అతడంటే హడల్ .. పేరు చెబితే హల్ చల్

ఇండియాలో కంటే దాయాది దేశాలకు అతడి పేరు చెబితే చాలు గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. ఇంతగా భయపడేందుకు కారణమవుతున్న ఒకే ఒక్క పేరు ..అతడే జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న అజిత్ కుమార్ దోవల్. ప్రతి భారతీయుడు ఆయనను చూసి గర్వపడుతున్నారు. ప్రేమగా ఇండియన్ జేమ్స్ బాండ్ అని పిలుచుకుంటున్నారు. ఎక్కడా ఎక్కువగా మాట్లాడక పోవడం , పక్కాగా స్కెచ్ వేయడం, ప్రత్యర్థులకు చుక్కలు చూపించడం అజిత్ కు వెన్నతో పెట్టిన విద్య. మోదీ దేశ ప్రధానమంత్రి గా రెండో సారి బాధ్యతలు చేపట్టాక సైనిక రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. మోదీ  దోవల్ కు కీలక పదవి కట్టబెట్టారు. అంతకు ముందు,  జాతీయ గూఢ చర్య విభాగానికి అజిత్ కుమార్ అధిపతిగా పని చేశారు. ప్రస్తుతం ఆయనకు 74 ఏళ్ళు.

ఎన్నో అవార్డులు , పురస్కారాలు అందుకున్నారు. అన్నిటికంటే ఆయన దేశభక్తుడు. ఇంటిలిజెన్స్ బ్యూరోకు డైరెక్టర్ గా పనిచేశారు,   దశాబ్ద కాలం పాటు ఆ సంస్థ కార్యకలాపాల విభాగానికి అధిపతిగా బాధ్యతలు  నిర్వర్తించారు. స్వంత రాష్ట్రం ఉత్తరాఖండ్‌. 23 ఏళ్లకే ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. తండ్రి సైన్యంలో పని చేయడంతో అజ్మీర్‌లోని రాష్ట్రీయ మిలటరీ స్కూల్లో చదువుకున్నారు. ఆగ్రా యూనివర్సిటీ నుంచి అర్థశాస్త్రంలో పీజీ చేశారు. 1968లో కేరళ క్యాడర్ లో ఐపీఎస్ లో చేరారు. పంజాబ్, మిజోరంలలో తిరుగుబాటు నిరోధక చర్యల్లో పాలుపంచుకున్నారు. 1999లో కాందహార్లో చిక్కుకున్న విమాన ప్రయాణికుల విడుదల కోసం సంప్రదింపులు జరిపిన ముగ్గురు సంధాన కర్తల్లో అజిత్  ఒకరు. సర్వీసులో చేరిన నాలుగేళ్లకు ఇంటెలిజెన్స్‌ బ్యూరోకు మారారు దోవల్‌.

సరిహద్దు రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేక శక్తులను అణిచే చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు. విధి నిర్వహణలో ఎక్కువ సమయం అజ్ఞాతంలోనే గడిపారు.1980 లో  మిజో నేషనల్‌ ఆర్మీ  లో ఒకరిగా చేరి మయన్మార్‌, చైనా సరిహద్దుల్లో ఉంటూ క్షేత్ర స్థాయిలోనే వారి పతనానికి పాచికలు వేశారు. ఆ సమయంలో ఎమ్‌ఎన్‌ఏ అధినేత బైక్చ్‌చుంగాకు ఎంతో సన్నిహితుడయ్యారు. ఒక దశలో దోవల్‌ మాటల్ని వింటే మిమ్మల్ని పక్కన పెట్టాల్సి వస్తుందని వారి నాయకుడు లాల్డెంగాను హెచ్చరించాడట. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో లాల్డెంగా ప్రభుత్వంతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాడు.

దోవల్‌ వల్లనే ఆ ఒప్పందం కుదుర్చు కోవాల్సి వచ్చింది. నా కింద ఏడుగురు మిలటరీ కమాండర్స్‌ ఉండే వారు. వారిలో ఆరుగురిని దోవల్‌ నా నుంచి దూరం చేశారు’ అని లాల్డెంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అలా 20 ఏళ్లపాటు సైన్యానికి తలనొప్పిగా ఉన్న ఎమ్‌ఎన్‌ఏ సమస్యకు ముగింపు పలికారు. చాలా మంది తమ కెరీర్‌ మొత్తంలో చేయలేని పనిని దోవల్‌ తక్కువ వ్యవధిలో చేశారంటూ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కితాబిచ్చారు. ‘ఇండియన్‌ పోలీస్‌  మెడల్‌’ను అందుకున్న పిన్న వయస్కుడుగా చరిత్ర సృష్టించారు.

స్వర్ణ దేవాలయంలో దాగున్న తీవ్రవాదుల్ని బయటకు తరిమే ఆపరేషన్‌లో దోవల్‌ కీలక పాత్ర పోషించారు. ఒక రిక్షా వాలాగా వేషం మార్చి, ఖలిస్తాన్‌ తీవ్రవాదులతో మాట కలిపి తనను పాకిస్థాన్‌ ఏజెంట్‌గా పరిచయం చేసుకున్నారు. ఆపరేషన్‌ నిర్వహణకు కొద్ది రోజులు ముందు  దేవాలయంలోకి వెళ్లి ఉగ్రవాదుల ఆయుధ బలం, సంఖ్యా బలం, బలగాల మోహరింపుని క్షుణ్ణంగా పరిశీలించి సమాచారాన్ని భద్రత దళాలకు అందించారు. ప్రాణ నష్టాన్ని తగ్గించు కోవడంతో పాటు ఆలయానికి ఎలాంటి నష్టం జరగకుండా సైన్యం ఆపరేషన్‌ పూర్తి చేయగలిగింది. దీంతో దోవల్‌కు  ‘కీర్తి చక్ర’ అవార్డు ను సర్కార్ ప్రకటించింది.

1990లో  ఉగ్రవాదులు పేట్రేగుతున్న సమయంలో దోవల్‌ కశ్మీర్‌లో అడుగు పెట్టారు. వేర్పాటువాదిగా ఉన్న కుకా  లొంగి పోయేలా చేశాడు. మనసు మార్చి ప్రభుత్వానికి అనుకూలంగా తయారు చేశారు. తర్వాత ఓ సంస్థను ప్రారంభించి తీవ్రవాదులకు వ్యతిరేకంగా పని చేశాడు. ప్రభుత్వ ఏజెంట్‌గా పని చేయడం గురించి అక్కడ కొందరికి శిక్షణ కూడా ఇచ్చారు. మరో వైపు వేర్పాటువాద గ్రూపుల ప్రతినిధులు,  ప్రభుత్వంతో చర్చలు జరిపేలా వాతావరణంలో మార్పు తెచ్చారు. రాజకీయంగానూ అదో కీలక మలుపు. ఆ చర్యలతో 1996లో జమ్ము, కశ్మీర్‌లో శాసనసభ ఎన్నికలు నిర్వహించారు. ఆ సమయంలో ఢిల్లీ  వర్గాలు దోవల్‌ పనితనాన్ని ఎంతగానో కొనియాడాయి. అంత వరకూ గూఢచారిగా పేరు తెచ్చుకున్న దోవల్‌... వ్యూహకర్తగానూ గుర్తింపు సంపాదించారు.

ఈశాన్య భారత్‌, పంజాబ్‌, కశ్మీర్‌..భారత్‌ వ్యతిరేక శక్తులు ఎక్కడ ఉన్నా సరే అక్కడికి వెళ్లారు.  ఏడేళ్ల పాటు పాకిస్తాన్‌లో గూఢచారిగా పని చేశారు.  పాక్‌తో పాటు, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో భారత్‌ అనుకూల ఏజెంట్‌లను నియమించారు. కొన్నాళ్లు లండన్‌లోని భారత రాయబార కార్యాలయంలో పని చేశారు. కార్గిల్‌ యుద్ధం తర్వాత, భద్రత  దళాల్నీ, నిఘా వర్గాల్నీ సమన్వయం చేసేందుకు ‘మల్టీ ఏజెన్సీ సెంటర్‌’ను ఏర్పాటు చేసింది కేంద్ర సర్కార్. దీని నేతృత్వ బాధ్యతలను దోవల్ కు అప్పగించింది. అదే సమయంలో ఏర్పాటైన  ‘జాయింట్‌ ఇంటెలిజెన్స్‌ టాస్క్‌ ఫోర్స్‌’ కు నాయకత్వం వహించారు .

మన్మోహన్‌ సింగ్‌ మొదటిసారి ప్రధాని అయ్యాక దోవల్‌ని ‘ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌’గా నియమించింది యూపీఏ ప్రభుత్వం. ఆ స్థానంలో ఆయన ఎనిమిది నెలలే ఉన్నారు. 2005లో అధికారికంగా పదవీ విరమణ పొందినా, అనధికారికంగా ఎన్నో కోవర్ట్‌ ఆపరేషన్లకు వ్యూహకర్తగా పని చేశారు. రిటైర్మెంట్‌ తర్వాత దావూద్‌ ఇబ్రహీంని మట్టుబెట్టే ఆపరేషన్‌కు దోవల్ స్కెచ్‌ గీశారు. దావూద్‌ కూతురు పెళ్లికి దుబాయ్‌లోని హోటల్‌కు వచ్చినపుడు చంపాలన్నది ప్లాన్. ముల్లుని ముల్లుతోనే తీయాలన్న ఉద్దేశంతో ఛోటా రాజన్‌ ముఠాకు చెందిన ఇద్దర్ని అందుకు సిద్ధం చేశారు. ఆ దశలో ముంబయి పోలీసు వర్గాల్లో దావూద్‌కు అనుకూలంగా ఉన్న వారు ఆ పని కానివ్వలేదు. దిల్లీలో ఛోటా రాజన్‌ అనుచరులతో దోవల్‌ మంతనాలు జరుపుతున్న హోటల్‌కు వచ్చి తీవ్రవాదులంటూ వారిద్దరినీ అరెస్టు చేసి దోవల్‌ మాట చెల్లనివ్వకుండా చేశారు.

మోదీ ప్రధాని అయ్యాక ప్రధాన పదవిని దోవల్ కు కట్టబెట్టడంతో , దావూద్‌ ఇబ్రహీం తన స్థావరాన్ని కరాచీ నుంచి పాక్‌-అఫ్గాన్‌ సరిహద్దుల్లోకి మార్చుకున్నాడని  చెబుతారు. రా, ఇంటెలిజెన్స్‌ బ్యూరోలు సేకరించిన సమాచారాన్ని జాతీయ భద్రతా సలహాదారుతోనే పంచుకుంటాయి. ఎన్‌ఎస్‌ఏగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలలకే ఇరాక్‌లో ఐసిస్‌ దాడుల్లో చిక్కుకున్న 45 మంది భారతీయ నర్సుల్ని క్షేమంగా స్వదేశానికి తీసుకు రావడంలో కీలకపాత్ర పోషించారు దోవల్‌.  శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఒక తాటిపైకి తీసుకొచ్చి , అన్నింటా చైనాకు వత్తాసు పలుకుతున్న అప్పటి అధ్యక్షుడు  రాజపక్సను గద్దె దించడంలోనూ దోవల్‌ వ్యూహ రచన చేశారంటారు. గతేడాది మణిపూర్‌లో 18 మంది సైనికుల్ని పొట్టన బెట్టుకున్న తీవ్రవాదులను మట్టుబెట్టారు.

మయన్మార్‌ ప్రభుత్వం అతివాద వర్గాలతో శాంతి ఒప్పందం చేసుకున్నపుడు దోవల్‌ అక్కడే ఉండి ఆ కార్యక్రమాన్ని పరిశీలించారు. బంగ్లాదేశ్‌లో తలదాచుకుంటున్న ఉల్ఫా  ప్రధాన కార్యదర్శి అనూప్‌ ఛేతియానిని గత నవంబరులో ఆ దేశం మనకు అప్పగించింది. ఐబీ మాజీ డైరెక్టర్‌ సయ్యద్‌ ఆసిఫ్‌ ఇబ్రహీమ్‌ను 2015లో తీవ్రవాదం, ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో పీఎం ప్రత్యేక రాయబారిగా నియమించడంలో దోవల్ కీలకంగా వ్యవహరించారు. దీని వల్లనే చోటా రాజన్ ను పట్టుకోగలిగారని అప్పట్లో వార్తలు వచ్చాయి . నిన్నటి జమ్మూ , కాశ్మీర్ , లఢక్ లను విభజించడం , 370 ఆర్టికల్ ను రద్దు చేయడం , భారత జెండా ఎగరడం వెనుక దోవల్ పాత్ర వుందన్నది జగమెరిగిన సత్యం. మొత్తం మీద దాయాది దేశాలతో పాటు డ్రాగన్ చైనా కూడా పునరాలోచనలో పడడం దోవల్ కు ఉన్న పవర్ ఏమిటో చెబుతుంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!