ఓటర్లకు వందనం..ప్రజా తీర్పు శిరోధార్యం

తమిళనాడులో జరిగిన ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి నేను పార్టీ తరపున కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నాను అని డీఎంకే ప్రెసిడెంట్ స్టాలిన్ చెప్పారు. రెండు నియోజకవర్గాల్లో అధికార పార్టీకి చెందిన అన్న డీఎంకే అభ్యర్థులు గెలుపొందారు. దీంతో డీఎంకేలో కొంత నిరాశ అలుముకుంది. దీనిని పటాపంచలు చేస్తూ స్టాలిన్ కార్యకర్తలు, నాయకుల్లో స్తైర్యం నింపే ప్రయత్నం చేశారు. ప్రజా తీర్పును మేం గౌరవిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఇది మామూలే. గెలుపు ఓటములు సహజమే. అయితే ఇదే ఫలితం 2021లో వుండబోదని ఆయన వ్యాఖ్యానించారు.

ఉప ఎన్నికలు జరిగిన నాంగునేరి, విక్రవాండి నియోజకవర్గాల్లో అన్నాడీఎంకే ఘన విజయం సాధించింది. ఉప ఎన్నికల్లో డీఎంకే కూటమికి ఓటేసిన ఓటర్లు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అధికారపార్టీ ధనబలం, అధికార దుష్ప్రయోగం వల్లే గెలిచింది. పలు ఆటంకాలు ఎదురైనా వాటిని చేధించి డీఎంకే కూటమికి ప్రజలు ఓటేశారు. ప్రజా తీర్పు భగవంతుడి తీర్పు అని అన్నాదురై చెప్పే వారు. ఆ క్రమంలో ప్రస్తుతం ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరిస్తున్నాం.

గెలిస్తే ఉప్పొంగి పోవడం, ఓడితే నిరాశ చెందడం డీఎంకే నైజం కాదు. కలైంజర్‌ బాటలోనే అన్నింటినీ సమానంగా స్వీకరించే మనస్తత్వం డీఎంకేది. మా కూటమికి ఓటేయని ఓటర్ల నమ్మకాన్ని పొందేందుకు మరింత కృషి చేస్తాం. ఈ ఉప ఎన్నికల్లో రాత్రనక, పగలనక శ్రమించిన ఎన్నికల నిర్వాహకులు, కార్యకర్తలు, మిత్ర పక్షాల నేతలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు ఓడి పోయినా రేపు తప్పక మనం గెలుస్తాం అని స్టాలిన్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.

కామెంట్‌లు