లంకేయుల‌పై ఇండియా ఘ‌న విజ‌యం - సెమీస్‌లో కివీస్‌తో ఢీ

రోహిత్ శ‌ర్మ శ‌త‌కాల మోత‌తో ఇండియాకు అరుదైన విజ‌యం ద‌క్కింది ప్ర‌పంచ క‌ప్ టోర్న‌మెంట్‌లో. ఏకంగా ఈ టోర్నీలో 5 సెంచరీలు సాధించిన క్రికెట‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు ఈ ఆట‌గాడు. క‌ళాత్మ‌క‌మైన బ్యాటింగ్‌తో లంక‌తో జ‌రిగిన ప్ర‌తిష్టాత్మ‌క మ్యాచ్‌లో భార‌త్‌కు సునాయ‌సంగా విక్ట‌రీ సాధించి పెట్టాడు. రోహిత్‌కు తోడు కెఎల్ రాహుల్ సైతం తానేమీ తీసిపోనంటూ లంకేయుల‌తో చెడుగుడు ఆడాడు. ఏకంగా సెంచ‌రీ సాధించాడు. గ‌తంలో వ‌ర‌ల్డ్ క‌ప్‌లో శ్రీ‌లంక‌కు చెందిన సంగ‌క్క‌ర సాధించిన 4 సెంచ‌రీల రికార్డును బ్రేక్ చేశాడు రోహిత్ శ‌ర్మ‌. 265 ప‌రుగుల నిర్దేశించిన ల‌క్ష్యాన్ని అల‌వోక‌గా, ఆడుతూ పాడుతూ ఛేదించారు. టార్గెట్ ఛేదించే క్ర‌మంలో బ‌రిలోకి దిగిన రోహిత్  94 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు 2 సిక్స‌ర్ల సాయంతో 103 ప‌రుగులు చేస్తే, రాహుల్ 118 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు ఒక భారీ సిక్స‌ర్ తో 111 ప‌రుగులు సాధించాడు. వీరిద్ద‌రు క‌లిసి భారీ భాగ‌స్వామ్యాన్ని న‌మోదు చేశారు. దీంతో ఇండియా శ్రీ‌లంక‌పై 7 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. మ‌రో 39 బంతులు ఉండ‌గానే ఈ విక్ట‌రీ ఇండియాకు ద‌క్కింది.

అంత‌కు ముందు బ్యాటింగ్ కు దిగిన శ్రీ‌లంక జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 264 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టులో మాథ్యూస్ 128 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు 2 సిక్స‌ర్ల‌తో 113 ప‌రుగులు చేసి ..జ‌ట్టు కీల‌క స్కోరు పెరిగేందుకు దోహ‌ద ప‌డ్డాడు. ఇండియా జ‌ట్టులో బుమ్రా సూప‌ర్ బౌలింగ్ తో 37 ప‌రుగులిచ్చి మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. లంక ప‌రుగులు చేయ‌కుండా అడ్డుప‌డ్డాడు. కోహ్లి 37 ప‌రుగులు చేసి జ‌ట్టుకు విజ‌యాన్ని అందించాడు. ఇక లంక జ‌ట్టు విష‌యానికి వ‌స్తే, 12 ఓవ‌ర్లు ముగిసే స‌రికి లంక జ‌ట్టు స్కోరు 4 వికెట్లు కోల్పోయి 55 ప‌రుగులు చేసి గ‌డ్డు ప‌రిస్థితుల్లో ఉంది. ఈ స‌మ‌యంలో మైదానంలోకి వ‌చ్చిన మాథ్యూస్ ..ఒంట‌రి పోరాటం చేశాడు. ఇండియ‌న్ బౌల‌ర్లకు చుక్క‌లు చూపించాడు. అద్భుత‌మైన రీతిలో ఆడాడు. క‌ళ్లు చెదిరేలా షాట్లు కొడుతూ స్కోరును పెంచాడు. మ‌రో ఆట‌గాడు తిరిమానే 68 బంతులు ఎదుర్కొని 53 ప‌రుగులు చేశాడు. ఐదో వికెట్‌కు మాథ్యూస్ తో క‌లిసి 124 ప‌రుగులు జోడించారు. ధ‌నంజ‌య డిసిల్వాతో క‌లిసి ఆరో వికెట్‌కు 74 ప‌రుగులు జోడించాడు. టాప్ ఆర్డ‌ర్ కూలిపోతే ..ఇన్నింగ్స్‌ను ఎలా ప‌టిష్ట ప‌ర్చాలో చేసి చూపించాడు మాథ్యూస్.

బుమ్రా త‌న బౌలింగ్‌తో లంకేయుల‌ను ప‌రుగులు చేయ‌నీయ‌కుండా క‌ట్ట‌డి చేశాడు. త‌న ప‌దునైన పేస్‌తో ఆరంభంలోనే గ‌ట్టి దెబ్బ కొట్టాడు. ఓపెన‌ర్లు క‌రుణ ర‌త్నె , కుశాల్ పెరీరాల‌ను వెన‌క్కి పంపించాడు. ఆఖ‌ర్లోనూ క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. జ‌డేజా కూడా బెట‌ర్. కుల్ దీప్ జ‌ట్టులో ఉన్నా ఒకే ఒక్క వికెట్ తీశాడు. భువ‌నేశ్వ‌ర్ ధారాళంగా ప‌రుగులు ఇచ్చాడు. చాహ‌ల్, ష‌మీల‌కు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు. వీరి స్థానంలో కుల్‌దీప్, జ‌డేజాల‌ను తీసుకుంది. లంకేయుల‌తో గెలుపు సాధించ‌డంతో ఇండియా జ‌ట్టు సెమీ ఫైన‌ల్లో న్యూజిలాండ్‌తో మంగ‌ళవారం త‌ల‌ప‌డనుంది. మొత్తం మీద ఈ ప్ర‌పంచ క‌ప్ ను ఎవ‌రు ఎగ‌రేసుకు పోతార‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్నగా మారింది. మ‌రో సెమీ ఫైన‌ల్‌లో ఆస్ట్రేలియా జ‌ట్టు ఇంగ్లండ్‌తో త‌ల‌ప‌డ‌నుంది. 

కామెంట్‌లు