బండ్ల‌కు నో గిరాకీ - నేల చూపులు చూస్తున్న కంపెనీలు

దేశీయ ఆటోమొబైల్ రంగం ఎన్న‌డూ లేనంత పోటీని ఎదుర్కొంటోంది. విదేశీ మార్కెట్ ప‌రంగా చూస్తే ఫోర్ వీల‌ర్స్ భారీ స్థాయిలో అమ్ముడు పోతుంటే, ఇండియాలో మాత్రం అమ్మ‌కాలు భారీగా త‌గ్గి పోయాయి. దీంతో ఆయా కార్ల కంపెనీలు నేల చూపులు చూస్తున్నాయి. గ‌త ఏడాది అమ్మ‌కాల్లో టాప్ వ‌న్‌లో నిలిచిన మారుతీ, సుజుకీ కంపెనీ ఇపుడు గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది. ఇక హ్యూందాయి, హోండా, టాటా, ఫోర్డ్, త‌దిత‌ర కంపెనీల కార్లు కూడా అమ్ముడు పోవ‌డం లేదు. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు కొద్ది మేర పెంచ‌డంతో వినియోగ‌దారుల‌పై మ‌రింత భారం ప‌డ‌నుంది. వాహ‌నాల నిర్వ‌హ‌ణ రోజు రోజుకు భారంగా ప‌రిణ‌మించడంతో ఎక్కువ‌గా జ‌నం త‌మ అవ‌స‌రాల కోసం స్వంత వాహ‌నాల కంటే, అద్దె వాహ‌నాల‌కు ప్ర‌యారిటీ ఇస్తున్నారు. దీంతో అద్దె ట్యాక్సీలకు విప‌రీత‌మైన గిరాకీ ఏర్ప‌డింది. ఇప్ప‌టికే ఓలా, ఊబ‌ర్, త‌దిత‌ర కంపెనీలు త‌మ వ్యాపారాన్ని విస్త‌రించాయి. జ‌ర్నీ మేడ్ ఈజీ అంటూ ..స‌ర్వీసెస్ అంద‌జేస్తున్నాయి.

ఇండియాలో బిగ్గెస్ట్ డిమాండ్ ఉన్న కంపెనీగా పేరొందిన మారుతీకి ఈ ఏడాది ఏమంత అచ్చిరాలేదు. గ‌త జూన్ నెల‌లోను క‌ష్టాలు కొన‌సాగాయి. య‌థావిధిగా అమ్మ‌కాలు భారీగా త‌గ్గాయి. దేశంలోనే అతి పెద్ద ప్ర‌భుత్వ రంగ వాహ‌న సంస్థ గా ఉన్న మారుతీ అమ్మ‌కాలు గ‌త నెల కూడా క్షీణించాయి. 2018 జూన్‌లో ఈ కంపెనీ 1.45 ల‌క్ష‌ల యూనిట్ల‌ను అమ్మ‌గా, గ‌త నెల మాత్రం కేవ‌లం 1.24 ల‌క్ష‌ల యూనిట్ల‌ను మాత్ర‌మే విక్ర‌యించింది. అంటే దాదాపు 21 శాతం ప‌డిపోయిన‌ట్టే. దేశీయంగా అమ్మ‌కాలు 1.35 ల‌క్ష‌ల యూనిట్ల నుంచి 1.14 ల‌క్ష‌ల యూనిట్ల‌కు ప‌డిపోయాయి. మినీ సెగ్గెంట్ ప‌రిధిలోని ఆల్టో, వేగ‌నార్ లు కూడా నిరాశ ప‌రిచాయి. వీటి అమ్మ‌కాల్లో 36 శాతం ప‌త‌నం క‌నిపించింది. విక్ర‌యల ప‌రంగా చూస్తే 29 వేల 381 నుంచి 18 వేల 733 యూనిట్ల‌కు త‌గ్గిపోయాయి. కాంప్టాక్ట్ సెగ్మెంట్ కు చెందిన న్యూ వేగ‌నార్, సెలేరియా, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్ అమ్మ‌కాల్లో 12 శాతం ప‌త‌నం క‌నిపించింది.

విక్ర‌యాలు 71 వేల 750 యూనిట్ల నుంచి 62 వేల 897 యూనిట్ల‌కు త‌గ్గిపోయాయి. మిడ్ సెగ్మెంట్ వాహ‌నం సియాజ్ అమ్మ‌కాల్లో మాత్రం 74 శాతం పెరుగుద‌ల న‌మోదు కావ‌డం విశేషం. 1, 579 యూనిట్ల నుంచి 2 వేల 322 యూనిట్ల‌కు పెరిగాయి. యుటిలిటి వెహికిల్స్‌గా పిలిచే జిప్సీ, ఎర్టిగా, వాటారా బ్రెజా, ఎస్ - క్రాస్ అమ్మ‌కాల్లో 7.9 శాతానికి త‌గ్గింది. విక్ర‌యాలు 19 వేల 231 యూనిట్ల నుంచి 17 వేల 797 యూనిట్ల‌కు త‌గ్గి పోయాయి. ఓమ్నీ, ఈకో వ్యాన్ల అమ్మ‌కాల్లో 24 శాతం ప‌త‌నం క‌నిపించింది. విక్ర‌యాలు 12 వేల 185 యూనిట్ల నుంచి 9 వేల 265 యూనిట్ల‌కు త‌గ్గి పోయాయి. తేలికపాటి కమర్షియల్‌‌ వాహనం సూపర్‌‌ క్యారీ విక్రయాలు మాత్రం 24 శాతం పెరిగాయి. అమ్మకాలు 1,626 యూనిట్ల నుంచి 2,017 యూనిట్లకు పెరిగాయి. వాహన ఎగుమతులు 2018 జూన్‌‌తో పోలిస్తే 2019 జూన్‌‌లో 5.7 శాతం పెరిగాయి. విక్రయాలు 9,319 యూనిట్ల నుంచి 9,847 యూనిట్లకు పెరిగాయని మారుతీ సుజుకీ తెలిపింది.

ఇక మ‌హీంద్రా కంపెనీ ప‌రంగా చూస్తే ఈ కంపెనీకి కూడా జూన్ నెల క‌లిసి రాలేదు. 2018 జూన్‌‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్‌‌లో అమ్మకాలు ఆరు శాతం తగ్గి 42,547యూనిట్లుగా నమోదయ్యాయి. గత జూన్‌‌లో ఇది 45,155 వాహనాలను అమ్మింది. దేశీయంగా అమ్మకాలు ఐదుశాతం తగ్గాయి. అమ్మకాలు 41,689 యూనిట్ల నుంచి 39,471 యూనిట్లకు పడిపోయాయని కంపెనీ తెలిపింది. ఎగుమతులు 11 శాతం తగ్గాయి. ఈ విభాగంలో అమ్మకాలు 3,466 యూనిట్ల నుంచి 3,076 యూనిట్లకు పడిపోయాయి. ప్యాసింజర్‌‌ వెహికల్స్‌‌ అమ్మకాలు 18,137 లక్షల యూనిట్ల నుంచి 18,826 యూనిట్లకు పెరిగాయి. కమర్షియల్‌‌ వాహన అమ్మకాలు 19,229 యూనిట్ల నుంచి 16,393 యూనిట్లకు తగ్గిపోయాయి. మారుతి, మహీంద్రా మాదిరే టొయోటా కిర్లోస్కర్‌‌ కంపెనీ పరిస్థితీ బాగా లేదు. గత జూన్‌‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్‌‌లో ఈ కంపెనీ అమ్మకాలు 19 శాతం తగ్గి 11,365 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక హ్యూండై కంపెనీ అమ్మ‌కాలు 3.2 శాతం డౌన్ అయ్యాయి.

కామెంట్‌లు