తీరుమారని ఐసీసీ - బలిదాన్‌పై రాద్ధాంతం - వ్యక్తి కంటే దేశమే మిన్న
ప్రపంచాన్ని శాసించాలని కలలు కంటున్న అమెరికా లాగానే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తన పెత్తనం ఉండాలని, తన అదుపులోనే అన్ని దేశాల జట్లు నడవాలని కోరుకొంటోంది. ఎక్కడలేని నియమ నిబంధనలు జత చేస్తూ ఆటగాళ్లతో ఆటాడుకుంటోంది. ఇప్పటికే అత్యధికంగా ఆదాయం కలిగిన క్రికెట్ బోర్డులలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మొదటి స్థానంలో ఉంది. ఇండియా అంటేనే క్రికెట్ ..క్రికెట్ అంటేనే భారత్ ..ఇపుడిది నినాదం కాదు..సామాజిక వాస్తవం. ఎన్ని కులాలు, మతాలు, వర్గాలు వున్నప్పటికీ క్రికెట్ మ్యాచ్ అంటేనే ఒక్కటవుతారు. తమ జాతి అభిమానాన్ని చాటుకుంటారు. అంతలా జనంలో మమేకమై పోయింది ఈ ఆట. ఇక్కడ ఆటగాళ్లను దేవుళ్లకంటే ఎక్కువగా కొలుస్తారు. ఎక్కడలేనంతటి డిమాండ్ వీరికి ఉంది.
ఇదే ఇపుడు హాట్ టాపిక్. ప్రతి సారి ఐసీసీ బీసీసీఐ విషయంలో జోక్యం చేసుకోవాలని చూడటం, ఇండియా ఆడే మ్యాచ్‌లప్పుడు ఏవో కొర్రీలు వేయడం పరిపాటిగా మారింది. ఈ విషయంపై బీసీసీఐ , పాలకవర్గం గట్టిగానే సమాధానం చెప్పింది. ఐసీసీ ఆదాయంలో అధిక శాతం ఇండియాదే. తాజాగా ఐసీసీ వార్తల్లోకి ఎక్కింది. ప్రస్తుతం ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోంది. టీ20తో పాటు ప్రపంచ కప్ ను అందించిన ఆటగాడిగా మహేంద్రసింగ్ ధోనీకి పేరుంది. ఆయనకు ఇండియన్ ఆర్మీ అంటే వల్లమాలిన అభిమానం. దేశ భక్తి మెండు. ధోనీ ధరించే గ్లోవ్స్ పై బలిదాన్ గుర్తు ధరించాడు. ఇంకేం దీనిని పెద్దదిగా చేసి చూపించారు విదేశీ మీడియా. ఇంకేం కొరడా ఝులిపించేందుకు ఐసీసీ రెడీ అయింది. తక్షణమే వాటిని తీసి వేయాలని హుకూం జారీ చేసింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ప్రపంచమంతటా ఐసీసీపై ఆగ్రహం వ్యక్తమైంది. ఇది మరింత తీవ్రతరం కావడంతో బీసీసీఐ పెద్దలు, భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది. క్రికెటర్లు తమకు నచ్చిన వాటిని ధరించడం మామూలే. మతపరమైన లేదా ప్రొవోక్ చేసేలా ఉండే చిహ్నాలు, ఇతర గుర్తులు వాడరాదనే నిబంధన వుంది. కానీ బలిదాన్ గుర్తు..వీర జవానులను స్మరించు కోవడం. మొదటి నుంచి ధోనీకి దేశభక్తి ఎక్కువ. ఒకవేళ క్రికెటర్ ను కాక పోయి వుంటే..జవాన్‌ను అయ్యేవాడినంటూ ధోనీ చెప్పాడు. టెరిటోరియల్ ఆర్మీ ప్యారా చూట్ రెజిమెంట్‌లో ధోనీ లెఫ్టినెంట్ కల్నల్ కూడా. పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకుంటున్న సమయంలో ఆయన సైనిక దుస్తులు ధరించి..ప్రెసిడెంట్ తో స్వీకరించాడు.
ఓ ఫ్యాన్ ..మహిని కలిసే సమయంలో జాతీయ జెండాను నేలపై పెడుతుండగా పట్టుకున్నాడు. అంతలా అభిమానం చాటుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ బలిదాన్ గుర్తుతో గ్లోవ్స్ ధరించాడు. ఇదే పెద్ద రాద్దాంతం అయింది. ఈ విషయంపై బీసీసీఐ వివరణ కోరింది. బలిదాన్ అన్నది సైన్యానికి గుర్తు. ఇందులో అభ్యంతరం పెట్టాల్సిన పనిలేదంటూ పేర్కొంది. ఇండియా వ్యాప్తంగా ఐసీసీపై నిరసన వ్యక్తమవుతోంది. మొత్తం మీద ధోనీ చేసిన ఈ పనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రముఖుల నుంచి ఆయనకు మద్ధతు పెరుగుతోంది. ఏది ఏమైనా ధోని చేసిన ఈ పనికి ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి