కులాల వారీగా కూర్పు..ఎట్టకేలకు ఏపీ కేబినెట్ ఫైనల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో థంబింగ్ మెజారిటీతో పవర్ లోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ..దాని అధినేత, తాజా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన జట్టుకు తుది రూపం ఇచ్చారు. కులాల వారీగా ప్రాధాన్యత కల్పిస్తూ ..సమప్రాధాన్యత ఇచ్చారు. అన్ని సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. అంతేకాకుండా సమ న్యాయం, సమ తూకం వుండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మొదటి నుంచి తన వెంట వుండి, పార్టీని నమ్ముకుని , పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రయారిటీ ఇచ్చారు. ఏడుగురు బలహీన వర్గాలకు కేబినెట్‌లో చోటు వుండేలా చేశారు. ఎస్సీ వర్గానికి చెందిన ఐదుగురికి ఛాన్స్ ఇవ్వగా వీరిలో మాదిగ కులానికి 2, మాల కులానికి 3 బెర్త్‌లు కన్‌ఫర్మ్ చేశారు.
ఇక మిగతా కులాలకు సంబంధించి చూస్తే కాపు, రెడ్డి వర్గాలకు నాలుగు చొప్పున ఇచ్చారు. వైశ్య, క్షత్రియ, కమ్మ, మైనార్టీ వర్గాలకు ఒక్కో మంత్రి పదవి కేటాయించారు. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే , త్వరలో మంత్రివర్గం ప్రకటిస్తానని, తనను నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా అవకాశం కల్పిస్తానని, ప్రజలకు సేవ చేయాలని కోరారు. గత కొన్ని రోజులుగా ఊహాగానాలకు తెర దించుతూ జగన్ త్వరగా డిసిషన్ తీసుకున్నారు. సుదీర్ఘమైన కసరత్తు చేశారనే చెప్పుకోవాలి. తాను అనుకున్న వారికి చోటు కల్పిస్తూ ..పూర్తి జాబితా ఆమోదం కోసం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు అందజేశారు. పార్టీ నుండి 151 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వారందరూ ఈ పదవులకు అర్హులే. మిగతా వారికి కూడా మంత్రివర్గంలో చోటు దక్కాల్సి వుంది. రెండున్నర ఏళ్ల తర్వాత ఉన్నవారిలో 20 మందిని మార్చేసి..వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ , కాపు సామాజిక వర్గాలకు చెందిన ఒక్కొక్కరికి ఉప ముఖ్యమంత్రులుగా ఛాన్స్ ఇస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. వెలగపూడిలోని సచివాలయం ప్రాంగణంలో నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇక జిల్లాల వారీగా చూస్తే..శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన కృష్ణదాస్, విజయనగరం జిల్లా నుంచి బొత్స సత్యనారాయణ, పాముల పుష్ప శ్రీవాణి, విశాఖ జిల్లా నుంచి అవంతి శ్రీనివాస్, తూర్పుగోదావరి జిల్లా నుంచి కన్నబాబు, విశ్వరూప్, పిల్లి సుభాష్ చంద్రబోస్, కృష్ణా జిల్లా నుంచి కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని ఉన్నారు. ఇక ప్రకాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, నెల్లూరు నుంచి మేకపాటి గౌతం రెడ్డి, కర్నూలు జిల్లా నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, జయరాం ఉన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఆళ్ల నాని, శ్రీరంగనాథ రాజు, తానేటి వనిత, గుంటూరు జిల్లా నుంచి వెంకటరమణ, సుచరిత, చిత్తూరు జిల్లా నుంచి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, కడప జిల్లా నుంచి అంజాద్ బాషా, అనంతపురం జిల్లా నుంచి శంకర నారాయణ, నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ లకు చోటు దక్కింది. స్పీకర్‌గా శ్రీకాకుళం జిల్లాకు చెందిన తమ్మినేని సీతారాంను ఎంపిక చేశారు. ఉప సభాపతిగా రాజన్న దొరకు ఛాన్స్ లభించనుంది. మొత్తం మీద జగన్ జాగ్రత్తగా తన టీంను సెలక్ట్ చేయడంతో మిగతా ఎమ్మెల్యేలు కామ్‌గా ఉండి పోయారు. ఇంకా పలు కార్పొరేషన్ల పదవులు ఉన్నాయి. నామినేటెడ్ పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే టీటీడీ ఛైర్మన్ పదవి మాజీ ఎంపీ ఏవి సుబ్బారెడ్డికి దక్కనుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి