అనైతిక విజయం ఇది - కేసీఆర్ పై దాసుజు ఫైర్
ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలిచినంత మాత్రాన, తెలంగాణ సమాజం మొత్తం ఆమోదించినట్టు కాదని గుర్తు పెట్టు కోవాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. సముద్రంలో అలలు ఉన్నట్టు ఆటుపోట్లు సహజం. ఓటమిని స్వీకరించాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీపై ఉంటుందన్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అపజయాన్ని స్వీకరిస్తోందని చెప్పారు. అధికారంలో ఉన్నంత మాత్రాన ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు బాగున్నట్టు కాదు. నిన్న ముఖ్యమంత్రి చాలా అహంకార పూరితంగా, అప్రజస్వామికంగా మాట్లాడారు. హుజూర్ నగర్ గెలుపుపై మాట్లాడుతున్నాని చెప్పిన సీఎం 90 శాతానికి పైగా ఆర్టీసీ కార్మికులు, యూనియన్ నాయకులు, విపక్షాలపై నోరు పారేసుకున్నారు.
హక్కులు కాలరాస్తామని, ప్రతిపక్షాలు తమ పంథా మార్చు కోవాలని అన్నారు. సంతలో గొడ్లను కొనుగోలు చేసినట్లు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేశారు. ప్రజలను ప్రభావితం చేశారు. అత్యంత భాద్యతా రాహిత్యంతో, గెలుపు అహంభావంతో కేసీఆర్ మాట్లాడారు. ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదన్నారు శ్రవణ్. ప్రశ్నించే గొంతులను నులిమి వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కార్మికులను మనుషులుగా చూడలేదు. ఆయన చేసేవన్నీ నీతి మాలిన పనులు. మరో వైపు నీతులు వల్లె వేస్తూ విపక్షాలపై నోరు పారేసు కోవడం ఆయనకే చెల్లిందన్నారు. కిలో చికెన్ ఇవ్వకుండా, మద్యం ఇవ్వకుండా, 2 వేల నోటు ఇవ్వకుండా ఎలా గెలిచారో ఆయన అంతరాత్మకు వదిలేస్తున్నామని అన్నారు. తాను కొలిచే యాదగిరిగుట్ట లక్ష్మి నరసింహ్మ స్వామి, లేదా తాను కొలిచే అమ్మ వారిపై ప్రమాణం చేసి చెప్పమనండి ఇవేవి లేకుండా హుజూర్ నగర్ లో గెలిచానని సవాల్ విసిరారు దాసోజు.
ఒక తిమింగలం వలె పని చేస్తూ, ఆధిపత్య అహంకారంతో ఒక పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం ను చూస్తూ వుంటే గురువింద సామెత గుర్తుకు వస్తోంది. ప్రతి పక్ష పార్టీలను కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నీతులు చెప్పే ముందు తాను వెనక్కి చూసుకోవాలన్నారు. మొత్తం ప్రెస్ మీట్ పెట్టిందేమో హుజూర్ నగర్ పై. ఎక్కువగా ఆర్టీసీని టార్గెట్ చేశారు. కనీసం ఇంకితం లేకుండా మాట్లాడారు. కార్మికులకు కూడా హక్కులు ఉంటాయని మరిచి పోయి మాట్లాడారు. ముఖ్యమంత్రి స్థాయిని మరిచి పోయి దిగజారి మాట్లాడారు. సమ్మెకు పోతారా అనే అక్కసు తో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. బేవకూఫ్ లని, ఇష్టానుసారం మాట్లాడారు. సీయం అనే వ్యక్తి తండ్రి లాంటి వారు. కానీ వినక పోతే కొడుతా అన్న రీతిలో రెచ్చి పోయి మాట్లాడారని అన్నారు.
రాష్ట్రానికి ఆయన పెద్ద. నువ్వు పెద్ద దిక్కుగా ఉండాల్సింది పోయి వాళ్ళను అనరాని మాటలన్నారని ఆవేదన వ్యక్తం చేశారు దాసోజు శ్రవణ్. పిల్లలు అలిగితే తండ్రి సముదాయించి అన్నం తినిపించడం సహజం. ఎన్నికల సభలో ఆర్టీసీని విలీనం చేస్తానని చెప్పిన మీరే మాట మార్చారు. కార్మికులను తక్కువ చేసి టార్గెట్ చేశారు. టీఎంయూ ను ఎందుకు ఏర్పాటు చేశారు. అశ్వత్థామ రెడ్డి పేరు ప్రస్తావించకుండా అనరాని మాటలన్నారు. ఈ సంఘానికి హరీష్ రావు గౌరవ అధ్యక్షుడు గా ఉన్నారు. ఆర్టీసీ కార్మికులు కూడా సకల జనుల సమ్మెలో పాల్గొనాలని కోరలేదా, నువ్వు వారితో కలిసి భోజనం చేయలేదా అని ప్రశ్నించారు. హద్దు పద్దు లేకుండా మాట్లాడారంటూ కేసీఆర్ యూనియన్ నేతలపై మండి పడ్డారు. సరే నీ అవసరం కోసం వారిని వాడుకున్నావు. ఇప్పుడు పవర్ లోకి వచ్చాక వారిని వదిలేశావు. ఇప్పుడు సమ్మె చేయడం నేరమంటున్నావు. ఇదెక్కడి నీతి అని దాసుజు నిలదీశారు.
ఎవడయ్యా అని ఒక జర్నలిస్టును బేవకూఫ్ అంటూ మాట్లాడారు. వెకిలి నవ్వులు నవ్వుకుంటూ మాట్లాడారు. కార్మికులు ఓ వైపు పస్తులు పడుతుంటే, వారి బాధను గుర్తించ కుండా దసరా పండుగ చేసుకోలేదు. అందరిని బెదిరిస్తూ కేసీఆర్ మాట్లాడారు. కడుపు మండి ఒక మాట మాట్లాడితే ఆ ఒక్క దానిని మనసులో పెట్టుకుని 50 వేల మంది కార్మికులను పొట్ట గొట్టాడన్నారు. సోనియా గాంధీపై , మన్మోహన్ సింగ్ పై నోరు పారేసుకున్నాడు. అయినా భేషజాలకు పోకుండా కేసీఆర్ తో చర్చలు జరిపాం. దీనిని కేసీఆర్ మర్చి పోయారా అని ప్రశ్నించారు. ఆర్టీసీకి సంబంధించి కాగ్ కు కూడా పూర్తి వివరాలు ఇవ్వడం లేదన్నారు. ఆర్టీసీకి సంబంధించి అప్పుల మీద ఆస్తుల మీద ఆదాయం మీద ఒక శ్వేతపత్రం ఇవ్వడానికి రెడీగా ఉన్నారా అని సవాల్ విసిరారు. మీరేమో చెట్ల మీద విస్తరాకులు కుట్టినట్లు ఇష్టం వచ్చినట్లు మారుతున్నారు.
వేల ఆస్తులు ఉన్నట్లు తమ పరిశీలనలో వెల్లడి అయ్యిందన్నారు. ఆర్టీసీ సేవా సంస్థ నా ప్రైవేట్ సంస్థ నా అని ప్రశ్నించారు. ఈరోజు వరకు పూర్తి స్థాయిలో ఎండీని నియమించలేదు. సీఎం రోజు వారీగా ఈ సంస్థను మానిటరింగ్ చేయలేడు. కావాలని ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టి వేసిన ఘనత కేసీఆర్ దే నని ధ్వజమెత్తారు. ప్రైవేట్ ట్రావెల్స్ లాభాలు గడిస్తున్నాయని చెప్పారు. అది పూర్తిగా అబద్దం. నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. ఇది సీఎం కు తెలియదా, కార్మికులను ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా మాట్లాడటం భావ్యం కాదన్నారు. ఆర్టీసీ, కార్మిక శాఖల మంత్రిగా పనిచేసిన ఆయన సోయి లేకుండా సమ్మెలు చేయొద్దని, ట్రేడ్ యూనియన్లు వద్దంటున్నారు. లక్షల్లో జీతం తీసుకుంటున్న మీరు ఆఫీస్ కు రాకుండా ఉంటున్నారు. మరి మీకెందుకు జీతమని దాసుజు నిలదీశారు.
కోర్టు నీలాగా దిగజారి మాట్లాడలేదు. అత్యున్నత న్యాయ స్థానం చెప్పినా స్పందించలేదు. కోర్టు కొడుతదా అంటూ దెప్పి పొడుస్తూ మాట్లాడారు. నువ్వు చెప్పిన మోటార్ వెహికిల్ చట్టం నీకు వర్తించదు..మరి ఏపీలో జగన్ కు వర్తించదా అని అన్నారు. ఆర్టీసీ ఆస్తులను కబళించేందుకే ఈ మాటలన్నీ మాట్లాడారన్నారు. ఆరోజు విశాఖ పోయిన, టాయిలెట్స్ చూశానని చెప్పారు. మరి ఆర్టీసీ ని లాభాల బాటలో పెట్టేందుకు ఈ ఆరేళ్ళు ఎందుకు తీసుకు రాలేక పోయారని దాసోజు ప్రశ్నించారు. సంఘాలు వద్దు, యూనియన్లు వద్దు అంటున్న కేసీఆర్ టీఎన్ జిఓ , టీజీవో సంఘాల నేతలతో సీఎం ఎందుకు పిలిచి మాట్లాడుతున్నారంటూ నిలదీశారు.
నీ తెలివిని ఎందుకు రావాణా శాఖా అధికారులు, మంత్రికి ఇవ్వలేక పోయారన్నారు. డూడూ బసవన్నలతో మాట్లాడతాడు..కానీ హక్కులను ప్రశ్నించే వారిని మాత్రం ఒప్పుకోడు. తెలంగాణను అప్పుల్లొకి నెట్టి వేసిన ఈ ప్రభుత్వాన్ని ప్రైవేట్ పరం చేయాలా అని దాసుజు ప్రశ్నించారు. నిజాం ఆస్తులను ప్రైవేట్ పరం చేసేందుకు కంకణం కట్టుకున్నాడు. ఈ మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. దీపావళి పండుగ వస్తోంది. కార్మికులకు జీతాలు ఇవ్వాలని కోరుతున్నాం. ఇలాగే చేస్తే నిజాము నవాబుకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందని హెచ్చరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి