క‌భీ క‌భీ మేరే దిల్ మే..ఖ‌యాల్ ఆథా హై..!

ఎన్ని సార్లు విన్నా గుండెల్లో ఏదో వెలితి..ఒక‌టా ..రెండా..వంద‌లా ..కాదు..వేల‌సార్ల‌కు చేరుకుంది ..ఈ పాట విన్న‌ప్పుడ‌ల్లా..శ్రీ‌లంక రేడియో స్టేష‌న్ లో క‌భీ క‌భీ మేరే దిల్ మే ..ఖ‌యాల్ ఆథా హై..అంటూ మంద్ర స్వ‌రంలో వినిపించేది. అలా ఇంటి ముందు..నేల‌పై ఎన్నిసార్లు ప‌డుకుని నిద్ర పోయానో..లెక్క‌లేదు. పైన చంద్రుడు..మ‌ధ్య‌లో వెన్నెల..నిర్మ‌ల‌మైన ఆకాశం..ముఖేష్ గొంతులోంచి జాలు వారుతుంటే ..గుండె ఆగిపోతుందేమోన‌న్న ఆందోళ‌న‌..అయినా ఏమిటీ ఇంత‌టి మ‌హ‌త్తు ఉంటుందా ..ఏమో తెలియ‌దు..ఊహ తెలిసిన‌ప్ప‌టి నుంచి పాట‌లన్నా..కన్నీళ్లు నిండిన క‌విత్వ‌మంటే చ‌చ్చేంత ఇష్టం..వాటిపై అమ‌లిన ప్రేమ‌..ఎడ‌తెగ‌ని ఇష్టం కూడా. జీవిత‌మంటే ఆస్తులు..అంత‌స్తులు..నోట్ల క‌ట్ట‌లు..హోదాలు..ప‌ద‌వులు కాదు..గుప్పెడంత ప్రేమ కావాలి. హృద‌యానికి తోడు లేక పోతే..మ‌న‌సును వెలిగించే ధూపం లేక‌పోతే ఎట్లా..తుజే జ‌మీపే అంటూ ల‌త మార్ద‌వ‌మైన గొంతుతో ఆలాపిస్తుంటే..ఆక‌లి ఎట్లా అవుతుంది..ఏముందు ఆ స్వ‌రంలో ..దేవుడు ముందే అమ‌ర్చి పంపించాడా అనిపించింది.

అప్ప‌ట్లో రాజేష్ ఖ‌న్నా పిచ్చి..ఎంతంటే..గుండెలో ప‌ట్ట‌లేనంత అభిమానం. వ్యామోహం కూడా. హ‌మ్ దోనో..దో ప్రేమీ అంటూ జీన‌త్ అమ‌న్ తో క‌లిసి ..రైలు వెళుతుంటే ..ఓహ్ ..అలా ఎగ‌రిపోతే ఎంత బావుండేద‌ని అనిపించేది. అప్పుడు ఇప్పుడున్నంత వెస‌లుబాటు లేదు. ఫిలిప్స్ రేడియో ఆన్ చేసుకుంటూ ఎప్పుడొస్తుందో ఈ సాంగ్ అనుకుంటూ గ‌ది వాకిట ఎన్నిసార్లు వేచి చూశానో తెలియ‌దు..ఉన్న‌ట్టుండి ..టేప్ రికార్డ‌ర్ తెచ్చుకుని ..కోఠి సెంట‌ర్‌లోని గ‌ల్లీ గ‌ల్లీలో తిరుగుతూ..టీ తాగుతూ ..క‌భీ క‌భీ మూవీ సాంగ్స్ క్యాసెట్ తెచ్చుకుని ..వింటూ అలాగే నిద్ర‌లోకి జారుకున్న రోజులెన్నో లెక్కే లేదు. తెలుగు మీద అభిమానం ..ఇత‌ర భాష‌ల మీద ద్వేషం పెంచేలా చేసింది. కానీ చ‌దువు కోవ‌డం ..ప్ర‌పంచాన్ని చూడ‌డం మొద‌లు పెట్టాక‌..మ‌నిషి వెనుక ప‌డేందుకు అస‌లు కార‌ణం..భాష‌లేన‌ని అర్థ‌మై పోయింది. వాస్త‌వం తెలుసుకునే స‌రికల్లా స‌గం జీవితం గ‌డిచి పోయింది. 

లివింగ్ లెజెండ్, ఎవ‌ర్ గ్రీన్ హీరో ..కోట్లాది భార‌తీయుల ఆరాధ్యుడు..జ‌నం మెచ్చిన న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ గొంతులోంచి క‌భీ క‌భీ అంటూ వుంటే..జీవితం ధ‌న్య‌మై పోయింద‌ని అనిపించింది. అలా వింటూ వింటూ వుంటే ముఖేష్ నా ఇష్ట‌మైన గాయ‌కుల జాబితాలో చేరిపోయాడు. మ‌రో వైపు లేత‌త‌న‌పు మాధుర్యాన్ని గొంతులో ఒలికించి ..పాట‌ల తోట‌ల్లో విహ‌రించేలా చేసే గాయ‌కుల్లో కిషోర్ కుమార్ , ఎస్పీబీ కూడా ఉన్నారు. సుహాగ్ రాథ్ హై ..అంటూ ముఖేష్ పాడుతూ వుంటే..రైలులో కిటికీ ప‌క్క‌న ...జీవితం ఆగిపోతే చాల‌ని అనుకున్నా..యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే..వేలాది వీడియోస్..విత్ గ్రాఫిక్స్‌తో కోట్లాది సినీ ప్రేమికులు, అభిమానులు ఈ సాంగ్‌ను వీక్షించారు.విన్నారు..వింటూనే ఉన్నారు. 

వేలాది మంది రింగ్ టోన్స్‌గా పెట్టేసుకున్నారు. నువ్వు లేవు..నీ జ్ఞాపకాల రాతిరిలో నేను ఒంట‌రిగా నిల్చున్నా. నీతో పాటు క‌లిసి న‌డిచిన అడుగులు ..నిశ్శ‌బ్ద‌మై న‌న్ను వాటేసుకుంటున్నాయి. గుండె ల‌య‌బ‌ద్ద‌మై పోయింది. హృద‌యంలో మెల్ల‌గా క‌దులుతోంది..స‌న్న‌గా..మంద్ర‌మై ..సితార మీటిన‌ట్లు..చీక‌టి గ‌దిని క‌మ్ముకున్న‌ట్లు..గాలి స్తంభించిన‌ట్టు..అనిపించింది. క‌భీ క‌భీ మేరే దిల్ మే ..ఖ‌యాల్ ఆథా హై..అంటూ ముఖేష్‌, ల‌తాజీ..అమితాబ్ ల గొంతుల‌న్నీ క‌ల‌గ‌లిపి ఒక్కొక్క‌టిగా వ‌స్తూ వుంటే..ప్ర‌పంచాన్ని జ‌యించినంత సంతోషం. ఇలా వింటూ వింటూ ఎన్ని నిద్ర‌లేని రాత్రులు గ‌డిపానో త‌ల్చుకుంటేనే క‌న్నీళ్లు..క‌ల‌బోసిన ఊసులు..నువ్వు లేవు..నిన్ను త‌లుచుకుంటూ నిలిచిపోనీ..నీ జ్ఞాప‌కాల త‌డిత‌న‌పు తోట‌లో న‌న్ను విహ‌రించ‌నీ..నీ క‌నుల కొల‌నులో క‌నుపాప‌నై ఉండిపోనీ..!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!