గీడ మీ గూండాగిరీ చెల్లదు..కేసీఆర్ సీరియస్
గీడ మీ గూండాగిరీ నడవదు. ఇంత దాకా ఓపిక వహించాం. ఇక నుంచి ఉపేక్షించం. మరింత కఠినంగా ఉండబోతున్నాం. ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేసినా అరెస్టులు చేస్తాం. జైళ్లకు తరలిస్తాం. ప్రజలు ఇబ్బంది పడకుండా చూస్తాం. మరిన్ని కొత్త బస్సులు నడుపుతాం. కొత్త వారిని తీసుకుంటాం. కాదని అడ్డంకులు సృష్టిస్తే తగిన గుణపాఠం నేర్పుతామని తీవ్ర హెచ్చరికలు చేశారు సీఎం కేసీఆర్. ఆర్టీసీ సమ్మెపై సమీక్ష చేశారు. ప్రతి ఆర్టీసీ డిపో, బస్టాండ్ల వద్ద పోలీసు బందోబస్తు పెంచాలని, అన్నిచోట్ల సీసీ కెమెరాలు పెట్టాలని డీజీపీని ఆదేశించారు. మహిళా పోలీసులను కూడా బందోబస్తు కోసం వినియోగించాలని, నిఘా పోలీసులను ఉపయోగించాలన్నారు.
ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వారిని, బస్సులను ఆపే వారిని, ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిని గుర్తించి, కేసులు పెట్టి, కోర్టుకు పంపాలని, ఉద్యమం పేరిట విధ్వంసం సృష్టిస్తే ఉపేక్షించాల్సిన అవసరం లేదన్నారు. యూనియన్ నేతలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. కార్మికులు తమంతట తామే విధులకు హాజరు కాలేదు. దీంతో వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయారు. ఎవరూ ఎవరిని డిస్మిస్ చేయలేదు. సూపర్ వైజర్లను కూడా సమ్మెలోకి లాగారు. ఈ నేతల నిర్వాకం వల్లనే 48 వేల మంది తమ కొలువులు పోగొట్టుకున్నారు. ఇక వీళ్ళను క్షమించే ప్రసక్తి లేదన్నారు సీఎం. మొత్తం మీద కేసీఆర్ సమ్మెపై గరం గరంగానే ఉన్నారు. ఇదిలా ఉండగా కోర్టు తీర్పు ఏమి చెప్ప బోతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి