బస్ భవన్ ఉద్రిక్తం..సమ్మె తీవ్రతరం
తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె తీవ్రతరమైంది. ఆర్టీసీ జేఏసీ నేతృత్వంలో జరుగుతున్న ఈ ఆందోనళకు విపక్షాలు, ప్రజా సంఘాలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు పూర్తి మద్దతు ప్రకటించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం మెట్టు దిగడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి కార్మికులను విధుల్లోకి తీసుకోబోమంటూ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు కొత్తగా బస్సులతో పాటు ఖాళీలను భర్తీ చేయాలని ఉన్నతాధికారులను, సంబంధిత శాఖా మంత్రిని ఆదేశించారు. దీనిపై హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. సమ్మెపై ధర్మాసనం కీలకమైన వ్యాఖ్యలు చేసింది. రోడ్లపై బస్సులు కనిపించడం లేదని, బస్సుపాసులు అనుమతించడం లేదని, చార్జీలు ఎక్కువగా వసూలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించింది.
ప్రభుత్వం పూర్తి వివరాలు సమర్పించక పోవడంపై సీరియస్ అయ్యింది. అయినా సర్కార్ లో చలనం లేకుండా పోయింది. ఇంకో వైపు వేలాది కుటుంబాలు రోడ్డెక్కితే సీఎం ఉన్నట్టుండి టీజేఏసీ నేతలతో సమావేశం కావడం విస్తు పోయేలా చేసింది. వీరు కనుక ఒకవేళ ఆర్టీసీ కార్మికులకు మద్దతు పలికితే కష్టమవుతుందని పిలిచారని విపక్షాలు మండిపడ్డాయి. ఇదిలా ఉండగా అన్ని పార్టీల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే తన వైఖరిని మార్చు కోవాలని, ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా సర్కార్ కు కనువిప్పు కలిగేలా తమ పోరాటం కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామ రెడ్డి, రాజి రెడ్డిలు ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో తలవంచే ప్రశక్తి లేదన్నారు. మరో వైపు అన్ని డిపోల వద్ద కార్మికుల ఆందోళనలు చేపట్టారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా వారిని దాటుకుని నిరసన తెలిపారు.
బస్టాండులు, ప్రధాన రహదారులపై కార్మికులు ఆందోళన చేపట్టారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను మహబూబ్ నగర్ లో కార్మికులు అడ్డుకున్నారు. ప్రజాప్రతినిధులను, వివిధ సంఘాల వారిని కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపై స్పందించిన ఉద్యోగ సంఘాలు, స్టూడెంట్ యూనియన్లు, రాజకీయ పార్టీలు ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటించాయి. ఆందోళనల్లో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో బస్ భవన్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తం గా మారింది. బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ లక్ష్మణ్, రామచంద్ర రెడ్డి, అశ్వత్థామ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. కార్మికులు భవనం పైకి ఎక్కేందుకు ప్రయత్నం చేశారు. పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్యతో పాటు ఇతర నేతలను బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు. మూడు గంటలకు పైగా ఆందోళన చేపట్టారు. ఇదిలా ఉండగా రవాణా శాఖా మంత్రి మాత్రం సమ్మెతో సంబంధం లేదన్నారు. ప్రభుత్వ పరం చేస్తామని చెప్పలేదన్నారు. కాగా మొత్తం మీద ఆర్టీసీ కార్మికులకు అన్ని వైపులా మద్దతు పెరుగుతోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి