కర్నాటకం రసవత్తరం - అమెరికాలో కుమార - రంగంలోకి దిగిన డీకే
మళ్లీ మొదటికి వచ్చింది కర్ణాటక కథ. ఎప్పుడు వుంటుందో ఎప్పుడు ఊడి పోతుందో తెలియని పరిస్థితిని ఎదుర్కొంటున్న సంకీర్ణ సర్కార్‌కు ఎమ్మెల్యేలు కొందరు కమలం వైపు చూసేందుకు ట్రై చేయడంతో పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. వ్యక్తిగత పనుల నిమిత్తం ముఖ్యమంత్రి కుమార స్వామి అమెరికాకు వెళ్లారు. ఇదే అసలైన సమయంగా భావించిన కొందరు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో సంక్షోభం తారా స్థాయికి చేరుకుంది. ఏకంగా ఎనిమిది మంది ప్రజాప్రతినిధులు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారన్న సమాచారంతో అధికార కాంగ్రెస్ - జేడీఎస్ కూటమిలో కలకలం రేగింది. సౌమ్యా రెడ్డి, బీసీ పాటిల్ సహా సంకీర్ణ సర్కార్‌లో అసంతృప్తిగా ఉన్న 8 మంది నేతలు రాజీనామా సమర్పించేందుకు అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్‌ను కలవనున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.
దీంతో కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరొందిన్న మంత్రి డీకే శివకుమార్ హుటాహుటిన తన నియోజకవర్గం నుంచి బెంగళూరుకు బయలు దేరారు. పీసీసీ చీఫ్ దినేష్ గుండూరావు విదేశాల్లో ఉండగా ..వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్ ..పార్టీ సీనియర్ ఎమ్మెల్యే రామలింగా రెడ్డిని కలిశారు. రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన జాబితాలో ఆయన పేరు ముందుంది. ఇటీవల ఆనంద్ సింగ్, రమేష్ జార్క హోళీ సహా ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో 13 నెలల కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వం ప్రమాదం అంచున నిలిచింది. అయితే తమ ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదని, పూర్తి కాలం తాము పవర్‌లో ఉంటామని కాంగ్రెస్, జేడీఎస్ లు ధీమా వ్యక్తం చేశాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు కేవలం ఒక్కో సీటుతో సరిపెట్టుకున్నాయి. బీజేపీకి ఏ మాత్రం పోటీ ఇవ్వలేక పోయాయి.
మొత్తం 28 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరిగితే 25 స్థానాలను కమలం కైవసం చేసుకుంది. ఒక స్థానాన్ని ఇండిపెండెంట్ అభ్యర్థి చేజిక్కించుకోగా ఒకటి కాంగ్రెస్ , మరో సీటును జేడీఎస్ గెలుచుకుంది. దీంతో అప్పటి నుంచి సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందన్న ప్రచారం ఊపందుకుంది. కర్నాటక అసెంబ్లీలో మొత్తం 225 అసెంబ్లీ స్థానాలు ఉండగా , భారతీయ జనతా పార్టీకి 105 స్థానాలు ఉన్నాయి. ఇదే అతి పెద్ద పార్టీగా ఉంది. రాజీనామాలు చేసేకంటే ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 78 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 38 మంది ఎమ్మెల్యేలు జేడీఎస్ పార్టీకి చెందిన వారున్నారు. బీఎస్పీ , కేపీజే పార్టీలకు చెరో ఒక సీటు చొప్పున ఉన్నాయి. మిగిలిన రెండు స్థానాల్లో ఓ స్వతంత్ర అభ్యర్థి, మరో స్పీకర్ ఉన్నారు. దీంతో ఇరు శిబిరాల్లో ఎమ్మెల్యేల సంఖ్యా బలం కీలకంగా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఇరు పార్టీలకు చెందిన నేతలు ఉత్కంఠకు లోనవుతున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి