నర్సాన్నా నీకో సలాం..!

ఒక్కసారి సర్పంచ్ అయితే చాలు..తరాలకు సరిపడా సంపాదించుకుంటున్న రోజులివి. కానీ ఆయన మాత్రం ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సాదా సీదాగా ఉంటారు .హంగు ఆర్భాటం అంటూ ఏదీ ఉండదు. వచ్చిన నాలుగు డబ్బులు పార్టీ కోసం ఇస్తారు . ఉన్న పొలం చేసుకుంటూ వచ్చిన దానితో బతుకుతున్నారు. ధర్మం గతి తప్పి , నీతి , నిజాయితీ అంటూ లేకుండా పోయిన ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో ఆయన ప్రత్యేకమైన వ్యక్తి. ఎందరికో స్ఫూర్తి కలిగిస్తూ పదవి అంటే హోదా కోసమో , డబ్బులు సంపాదించుకునేందుకు కాదని..ప్రజలకు సేవ చేయడమేనని చేసి చూపిస్తున్నారు..ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య.

పలు మార్లు శాసన సభ్యుడిగా గెలుపొందినా ఏరోజు రాజసాన్ని ప్రదర్శించ లేదు. గెలిచినప్పుడు గర్వ పడ లేదు. ఓడి పోయినప్పుడు దిగులు చెందలేదు. పని చేయడం , ప్రతినిత్యం ప్రజల మధ్యన ఉండటం . జనం కోసం పని చేయడమే పెట్టుకున్నారు. పని మీద హైదరాబాద్ కు వచ్చినప్పుడు నర్సయ్య బస్సులో వస్తారు. లేదంటే రైలులో ప్రయాణం చేస్తారు. ఎమ్మెల్యేలైనా, మాజీ లైనా మంది మార్బలం తో పాటు లెక్క లేనన్ని వాహనాలు ఉంటాయి . కానీ ఆయన ఒక్కరే వస్తారు. ఒంటరిగానే వెళతారు . తాజాగా నగరంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది . అదేమిటంటే నగరంలోని బాగ్ లింగం పల్లిలోని పార్ట్ ఆఫీస్ కు పని మీద వచ్చారు నర్సన్న.

ఆకలేస్తే దగ్గరే ఉన్న  జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన 5 రూపాయల భోజనం చేశారు. అక్కడున్న వారు గుమ్మడి నర్సయ్యను చూసి అవాక్కయ్యారు. స్థానికులు అతడిలోని సింప్లిసిటీని చూసి మెచ్చుకోకుండా ఉండలేక పోయారు. కొందరు ఆయన భోజనం చేసాక కలిసేందుకు పోటీ పడ్డారు. మరికొందరు ఆయనను అభినందించారు. చిన్నపాటి పదవులకు ఎగసి పడే ప్రబుద్దులున్న ఈ సమయంలో ఇలాంటి ప్రజా నాయకులు, సేవకులు ఉండటం అరుదు . ఇలాంటి నాయకులు ఊరికి ఒకరు వుంటే చాలు బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది. పదవి ఉన్నా లేక పోయినా ప్రజలకు సేవ చేయడంలో ఉన్నంత తృప్తి ఇంకెదులోను ఉండదంటారు..ఈ జనం మెచ్చిన యోధుడు. 

కామెంట్‌లు