వ్యక్తిత్వ వికాస సూత్రాలు..స్ఫూర్తి కిరణాలు (పాఠాలు)
1) భక్త బాంధవులారా మీకు మంగళాశాసనాలు ..ప్రతి హృదయం ప్రేమ పూరితమైనదే అయి వుంటుంది. కావాల్సిందల్లా సంకల్ప బలం. అది కావాలంటే మిమ్మల్ని మీరు సంస్కరించు కోవాలి. అప్పుడే జన్మ ధన్యమవుతుంది.
2) దుస్తులు శరీరానికి కప్పుకోవడానికో లేదా ధరించ డానికో పనికి వస్తాయి. అదే మనసును కమ్ముకున్న చీకటి తెరలను తొలగించాలంటే..భక్తి అనే దుప్పటితో శుభ్రం చేస్తే ..హృదయం తేలికవుతుంది. ఆ సమయంలో ఏ పని అయినా సులభం అవుతుందన్న నమ్మకం ఏర్పడుతుంది.
3) ఎన్ని ఆస్తులు సంపాదించినా..ఎన్ని నోట్ల కట్టలు పోగేసుకున్నా ఏం లాభం . గుండెల్లో ప్రేమతనం..మానవత్వం లేకపోతే..భక్తితత్వం అలవర్చుకోక పోతే ఉండీ ఏం లాభం. రోజూ కొత్తదనాన్ని ఆస్వాదించండి. ప్రకృతిని ప్రేమించండి. దానితో మమేకం అయ్యేందుకు మిమ్మల్ని మీరు సన్నద్ధం చేసుకోండి .
4) ప్రతి ఒక్కరు జీవించి ఉన్నారు అంటే అర్థం మనం చేయాల్సిన మంచి పనులు ఇంకా మిగిలి ఉన్నాయన్న మాట. అందుకే దేవుడు మీ వైపు చూస్తూనే ఉన్నాడు. అంతరాత్మను మించిన దైవం లేదు. అదెప్పుడూ మనల్ని ఎరుక పరుస్తూనే ఉంటుంది.
5) కరుణ , దయ, జాలి ఇవన్నీ లేకపోతే మనం మనుషులుగా కాకుండా పోతాం. ప్రకృతి గొప్పది..ప్రతిది వికసిస్తుంది..ప్రతి దానిని నిశితంగా పరిశీలిస్తే ఏదో ఒక శక్తి అందులో ఉందనిపిస్తుంది. అలాగే నీ మనసు కూడా ఓ విత్తనం లాంటిది. దానిని ఎలా నేలలో నాటేందుకు ప్రయత్నం చేస్తామో..శరీరం అనే నేలను చదును చేయాలి.
6) క్రమశిక్షణ..నిబద్ధత..ధర్మబద్దత ఈ మూడు ప్రతి ఒక్కరికి అవసరం. వీటిని పాటించాలంటే కఠినతరమైన నిబంధనలు మీకు మీరే విధించు కోవాలి. ఆ మాత్రం కష్టపడక పోతే..మీ మనసును దాని వైపు మళ్లించక పోతే..రేపొద్దున అంతకంటే ఎక్కువగా కష్టాలు వస్తాయి..అపుడెలా వాటిని పరిష్కరించు కోగలగుతారు. అందుకే సంకల్ప బలం ముఖ్యం.
7) దైవం పట్ల నమ్మకం కలిగి వుంటే చాలదు. దానికి కావాల్సిన సాధన చేయడం తప్పనిసరి. అదో దినచర్యగా మార్చుకోక పోతే ఏదీ అర్థం కాదు.
8) మనం వేసే అడుగులు కొన్నిసార్లు తప్పవచ్చు..కాదనలేం..కానీ మరోసారి అలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి. చేసే పని పట్ల శ్రద్ధ వుంటే ఇలాంటివి జరగవు. లక్ష్యం సూటిగా ఉండాలి. బాణమనే దృష్టిని పక్క వైపు మరల్చకుండా ఉండాలంటే నిన్ను నీవు ఇనుప కడ్డీ లాగా ధృఢంగా ఉండేందుకు యత్నించాలి. అదే దైవం.
9) గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే లాభం లేదు. నీకు నీవుగా ఏ పనీ చేయకుండా డబ్బులు రావాలంటే ఎక్కడి నుంచి ఊడి పడవు. కష్టపడాలి..శ్రమించాలి..నీ ధర్మాన్ని నీవు ఆచరించాలి. అపుడు దైవం నీ వైపునే ఉంటుంది. చివరగా నీకు విజయం ప్రసాదించేందుకు దోహదం చేస్తుంది.
10) లోకంలో ఎన్నో ఉన్నాయి. కావాల్సినంత సరుకుంది. సరంజామా ఉంది. వస్తు వ్యామోహంలో పడి జీవిత పరామర్థాన్ని అర్థం చేసుకోవడం లేదు. ఒక దానితో సంతృప్తి చెందాక ఇంకొకటి కావాలని అనిపిస్తుంది. మనసే అంత. దానికంతటి ప్రాధాన్యత. దానిని అదుపులో ఉంచుకోగలిగితేనే సంతోషం దక్కుతుంది.
11) బాల్యం, యవ్వనం, వృద్దాప్యం సహజాతి సహజం ఈ మానవజాతికి. చిన్నప్పటి నుంచి భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, నాగరికతను తెలియ పరిచే స్ఫూర్తి పాఠాలు బోధించాల్సిన అవసరం మనందరిపై ఉన్నది. పాశ్చాత్యపు సంస్కృతి మనల్ని ఒక పట్టాన ఉండనీయడం లేదు. ఇది ప్రమాదకరమైనది. దీనిని మొగ్గలోనే తుంచక పోతే మానై మనల్ని కబలిస్తుంది.
12) పాఠాలు వల్లె వేసినంత మాత్రాన గురువై పోతామా. కాదు దానికి అకుంఠితమైన సాధన చేయాలి . కాలం పెట్టే కఠినమైన పరీక్షలను ఎప్పటికప్పుడు తట్టుకోవాలి . సన్యాసం పుచ్చు కోవాలి . అన్నిటిని వదులు కోవాలి . నా అన్న వారుండరు .
13) బంధాలు ..బాంధవ్యాలు అన్నీ సమాజ సేవకు ఉపయోగ పడేలా తన మనసును ..తన శరీరాన్ని అర్పించేసు కోవాలి . ఇదంతా ఓ పద్ధతి ప్రకారం సాగే నిరంతర ప్రక్రియ .
14) అహోరాత్రులు కష్టపడాలి . కన్నీళ్లు గుండెను తాకుతున్నా..సరే నిక్షలంగా ముందుకు సాగి పోవాలి . ఈ ప్రయాణం సజావుగా సాగాలంటే తనను తాను తెలుసు కోవాలి . వేదాలు ..పురాణాలు ..గీత ..ఇలా అన్నిటినీ అర్థం చేసుకోవాలి . ఇదంతా ఒక్క రోజులో నో లేదా ఓ ఏడాది కష్టపడితే వచ్చేది కాదు . ఇదంతా కొన్నేళ్ల పాటు సాగించే ప్రయాణం . దైవం కోసం సాగించే యజ్ఞం.
15) విద్యా దానం ..అన్నదానం ..వైద్య సహాయం మన ముందున్న కర్తవ్యం..వీటిలో ఏ ఒక్కదానిలో భాగం పంచుకున్నా ..లేదా ఎంతో కొంత సహాయ పడినా సరే వారి జన్మ ధన్యమవుతుంది.
16) ప్రతి దానికి ఓ ప్రత్యేకత ఉంటుంది . దానిని గుర్తించి ముందుకు వెళితే ప్రతి మనిషి అద్భుతాలు సృష్టించవచ్చు. దుస్తులు ధరించినంత మాత్రాన యోగులు కాలేరు . సన్యాసం అన్నది జీవితం కంటే గొప్పది. ఓ వైపు కోరికలు .ఇంకో వైపు వస్తువుల మాయాజాలం ..భౌతికపరమైన ఆలోచనలు ..అన్నిటికంటే భయపెట్టేది ..వెనక్కి నెట్టేది బంధం.
17) బంధాలను వదిలేసుకోవడం అంటే మనతో మనం మరో యుద్ధం చేయడం అన్నమాట. మరి దానిని పొందాలంటే దమ్ముండాలి ..దానిని స్వీకరించాలంటే నిన్ను నీవు అర్పణ చేసుకోగలగాలి. అదే దైవం కోసం సాగించే ప్రయాణం .
18) దైవం ముందు అంతా సమానులే .. భేదభావాలు ఉండవు . అందరికీ అందే తీర్థం ఒక్కటే .లక్ష్యం ఒక్కటే . అందరు బాగుండాలి . అందరికీ సమాన అవకాశాలు దక్కాలి . ఇది కమ్యూనిజం చెబుతుంది .
19) గుడ్డిగా అనుకరించడం ఎవ్వరికీ మంచిది కాదు . దైవ భావం వుంటే సరిపోదు ..దాని కోసం మీరంతా సాధన చేయాలి. ఆశించిన ఫలితం దక్కుతుంది. .
20) జీవితం ధన్యం చేసుకోవాలంటే..కాసులు ఖర్చు చేయాల్సిన పనిలేదు. కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. తోటి వారిని ప్రేమించడం..ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం. మానవత్వాన్ని కలిగి ఉండటమే. చేతనైనంత సహాయ పడటం. ఇవే మిమ్మల్ని ప్రత్యేక వ్యక్తులుగా ఉండేలా చేస్తుంది.
21) ప్రతి ఒక్కరు చదువు కోవాలి. ఎదగడం అంటే శరీరాన్ని పెంచు కోవడం కాదు. మనసు, బుద్ధి సమపాలల్లో పెరగాలి. దానికి రోజూ వ్యాయామం చేయాలి. ఇక్కడ వ్యాయామం అంటే మరో అర్థం ఇమిడి ఉన్నది. అది ఏమిటంటే సాధనతోనే సాధ్యమవుతుంది. అదే మీకు మార్గాన్ని..దిశను చూపిస్తుంది. ఎక్కడికి వెళ్లాలో..మీ గమ్యం ఏమిటో మీకే అర్థమవుతుంది.
22) నిర్మలమైన ప్రశాంతత కావాలంటే. అల్లకల్లోలమైన మనసు సేద దీరాలంటే. దుఖఃం నుంచి విముక్తి పొందాలంటే. గుండెల్లో ప్రేమ మొలకెత్తాలంటే..సమస్త శరీరం ఆధ్యాత్మిక లోగిలిలో సేద దీరాలంటే..హృదయం పునీతం కావాలంటే ఏం చేయాలి...? మీరు చేయాల్సందల్లా భక్తితో మమేకమై పోవడమే.
23) జేబుల నిండా కరెన్సీ వుండాల్సిన పనిలేదు. ఆస్తులు, అంతస్తులు, హోదాలు, వాహనాలతో పని లేదు. ఎలాంటి ఖర్చు అక్కర్లేదు. కావాల్సిందల్లా భక్తిని శ్వాసగా మార్చు కోవాలి. అదే జీవితం..సమస్తం కావాలి. అంతేకాదు... ఎదుటి వారి పట్ల మమకారం వుండటమే.
24) సమస్త ప్రపంచంతో మీకు పని లేదు. పరిచయం అంతకన్నా అక్కర్లేదు. విజ్ఞానం కావాలంటే..జ్ఞానం పొందాలంటే..చెమట చుక్కలు చిందించాల్సిన అవసరం అంతకన్నా లేదు. జస్ట్..మిమ్మల్ని మీరు ప్రేమించు కోవడం.
25) మీ పరిమితులు ఏమిటో మీరు తెలుసు కోవడం. దీనికి ప్రత్యేకమైన సాధన , కఠోర దీక్ష కూడా అక్కర్లేదు. జస్ట్..సంకల్ప బలం కలిగి వుంటే చాలు. మీలో మీరు ఊహించని శక్తి మిమ్మల్ని ఆవహిస్తుంది. ఎక్కడా దొరకని అనుభూతికి మీరు లోనవుతారు.
26) తీర్థం తీసుకోవడం వల్ల మనసు తేలికవుతుంది..హృదయం శుభ్రమవుతుంది.. శరీరం సేద దీరుతుంది..సమాజ హితం కోసం పనిచేయాలన్న తపన పెరుగుతుంది. ప్రసాదం ప్రతి గుడిలో దొరుకుతుంది. దైవానికి సమర్పించే నైవేద్యం. దేవుడితో సంభాసించాలన్నా లేదా ఆయనను చేరుకోవాలంటే ..సమర్పించు కోవడమే..ఇంతకంటే దగ్గరి దారులు లేవు.
27) విద్యతోనే మానవ వికాసం సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరు అక్షరాస్యులు కావాలి. దైవం పట్ల భయాన్ని ..పెద్దల పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలి. విద్య యొక్క లక్ష్యం ఏమిటంటే జ్ఞానాన్ని ప్రసాదించడం. అంతేనా మనుషులుగా మారేందుకు ఓ వాహకంగా పనికొస్తుంది.
28) పిల్లలు..ప్రకృతి..ప్రపంచం అంతా దైవం ఇచ్చిన అపురూపమైన కానుకలు. వాటిని పదిలంగా కాపాడు కోవాల్సిన బాధ్యత భక్తులందరిపై ఉంది. విత్తనాలు నాటండి. అవి పెరిగి మొక్కలుగా మారిపోతాయి..ఒకానొక దశలో చెట్లుగా మారి నీడనిస్తాయి. పిల్లలు విత్తనాలు కావాలి..మనుషులు చెట్లుగా మారి ఇతరులకు స్ఫూర్తి దాయకంగా ఉండాలి.
29) గ్రంథాలు లేని గదులు , ఇళ్లు ఉండీ ఏం లాభం. సమస్త జీవరాశులకంటే మనుషులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటోంది. కారణం ఏమిటంటే వాటికి జ్ఞానం అనే అద్భుతం లేదు కనుక. పుస్తకాలు మనుషులు చెడిపోకుండా కాపాడతాయి. బతికేందుకు దారులు చూపిస్తాయి. అందులోంచి వచ్చిందే రామాయణం, మహాభారతం, తదితరాలు. ఇవన్నీ భవిష్యత్ తరాలకు ఉపయోగపడే జ్ఞాన భాండాగారాలు. పదిలంగా కాపాడుకోవాలి. వాటిని భద్రపరిస్తే రేపటి తరాలకు విలువైన సంపదను ఇచ్చిన వారవుతారు.
30) పిల్లల్లో వికాసం ఎక్కువగా ఉంటుంది. బాల్యంలో ఎలాంటి మరకలు వుండవు. వారు ఏది చెప్పినే నేర్చుకునేందుకు సిద్దమై వుంటారు. వారికి సంస్కార వంతమైన పాఠ్యాంశాలు బోధించాలి. ఆ పని చేయాల్సిన బాధ్యత పంతుళ్ల మీదే కాదు కన్నవారైన తల్లిదండ్రులపైనే కూడా ఉందన్న విషయం మరిచి పోకూడదు.
31) ప్రపంచం త్వరగా ఆకర్షిస్తుంది. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది కదూ. కంప్యూటర్లతో కాలక్షేపం చేయడం కంటే ఓ పుస్తకాన్ని చదవడమో..ఓ మంచి ఆలోచనను కార్యరూపం దాల్చేందుకు కష్టపడటమో లేదా ఓ మొక్కను నాటడమో..పిల్లలకు పాఠాలు చెప్పడమో చేస్తే మీ జన్మ ధన్యమైనట్టే. ఇంకేమీ చేయాల్సిన పనిలేదు. పంచు కోవడంలో ఉన్నంత తృప్తి..విడిపోవడంలో ఉండదు.
32) మనం చేసిన మంచి పనులే మనల్ని మానవులుగా ఇక్కడికి పంపబడ్డాం. అంతకంటే కావాల్సింది ఈ జన్మకు ఇంకేం వుంటుంది..? భక్తిని కలిగి వుండటం వేరు..భక్తితో ధర్మబద్ధంగా ఉండటం వేరు. ఒక్కోసారి రెండూ ఒకేలా అగుపిస్తాయి. కానీ తరిచి చూస్తే అవి వేర్వేరు అని అర్థమవుతుంది.
33) ఈ సమాజం ఇంకా మారాల్సి ఉన్నది. ఎన్నో కాలువలు ప్రవహిస్తూనే వుంటాయి. ఎన్నో పశుపక్షాదులు జీవిస్తూనే ఉంటాయి. వాటి ధర్మాన్ని అవి నిర్వర్తిస్తున్నాయి. కానీ అన్నీ తెలిసిన..ఎన్నో అవకాశాలు కలిగిన మనం మాత్రం కాలాన్ని గుర్తించడం లేదు. లైఫ్‌ను నిర్లక్ష్యం చేస్తూ సాగుతున్నాం. ఇది ప్రమాదం.
34) మనుషులు గతి తప్పకుండా ఉండేందుకు ఆత్మ గురువు లాగా వెన్నంటి వుంటూనే హెచ్చరిస్తూ వుంటుంది. ఇది తప్పు..ఇది ఒప్పు అని .జీవితంలో తప్పటడుగులు వేయకుండా ఉండాలంటే భక్తిని అలవర్చు కోవాలి. ఇది మనం ఎలా ప్రవర్తించాలో..ఏలా జీవించాలో..ఎలా మసలు కోవాలో నేర్పుతుంది. ఒకరకంగా చెప్పాలంటే చేతి కర్ర లాంటిది..గురువు చేతిలో బెత్తం లాంటిది.
35) మానవ జీవితం గొప్పది..దానిని గుర్తించి మసలు కోవడమే మనమంతా చేయాల్సిన పని..ఇది కర్తవ్యంగా..లక్ష్యంగా భావించాలి. ఏ విజయం ఒక్కసారితో సమకూరదు. కొన్నేళ్ల పాటు శ్రమ దాగి ఉంటుంది. ఏదీ ఊరికే లభించదు...కష్టపడితేనే అందుతుంది. భక్తి కూడా అంతే. నిరంతరం సాధన చేయాలి. ప్రతిక్షణం ధర్మబద్ధంగా ఉండాలి.
36) నా దగ్గర ఎలాంటి మంత్రదండాలు లేవు..ఉన్నదల్లా మనుషులను..పశుపక్షాదులను ప్రేమించడమే.
37) కాలుష్యం కమ్ముకు వస్తోంది. అధర్మం మనల్ని ఒక పట్టాన నిలువ నీయడం లేదు. రాకెట్ కంటే స్పీడ్‌గా జర్నీ సాగుతోంది. టెక్నాలజీ పెరిగింది. నిన్నటి దాకా ఆకాశం అదో అంతులేని రహస్యం అనుకునే వాళ్లం..ఇపుడు ఇక్కడి నుండే క్షణాల్లో దానిని దర్శించుకుంటున్నాం. విజ్ఞానం పెరిగింది..కానీ విజ్ఞత నశిస్తోంది.
38) ఈ సమాజం బాగు పడాలంటే కావాల్సిందల్లా తల్లిదండ్రులు కంకణబద్దులు కావాలి. వారే సంస్కారం నేర్పగలిగే గురువులు. వారి నుండే ఈ ప్రపంచం నేర్చుకుంటుంది. విలువలే మనుషుల్ని తీర్చిదిద్దుతుంది. పక్కదారి పట్టకుండా చేస్తుంది. ఇదంతా స్వానుభవంలోంచి వస్తుంది.
39) ప్రకృతి ఎంతో ఇచ్చింది. అది నేర్పే పాఠం ఇంకేదీ నేర్పదు. దానిని ఆస్వాదించండి. వీలు కుదిరినప్పుడల్లా మంచిని నేర్పే..విద్యాబుద్ధులు కల్పించే పుస్తకాలు బోలెడున్నాయి. వాటిని చదివే ప్రయత్నం చేయండి. వంద మంది గురువులు బోధించలేని..నేర్పలేని విషయాలన్నీ ఒక్క పుస్తకం మనకు నేర్పుతుంది.
40) ప్రపంచం ఐటీ మీద ఆధారపడిందన్నది వాస్తవమే..కానీ అది మానవత్వాన్ని పెంచే దిశగా ప్రయత్నం చేయలేదు. చేయాల్సిందల్లా మనమే. ఎంత విజ్ఞానం సంపాదించినా..మనిషి ప్రయత్నం లేనిదే ముందుకు వెళ్లలేం. ధ్యానం చేయండి..యోగాను సాధన చేయండి..ఆధ్యాత్మికతను ఆపాదించుకోండి..మీ జీవితం ఇంతకంటే ముందుకంటే మెరుగ్గా అనిపిస్తుంది. మనసు తేలికవుతుంది..హృదయం ప్రశాంతంగా వుంటుంది.
41) రోజంతా లెక్కలేనంత ఖర్చు చేస్తాం. పది రూపాయలు పెడితే పుస్తకం దొరుకుతోంది. ఇపుడంతా స్మార్ట్ ఫోన్ల మయమై పోయింది. చెత్తను తీసి వేయండి..మంచిని కోరుకోండి..బలంగా..అక్కడే ఆగిపోతారు. లెక్కలేనంత..మోయలేనంత విజ్ఞానానికి కావాల్సినంత సమాచారం ఇంటర్నెట్‌లో దొరుకుతోంది. నేర్చుకునే అభిలాష మీకుంటే మీరు ధన్యజీవులే.
42) చదువు దీపంలా దారి చూపిస్తే ..ఆధ్యాత్మిక భావన..భక్తి మనకు ఆత్మ సాక్షాత్కరించేలా చేస్తుంది. కావాల్సిందల్లా భక్తి ని ప్రేమించడమే..ప్రేమతో అన్నీ సాధ్యమవుతాయి. శాంతి..సౌఖ్యము అలవడుతాయి.
43) డాలర్ల మాయాజాలం మనుషుల్ని ఒక పట్టాన నిలవ నీయకుండా చేస్తోంది. కళ్లు చెదిరే నిర్మాణాలు..కాంక్రీట్ గదుల్లో ఇరుక్కు పోయిన బతుకులు. అంతటా బటన్ సిస్టం. బతుకంతా అభద్రత రాజ్యమేలుతోంది. ఎవరి జిందగీ వారిదే. ఏ ఒక్కరికీ పర్మినెంట్ అడ్రస్ అంటూ వుండదు. పలకరిస్తే యుఎస్. పోనీ బేసిక్స్ రావు. ఎథిక్స్ ఎప్పుడో మరిచి పోయారు. అల్లారు ముద్దుగా పెంచి ..అప్పులు చేసి చదివించి పంపిస్తే..ఉన్నట్టుండి ప్రాణం పోతే..ఫ్లయిట్ దొరకదు..ఇక్కడ ఉంచరు.
44) పంచేంద్రియాలు పనిచేయాలంటే ప్రకృతి బాగుండాలిగా..వ్యవసాయం సాగవ్వాలిగా..రైతులంటే ..భారతీయులంటేనే చులకన. జర్నీ..జిందగీ రెండూ కాలంకంటే పోటీగా పరుగులు తీస్తున్నాయి. సిగ్నల్స్ మారిపోయాయి. లెక్కలేనంత బ్యాలన్స్ వున్నా..చెప్పుకోలేని రోగాలతో బెంబేలెత్తి పోతున్నారు. కళ్లున్నాచూడలేరు. లెన్స్ కావాలి. ఎక్కువ తింటే అరగదు. పది కిలోమీటర్లు నడవలేరు. వీళ్లు ఈ జాతిని ఎలా ఉద్దరిస్తారు...?
45) ఆనందం అంగట్లో దొరికే వస్తువు కాదు. సంతోషం డాలర్లు ఇవ్వలేవు. మనుషుల మధ్య బంధాలు నెరపలేరు. వత్తిళ్లను తట్టుకోలేక ..తమను తాము అదుపులోఉంచుకోలేక ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు. మనల్ని మనం ప్రేమించుకోనంత కాలం మన జీవితాలు ఇలాగే ఏడుస్తూనే ఉంటాయి. శాంతి..సంతోషం..సంతృప్తి..ఆనందం ..హోదా..గుర్తింపు..మనల్ని మనం అదుపులో ఉంచుకున్నప్పుడే కలుగుతాయి.
46) పైరవీలు చేయాల్సిన అవసరం లేదు. ఇంకెవ్వరినీ దేబరించాల్సిన పనిలేదు. జస్ట్..మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం..గాఢంగా ప్రేమించు కోవడం. శ్వాస మీద ధ్యాస కాదు కావాల్సింది. నీకు నీ మీద శ్రద్ధ కావాలి. అప్పుడే నీ మనసేమిటో నీకు తెలుస్తుంది. నీవేమిటో అర్థమవుతుంది. ధ్యానం కావాలంటే దానం చేయాలి. పది మందికీ పట్టెడన్నం పెట్టాలి. ప్రజలతో..పక్కవారితో బాగుండాలి. మానవ సమూహంలో చేరాలి.
47) శరీరం మన మాట వినాలంటే..దానిని పనిలోనే ఉంచాలి. అశాంతికి దూరంగా వుండాలంటే..ప్రశాంతత దగ్గరవ్వాలంటే మనదైన లోకంలోకి మనం జారుకోవాలి. అందులో పీకలలోతు కూరుకు పోవాలి. అప్పుడు అసలైన ఆత్మ సంతృప్తి దక్కుతుంది. ఆనందం ఆవిరి కాకుండా నీడలా మన వెంటే వుంటుంది..ఇదే యోగం..ఇదే జీవన యానం..!
48) . అందరి మతం ఒక్కటే..అందరి ఆదర్శం ఒక్కటే..అందరి ధ్యేయం ఒక్కటే..అదే ..అదే మానవత్వం. సర్వ ప్రాణ కోటి సమూహం అంతా ఒక్కటే. మానవులే కాదు..సకల జీవ చలరాశులు సమానమే. వాటికి జీవించే స్వేచ్ఛను కల్పించాలి. పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఆధ్యాత్మిక పరిమళాలనే విత్తనాలను చల్లుకుంటూ అంతరించి పోతున్న మానవీయ విలువల పునరుద్ధరణ కోసం కృషి చేయాలి. అప్పుడే ఈ భేదభావాలు..ఈర్ష్యా విద్వేషాలు ..కుట్రలు..దూరమై పోతాయి.
49) సేవతోనే సంతృప్తి సాధ్యమవుతుంది. జీవితం ధన్యమవుతుంది. వారంలో ఒక గంట కేటాయించినా చాలు . ఎంతో కొంత మేలు చేసిన వారవుతారు. ఈరోజే నిర్ణయం తీసుకోండి. కార్యక్షేత్రంలోకి దూకండి. మంచిని పెంచే ఏ కార్యక్రమమైనా సరే పాలు పంచుకోండి చాలు. ప్రతి దానిలో దైవం ఉంటుంది. అది మిమ్మల్ని నీడలా కాపలా కాస్తుంది.
50) అత్యాధునిక వస్తువులు, సాధనాలు కొంతమేరకు ఉపయోగపడొచ్చు..కానీ హృదయాన్నిఆవిష్కరించే సాధనం మాత్రం పుస్తకమే. పిల్లలు వికసించాలంటే వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు కన్నవారు చెప్పాలి. నీతి, నిజాయితీ, అబద్ధం ఆడక పోవడం, పెద్దవారిని గౌరవించేలా ..చదువులో ఉన్నతి పొందేలా ఉండాలంటే పుస్తకాలే నేస్తాలు..అవే విజ్ఞానాన్ని పంచే వెలుగుదివ్వెలు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి