నల్లమల - తెలంగాణకే తలమానికం - దేశానికే గర్వకారణం

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నల్లమలలో యురేనియం తవ్వకాలు జరిపే ప్రసక్తి లేదంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు శాసన సభలో ప్రకటించారు. ఎవరు ఎన్ని రాజకీయాలు చేసినా, లేదా కుట్రలు పన్నినా ఇక సాగవని హెచ్చరించారు. గత కొంత కాలంగా నల్లమల ఆందోళనలతో, ధర్నాలతో, నిరసనలతో అట్టుడుకుతోంది. అడవి బిడ్డలు, చెంచులు, గిరిజనలు, మేధావులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కవులు, కళాకారులు, ప్రజాస్వామిక వాదులు, పర్యావరణ వేత్తలు పెద్ద ఎత్తున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకు పడ్డారు. మరో వైపు బాధితులు అమ్రాబాద్, నాగర్ కర్నూల్ లో బంద్ స్వచ్చందంగా చేపట్టారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సంతకం చేశాడంటూ విపక్షాలు ఆరోపణలు చేశాయి. దానిని ఆయన ఖండించారు. తాను తెలంగాణ ఉద్యమం మొదటి నుంచి ఉన్నానని, ఇక్కడ ప్రతి గూడెం, ఇంటికి తిరిగానని ఇదంతా విపక్షాలు కలిసి ఆడుతున్న నాటకమని ఆరోపణ చేశారు.

ఎంపీ రేవంత్ రెడ్డి, తెలంగాణ జన సమితి అధినేత కోదండ రామ్, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జయధీర్ తిరుమల రావు యురేనియం తవ్వకాలను అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. అంతే కాకుండా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అడవి బిడ్డలకు అండగా ఉన్నారు. ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల మొదటగా స్పందించారు. పచ్చని అందాలకు, ఎన్నో వనరులకు నిలయమైన నల్లమలను ధ్వంసం చేసే ఆలోచనను విరమించు కోవాలని, పర్యావరణాన్ని కాపాడు కోవాలని, యురేనియం తవ్వకాలు జరిపితే అపారమైన అటవీ సంపద తో పాటు నీళ్లు , భూమి కలుషితమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై పునరాలోచించాలని మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశారు. కమ్ములకు మద్దతుగా నటీ నటులు తాము సైతం నల్లమలకు అండగా ఉంటామని ప్రకటించారు.

విజయ దేవరకొండ, సమంత, అనసూయ, పవన్ కళ్యాణ్ , మంచు మనోజ్, ఆర్. నారాయణ మూర్తి, నారా లోకేష్, తదితరులు నల్లమలలో యురేనియం వద్దని కోరారు. దీంతో సమస్య దేశ వ్యాప్తంగా వైరల్ కావడం, అన్ని వైపులా వత్తిళ్లు రావడంతో సీఎం కేసీఆర్ స్పందించారు. యురేనియం తవ్వకాల కోసం మొదటి సారిగా 2009 అప్పటి కాంగ్రెస్ సర్కార్ అనుమతి ఇచ్చిందని వెల్లడించారు. అయినా ఎట్టి పరిస్థితుల్లో నల్లమలలో తవ్వకాలు జరిపే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఒక్క చెట్టు కూడా ఎక్కడికీ వెళ్లదన్నారు. ఈ మేరకు యురేనియం ప్రయత్నం మాను కోవాలని కోరుతూ శాసన సభ, శాసన మండలి లో తీర్మానం ప్రవేశ పెడతామని, ఆ తీర్మానం కాపీని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు. దీంతో ఇరు సభల్లో నెలకొన్న సందడి సద్దు మణిగింది. కేటీఆర్ సైతం యురేనియం తవ్వకాలు అంటూ ఏవీ ఉండబోవన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!