కేసీఆర్‌కు మేధావుల లేఖాస్త్రం
తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతోంది. వీరి న్యాయపరమైన డిమాండ్లను సానుభూతితో పరిష్కారించాలని అన్ని విపక్షాలు, విద్యార్ధి, మహిళా సంఘాలతో పాటు సకల జనులు మద్దతు పలికారు. ఈ విషయంపై రాష్ట్ర ధర్మాసనం స్పందించింది. వేతనాలు వెంటనే చెల్లించాలని, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, యుద్ధ ప్రాతిపదికన సమస్య మరింత జఠిలం కాకుండా పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని ఆదేశించింది. అంతే కాకుండా కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది కూడా. ప్రజాగ్రహం వస్తే ప్రమాదమని గ్రహించాలని, ఎంత పెద్ద సమస్య అయినా కూర్చుని చర్చలు జరిపితే పరిష్కారం అవుతాయని తెలిపింది.
కార్మికులు చేస్తున్న సమ్మె ధర్మ బద్దమైనదే. కాక పోతే పండుగ సమయంలో చేయడం భావ్యం కాదంటూ పేర్కొంది. కార్మికుల సమ్మెకు తాజాగా మేధావులు, సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు తమ సంతకాలతో కూడిన లేఖను విడుదల చేశారు.. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని, సమ్మె విరమింప జేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మధ్యవర్తిగా ఉండి సమస్యను పరిష్కరించడానికి ఎవరూ చొరవ ప్రదర్శించక పోవడమే కారణంగా భావిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడిందని, అనుభవం, అర్హత లేని డ్రైవర్లతో ప్రతి రోజూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సుల్లేక నిత్యం కోటి మందికి పైగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
చర్చలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని తెలంగాణ పౌర సమాజం భావిస్తోందని, సమాజంలో నెలకొన్న సంక్షోభం, అశాంతిని నివారించాలని విజ్ఞప్తి చేశారు. సీనియర్ జర్నలిస్టులు పొత్తూరి వెంకటేశ్వర్‌రావు, ఏబీకే ప్రసాద్, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరాం, రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్‌రావు, సీనియర్ జర్నలిస్టులు పాశం యాదగిరి, సతీశ్‌చందర్, స్వాతంత్య్ర సమరయోధురాలు సుగుణమ్మ, డాక్టర్ చెరుకు సుధాకర్, తదితరులు కలిసి సీఎం కేసీఆర్‌కు లేఖ రాసినట్లు పాశం యాదగిరి, చంద్రకుమార్ వెల్లడించారు.
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సీఎంకు రాసిన లేఖను విడుదల చేశారు. సకల జనుల సమ్మె తర్వాత మళ్లీ సకల జనులు సమ్మె జరపాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి మాట్లాడుతూ తమవి గొంతెమ్మ కోర్కెలు కావని, అద్దె బస్సులకు టెండర్లను వేస్తూ కార్మికులను రెచ్చ గొడుతున్నారని తెలిపారు. ప్రజా రవాణాను పటిష్ఠం చేసేందుకే విలీనం చేయాలని కోరుతున్నామన్నారు. సమావేశంలో ట్రేడ్ యూనియన్ నాయకుడు నర్సింహ, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి