సమున్నత భారతం..విస్తు పోయిన ప్రపంచం..!

నరేంద్ర దామోదర దాస్ మోదీ పేరు మరోసారి ప్రపంచమంతటా మార్మోగి పోయింది. సమున్నత భారతావని తల ఎత్తుకునేలా భారత ప్రధానికి అపూర్వమైన రీతిలో స్వాగతం లభించింది. హ్యూస్టన్‌ వేదికగా జరిగిన కార్యక్రమంలో మోదీతో పాటు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పాల్గొన్నారు. దాదాపు 50 వేల మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరయ్యారు. మొదటి నుంచి సభ ముగిసే దాకా చప్పట్లతో దద్దరిల్లి పోయింది. ఇండియన్స్ ఉత్సాహాన్ని చూసిన అమెరికా ప్రెసిడెంట్ చెప్పలేని సంతోషానికి లోనయ్యారు. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ప్రజాస్వామిక దేశాలు ఒకే వేదికపైకి రావడం అపూర్వమనే చెప్పు కోవాలి. సమస్త మానవాళికి పెను ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదం అంతు చూసేందుకు ఇరు దేశాలు కలిసి కట్టుగా పోరాడుతాయని స్పష్టం చేశారు. మోదీ ప్రసంగిస్తున్నంత సేపు సభికులు హర్షద్వానాలు చేస్తూనే ఉన్నారు. అడుగడుగునా మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్బంగా ప్రధానమంత్రి భావోద్వేగంతో ప్రసంగించారు. మీరందరినీ ఇలా కలుసు కోవడం ఆనందంగా ఉన్నది. హౌడీ మోదీ అంటూ మీరు కార్యక్రమం ఏర్పాటు చేశారు. కానీ నేను ఒక్కడినే ఏమీ చేయలేను. 130 కోట్ల ప్రజలు ఆదేశాల మేరకు నడుచుకునే అత్యంత సామాన్యుడిని. మీరు నన్ను ఎలా ఉన్నావని అడిగితే ఇండియాలో అంతా బాగుందని చెబుతా. ఒక్క హిందీలోనే కాదు , తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం , గుజరాతీ , బెంగాలీ తదితర భాషల్లోనూ మోదీ ఇదే విషయాన్నీ చెప్పారు. ఇండియాలో వైవిధ్యమే ఏకత్వమని, అదే, భారత ప్రజాస్వామ్యానికి కీలకమని స్పష్టం చేశారు. ఉగ్రవాదం అంతు చూస్తామని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిన బూనారు. ఇస్లామిక్‌ ఉగ్రవాదం నుంచి ప్రపంచానికి స్వేచ్ఛ కల్పిస్తామని చెప్పారు.

పాకిస్థాన్‌ పేరు ప్రస్తావించ కుండానే.. ఉగ్రవాదంపై నిర్ణయాత్మక యుద్ధం తప్పదని తేల్చి చెప్పారు. అమెరికా పర్యటనకు వచ్చిన ఓ విదేశీ నేత పాల్గొన్న సభకు ఇంత పెద్ద ఎత్తున జనం రావడం అమెరికా చరిత్రలోనే ఇదే తొలిసారి. ఈ కార్యక్రమంలో ట్రంప్‌ ఇంగ్లి్‌షలోనే మాట్లాడితే.. మోదీ మాత్రం హిందీలో మాట్లాడారు. అమెరికా వేదికగా, ట్రంప్‌ సాక్షిగా.. ఆర్టికల్‌ 370ని నిర్వీర్యం చేయడాన్ని మోదీ సమర్థించుకున్నారు. పాకిస్థాన్‌ పేరు ప్రస్తావించకుండానే ‘ఉగ్రవాద అడ్డా’ అంటూ విమర్శలు గుప్పించారు. జమ్మూ కశ్మీరులో ఉగ్రవాదానికి, వేర్పాటువాదానికి కారణమైన ఆర్టికల్‌ 370కి తాము చరమ గీతం పాడమన్నారు. అమెరికాపై ఉగ్ర దాడి , ముంబై ముట్టడి కుట్రదారులు ఎక్కడ ఉంటారు అని మోదీ ప్రశ్నించారు.

ఉగ్రవాదంపై నిర్ణయాత్మక పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రపంచంలో డేటా ఎక్కడైనా చవగ్గా ఉందంటే అది ఒక్క భారత్‌లోనేనని చెప్పారు. అమెరికాలో ట్రంప్‌ సర్కార్‌ మరోసారి అధికారంలోకి రావాలని కోరారు. సభలో తొలుత, ట్రంప్‌ను అమెరికాలోని ప్రవాస భారతీయులకు మోదీ పరిచయం చేశారు. మనతో ఓ ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారు. ఆయనకు పరిచయం అక్కర్లేదు. ఆయన పేరు భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. ప్రతి అమెరికన్‌ గురించి ఆయన ఆలోచిస్తారు. ఆయనే డొనాల్డ్‌ ట్రంప్‌ అని అన్నారు. మరోసారి ట్రంప్‌ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని కోరారు. అమెరికాలోని శ్వేతసౌధంలో భారత్‌కు నిజమైన స్నేహితుడని అభివర్ణించారు. వచ్చే నెలలో ముంబైలో ఎన్బీఏ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరగనుందని, భారత్‌కు రావాలని ట్రంప్‌ను మోదీ ఆహ్వానించారు. మొత్తం మీద ఇండియా, అమెరికా సంబంధాలు మరింత బలపడనున్నాయి. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!