మెరిసిన మిథాలీ..మనదే వన్డే సిరీస్

పక్కా హైదరాబాదీ అమ్మాయి మిథాలీ రాజ్ మళ్ళీ మెరిసింది. ఇప్పటికే మహిళా క్రికెట్ లో పురుషుల అధిపత్యానికి తన ఆట తీరుతో చెక్ పెట్టింది. హైదరాబాద్ నుంచి ఎందరో ఆటగాళ్లు జాతీయ స్థాయి జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. వారిలో మహమ్మద్ అజాహారుద్దీన్, శివలాల్ యాదవ్, వెంకటపతి రాజు, లక్ష్మణ్, అర్షద్ అయూబ్, తదితరులు ఉన్నారు. వీరితో పాటు ఇండియాకు మహిళా జట్టు తరపున మన మిథాలీ అటు అందంలోనూ ఇటు ఆటలోను తనదైన శైలితో దూసుకెళుతోంది. తాజాగా వడోదరలో సౌత్ ఆఫ్రికా జట్టుతో జరిగిన రెండో వన్డేలో రాణించింది.

ఇప్పటికే టి20 సిరీస్‌ను గెల్చుకున్న భారత మహిళల జట్టు అదే దూకుడుతో వన్డే సిరీస్‌ను వశం చేసుకుంది. భారత్‌ జట్టు 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు ను పూనమ్‌ రౌత్‌ అందుకుంది.  మహిళా జట్టు సారథి మిథాలీ రాజ్‌ 82 బంతుల్లో 8 ఫోర్స్ తో 66 పరుగులు చేసింది. వీరిద్దరూ సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ ప్లేయర్స్ కు చుక్కలు చూపించారు. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్‌ ఇంకో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2–0తో దక్కించుకుంది. తొలుత దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. ఆరంభంలో ఓపెనర్లు లిజెల్లే లీ 40  పరుగులు చేయగా లారా వోల్వార్డ్‌ అద్భుతంగా రాణించింది.

ఆమె 7 ఫోర్స్ తో 69 పరుగులు చేసింది. తొలి వికెట్‌కు వీరిద్దరూ 76 పరుగులు జోడించి శుభారంభం చేశారు.
అనంతరం ప్రీజ్‌ రాణించడంతో ఒక దశలో దక్షిణాఫ్రికా  మూడు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసి పటిష్టంగా కనిపించింది. అయితే చివర్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తూ వికెట్లు తీయడంతో పర్యాటక జట్టు అనుకున్న దానికంటే తక్కువ స్కోరుకే పరిమితమైంది. శిఖా పాండే, ఏక్తా బిష్త్, పూనమ్‌ యాదవ్‌ చెరో రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు. అనంతరం భారత్‌ 48 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది.  మొత్తం మీద ఓ వైపు విరాట్ కోహ్లీ జట్టు సౌత్ ఆఫ్రికాపై దుమ్ము రేపుతుంటే ఇంకో వైపు మహిళా జట్టు తమకు ఎదురే లేదంటోంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!