అంకురాల‌కు ఆస‌రా..కేంద్ర స‌ర్కార్ భ‌రోసా..!

ప్ర‌పంచం స్టార్ట‌ప్‌ల వైపు చూస్తోంది. అంకురాల‌కు వెన్నుద‌న్నుగా నిలుస్తున్నాయి. ఆలోచ‌న‌ల‌కు రెక్క‌లు తొడిగి..అంకురాలుగా మారేలా చేసేందుకు ప‌లు కంపెనీలు, సంస్థ‌లు, వ్యాపార వేత్త‌లు, బిజినెస్ టైకూన్స్ , ఆయా ప్ర‌భుత్వాలు పెట్టుబ‌డులు పెట్ట‌డంతో, మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు పెద్ద‌పీట వేస్తున్నాయి. ఇండియాలో తాజాగా స్టార్ట‌ప్‌ల హ‌వా కొన‌సాగుతోంది. ఓలా, ఊబ‌ర్, ఫోన్ పే, స్విగ్గీ , ఎనీ టైం లోన్ లాంటివి ఎన్నో స‌క్సెస్ బాట‌లో న‌డుస్తున్నాయి. ఎక్కువ‌గా బెంగ‌ళూరులో అంకురాలు ఏర్పాట‌య్యాయి. ఐటీ, లాజిస్టిక్, హెల్త్, ట్రావెల్ టూరిజం , ఎడ్యూకేష‌న్, ఏవియేష‌న్, త‌దిత‌ర రంగాల‌లో స్టార్ట‌ప్‌లు పుట్టుకొచ్చాయి. వేలాది మందికి ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఉపాధి కూడా దొరుకుతోంది. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం మేకిన్ ఇండియా ప్రోగ్రాంను తీసుకు వ‌చ్చింది. స్టార్ట‌ప్‌ల‌ను ప్రోత్స‌హించేందుకు గాను మోడీ స‌ర్కార్ ప్ర‌త్యేకంగా అంకురాల‌ను ప్రోత్స‌హించేందుకు ప్ర‌త్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు.

తాజాగా స్టార్ట‌ప్స్ ఏర్పాటు చేసేందుకు వీలుగా కేంద్ర బ‌డ్జెట్‌లో ప్ర‌భుత్వం ప‌లు ప్రతిపాద‌న‌లు చేసింది. ప్ర‌స్తుతం స్టార్ట‌ప్స్ కు ఏంజెల్ టాక్స్ ఇబ్బందిక‌రంగా మారింది. అనేక‌సార్లు దీని గురించి అంకురాల వ్య‌వ‌స్థ‌పాకులు స‌ర్కార్ ముందు ఆందోళ‌న వెలిబుచ్చారు. ఈ నేప‌థ్యంలో ఇక్క‌ట్లు ఎదుర్కొంటున్న అంకురాల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగే విధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప‌లు ప్ర‌తిపాద‌న‌లు చేశారు. ఈ మేర‌కు స్టార్ట‌ప్‌లు , వాటి ఇన్వెస్ట‌ర్లు త‌గిన డిక్ల‌రేష‌న్ల‌ను ఫైల్ చేయ‌డంతో పాటు వారి రిట‌ర్నులలో స‌మాచారాన్ని తెలియ చేస్తే షేర్ ప్రిమియంల వాల్యూయేష‌న్ కు సంబంధించి ఎలాంటి ప‌రిశీల‌న ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ఇన్వెస్ట‌ర్‌తో పాటు వారికి నిధులు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయ‌న్న దానికి సంబంధించిన స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఈ - వెరిఫికేష‌న్ యంత్రాంగాన్ని అందుబాటులోకి తెస్తారు. ఫ‌లితంగా నిధులు స‌మీక‌రించిన స్టార్ట‌ప్స్‌పై ఆదాయ ప‌న్ను శాఖ ప‌రిశీల‌న అంటూ ఉండ‌దు.

అంకురాల‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అసెస్‌మెంట్లు , స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం కేంద్ర ప్ర‌త్య‌క్ష ప‌న్నుల బోర్డు ప్ర‌త్యేక పాల‌నా సౌక‌ర్యాల‌ను క‌ల్పించ‌నుంది. ప్ర‌స్తుతం స్టార్ట‌ప్స్ కేట‌గిరీ -1 ఆల్ట‌ర్నేటివ్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్స్ స‌హా ఇత‌ర ఇన్వెస్ట‌ర్స్‌కు జారీ చేసిన షేర్ల మార్కెట్ విలువ గురించి వివ‌ర‌ణ ఇచ్చు కోవాల్సిన అవ‌స‌రం లేదు. దీనిని కేట‌గిరి -2 ఏఐఎఫ్‌ల‌కు కూడా వ‌ర్తింప చేయ‌నున్నారు. ఫ‌లితంగా ఈ అంశంపై ఆదాయ ప‌న్ను శాఖ ప‌రిశీలించ‌దు. ఈ ఫండ్స్ చేసే పెట్టుబ‌డుల‌పై ఆదాయ ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ -56 (2) కింద మిన‌హాయింపు ల‌భించ‌నుంది. అంకురాలు సాధార‌ణంగా ఏంజెల్ ఇన్వెస్ట‌ర్ల నుంచి నిధులు స‌మీక‌రిస్తుంటాయి. ఏడాది కాలంలో దాదాపు 300 - 400 స్టార్ట‌ప్‌లు ఏంజిల్ ఫండింగ్ పొందుతున్నాయి. వీరి పెట్టుబ‌డుల ప‌రిణామం 15 ల‌క్ష‌ల నుంచి 4 కోట్ల రూపాయ‌ల దాకా ఉంటోంది. స్టార్ట‌ప్ ఫౌండ‌ర్స్ , ఆంట్ర‌ప్రెన్యూర్స్ కు ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఉండేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని విత్త‌మంత్రి లోక్‌స‌భ‌లో ప్ర‌క‌టించారు. అంతేకాక అంకురాల కోసం ప్ర‌త్యేకంగా న్యూస్ ఛాన‌ల్‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు నిర్మలా సీతారామ‌న్ తెలిపారు. మొత్తం మీద తాజా బ‌డ్జెట్ లో స్టార్ట‌ప్‌ల‌కు మ‌హ‌ర్ద‌శ రానుంది. 

కామెంట్‌లు