయన’ తన సతీమణి ప్రతిభ పవార్‌తో అజిత్‌కు రాయబారం పంపారు. బీజేపీ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పదవిని వదిలిపెట్టి వస్తే పవార్‌ పరివారంలో కలతలు సమసి పోతాయని, శివసేన కూటమి ప్రభుత్వంలో తిరిగి డిప్యూటీ సీఎం పదవి వస్తుందని అజిత్‌ను స్వయంగా కలిసి చిన్నమ్మ బుజ్జగించారు. చెల్లెలు సుప్రియా సూలే కూడా అన్నయ్యకు నచ్చ జెప్పారు. వీరిద్దరి మాటలతో మెత్తబడ్డ అజిత్‌ వెంటనే బీజేపీ ఇచ్చిన పదవికి రాజీనామా చేసేసి సొంత గూటికి తిరిగి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ ఘటనపై సోషల్‌ మీడియాలో కామెంట్లు పోటెత్తున్నాయి. సినిమాల్లోనే కాదు సెంటిమెంట్‌ సీన్‌ ఎక్కడైనా పండుతుందని మరోసారి రుజువైందని నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!