విమర్శల జగడం..ఆరోపణల పర్వం..ఏపీ రాజకీయం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బంపర్ మెజారిటీతో కొలువు తీరిన వైకాపా ముచ్చటగా 100 రోజులు పూర్తి చేసుకుంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళుతున్నారు ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి. ఆయనకు కుడి, ఎడమల బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి , ఆళ్ళ రామ కృష్ణా రెడ్డిలు పని చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర బాబు నాయుడు తో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లను టార్గెట్ చేస్తోంది వైసీపీ. తాను అనుకున్నాడంటే చాలు అమలు చేయడం అన్నది హాబీగా మార్చేసుకున్నారు ఏపీ సీఎం. ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేని రీతిలో ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు తారా స్థాయికి చేరుకున్నాయి. నువ్వా నేనా అంటూ ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. మరో అడుగు ముందుకు వెళుతూ ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.

ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వాతావరణం నెలకొని ఉన్నది. పల్నాడులో చలో ఆత్మకూర్ కు శ్రీకారం చుట్టారు టీడీపీ అధినేత బాబు. ఇదే క్రమంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దేశంలో అపర చాణుక్యుడిగా పేరు తెచ్చుకున్న చంద్ర బాబు కు జగన్ మోహన్ రెడ్డి కంట్లో నలుసుగా తయారయ్యాడు. పోలీసులు బాబును వెళ్లనీయకుండా గృహ నిర్బంధంలో ఉంచారు. దీనిపై పెద్ద రాద్దాంతమే జరిగింది. అయినా జగన్ స్పందించలేదు. చాప కింద నీరులా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. ఏపీలో నెలకొన్న ప్రధాన సమస్యలపై దృష్ఠి పెట్టారు. ఆరు వేల కోట్ల అప్పులున్న ఆర్టీసీని ప్రభుత్వ పరం చేశారు. టీడీపీ, జనసేన అధినేతలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు వెంటనే కౌంటర్ ఇచ్చేలా బొత్స, బుగ్గన, అంబటి రామ్ బాబులు రెడీగా ఉంటున్నారు. టీడీపీపై వీరు సైతం తామేమి తక్కువ కాదంటూ విమర్శలు చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ను మంత్రి బొత్స సత్యనారాయణ టార్గెట్ చేశారు. ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఎక్కడా తగ్గడం లేదు.

ఇంకో వైపు చంద్ర బాబు ఏకంగా వైకాపా బాధితుల పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. వైకాపా రాక్షస పాలన సాగిస్తోందంటూ మండి పడుతున్నా అటు వైపు నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. పోలీసులు మాత్రం కేసులు నమోదు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా టీడీపీని కేసులు వెంటాడుతున్నాయి. మాజీ స్పీఎకర్ కోడెల శివ ప్రసాద్ రావు , సోమి రెడ్డి కృష్ణ మోహన్ రెడ్డి, అచ్చెన్నాయుడు లాంటి వారిపై కేసులు ఇప్పటికే నమోదు చేశారు. జగన్ మోహన్ రెడ్డి ఒక్కటే టార్గెట్ గా పెట్టుకున్నారు టీడీపీని నామ రూపాలు లేకుండా చేయాలని. అయినా చంద్ర బాబు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.. రా చూసుకుందాం అంటూ సవాల్ విసురుతున్నారు. జగన్ మాత్రం ఎప్పటి లాగానే నవ్వుకుంటూ వెళ్లి పోతున్నారు. ఇంకో వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. పథకాలు బాగానే ఉన్నా ఆచరణలో కనిపించడం లేదంటూ ఎద్దేవా చేశారు. అమరావతి బాధితులకు తాను అండగా ఉంటానని చెప్పారు. వైకాపా వంద రోజుల పాలనపై ఓ పుస్తకం కూడా విడుదల చేసారు. అయితే పవన్ పై బొత్స మండిపడ్డారు. ఎవరో రాసి ఇస్తే స్క్రిప్ట్ చదివే పవన్ రాజకీయంగా ఇంకా ఎదగాలని సూచించారు. మొత్తం మీద జగన్, చంద్ర బాబు, పవన్ కళ్యాణ్ రోజు రోజుకు రాజకీయాన్ని రాజేస్తున్నారు. మరింత వేడి పుట్టిస్తున్నారు. 

కామెంట్‌లు