వారెవ్వా నీరా..మస్తు..జబర్దస్తు..?
బలిదానాలు, త్యాగాలు, పోరాటాల సాక్షిగా కోరి తెచ్చుకున్న తెలంగాణలో ఇపుడు కొలువుల జాడ లేక పోగా..తాగడంలో తెలంగాణ నెంబర్ వన్ పొజిషన్‌లోకి వచ్చేటట్టు కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి వేల కోట్లకు పైగా తాగి తందానాలు ఆడారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన మహానుభావులు అందినంత మేర ..ముందస్తుగానే కేసులను బుక్ చేసుకున్నారు. ఓటర్లకు పైసలు ఇచ్చుడు..తాగుడు షురూ చేయడంతో జనం జై తెలంగాణ అన్నరు. ఇంకేం ఐదేళ్లకు లైసెన్స్ దొరికిందని సర్కార్ భలే ముచ్చట పడుతున్నది. ఇక అధికారులు, కింది స్థాయి సిబ్బంది ఆగడాలకు చెప్పనీక లేదు. ఎక్కడ దొరక పడితే అక్కడ నోట్ల కట్టలు బట్టబయలు అవుతున్నవి. పాడుగాను..ఓ వైపు మా భూములు మా పేర్ల మీద రాయకుండ లంచం అడుగుతున్నరంటూ ఫిర్యాదు చేసినా పట్టించుకుంట లేరు.
ఊర్లల్ల బ్యాంకుల పడ్డ పైసలన్నీ కల్లు దుకాణాలు, మద్యం షాపులకు చేరుతున్నయి. మస్తుగ తాగుతున్నరు..సోయి లేకుండా పండుతున్నరు. ఇపుడు తెలంగాణ సర్కార్ మరో ప్లాన్ కు తెర తీసింది. త్వరలో నీరా పాలసీ తీసుకు రావాలని అనుకుంటోంది. సాధ్యమవుతుందా లేదా అని సూడుండ్రంటూ అధికారులను ఆదేశించింది. మంత్రి గౌడ్ సాబ్ సమీక్షలు చేసిండు. ఎక్కడ అమలైతదో ఆ పాలసీని చూసి వస్తే..ఠక్కున అమలు చేద్దమంటూ చెప్పిండు. ఇంకేం గా పనిమీదే ఉన్నరు మనోళ్లు. పిల్లలేమో కొలువులంటూ ఏడుస్తుంటే..గీళ్లేమో నీరా కోసం పడరాని పాట్లు పడుతున్నరు. కల్లు తాగితే పాణం కరాబైతది..నీరా తాగితే కిక్కు తో పాటు బాడీకి మంచిదంటూ చెబుతున్నరు. ప్రతి ఏడు కల్తీ కల్లు కాటుకు బలవుతుండ్రు కాబట్టి నీరా తీసుకు వస్తే మస్తుగుంటదని అంటున్నరు.
గీ నీరా పాలసీ 40 ఏళ్ల కిందటే ఉందట. కర్నాటక, గోవా, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో నీరా పాలసీ నడుస్తుందట. నీరా కథ చెప్పుకుంటే శానా ఉన్నది. తాటి, ఈత చెట్ల నుంచి తీస్తరు. పొద్దుగూకినాక ఆయా చెట్లను గీస్తే ..సూర్యోదయం లోపు పారే కల్లును నీరా అంటరు. ఇందులో ఎలాంటి మందులు కలపరు. ఏడాది పొడవునా ఇది వస్తనే ఉంటది. తెల్లారే లోపు దీనిని సేకరించాలి. లేకపోతే పులిసి పోతది. తాగబుద్ది కాదంట. దేశంలో 14 కోట్ల తాటి చెట్లున్నయంట. తమిళనాడు మొదట వుంటే..మనం దాని వెనుక ఉన్నమంట. కష్టపడి తీస్తే ఏడ నిల్వ ఉంచాలన్నది సార్ల ఆలోచన. ఉదయం సేకరించిన వెంటనే తాగితే భలేగుంటది. ఆలస్యం చేస్తే ఉన్న టేస్ట్ పోతది. చల్లటి దాంట్ల పెడితే నెల రోజంతా తాగొచ్చంట. అబ్బ భలేగుంది కదూ ఐడియా. ఎట్లా ఉద్యోగాలు వస్తలేవు..గీ నీరా తాగన్న బతుకుదం..పోదం పదుండ్రి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి