హక్కుల కమిషన్ ఆగ్రహం - టీఎస్ సర్కార్‌పై సీరియస్
బాధ్యత కలిగిన ప్రభుత్వం, ఉన్నతాధికారులు ప్రజల సొమ్ముతో సౌకర్యాలను అనుభవిస్తూ ..పిల్లలు పిట్టల్లా రాలిపోతుంటే కనీస స్పందన అంటూ ఉండదా అని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణ సర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంత మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మీకు కళ్లు లేవా అని ప్రశ్నించింది. అసలు ప్రభుత్వం ఉందా ఈ రాష్ట్రంలో అని అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు తక్షణమే చోటు చేసుకున్న పరిణామాలు, సంఘటనలపై తక్షణమే నివేదిక సమర్పించాలని సర్కార్‌ను ఆదేశించింది. ఆ వార్తలు వాస్తవమైతే అధికారులు బాధ్యులేనంటూ వ్యాఖ్యానించింది. ఎలాంటి అనుభవం లేని గ్లోబరినా సంస్థకు ఇంత పెద్ద స్థాయిలో జరిగే పరీక్ష నిర్వహణను ఏ రకంగా అప్పగిస్తారంటూ నిలదీసింది.
మరో వైపు పునః మూల్యాంకనం చేసేందుకు ఇంటర్ బోర్డును ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఒక్కరొక్కరుగా సూసైడ్ చేసుకోవడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ( ఎన్‌హెచ్ఆర్‌సీ) స్పందించింది. మూడున్నర లక్షల మంది ఫెయిల్ అయ్యారని, 18 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారంటూ వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించింది. బాధిత కుటుంబాలకు పరిహారం, నష్టపోయిన విద్యార్థులకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు..తదితర వివరాలతో నాలుగు వారాల్లోగా పూర్తి నివేదికలు సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. పరీక్షల నిర్వహణలో లోటుపాట్ల గురించి అంగీకరించేందుకు మొదట నిరాకరించిన విద్యా శాఖాధికారులు ..ఆ తర్వాత స్టూడెంట్స్, పేరెంట్స్ ఆందోళనలతో అంగీకరించారని కమిషన్ వెల్లడించింది.
పత్రికల్లో, మీడియాలో వచ్చిన కథనాలు నిజమైతే ..అధికారులు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్టు భావించాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. గతంలో సీజీజీ ద్వారా పరీక్షలు నిర్వహించే వారని..సమర్థత లేని సంస్థకు బాధ్యతలు అప్పగించినట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఎంసెట్, నీట్, జేఈఈ వంటి పరీక్షల సమయం మించి పోతోందని ..ఈలోగా భారీ ఎత్తున స్టూడెంట్స్ కు ఎలా సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారో తెలియ చేయాలని కోరింది. మరో వైపు ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులందరి జవాబు పత్రాలను పునః మూల్యాంకనం చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మరో పిటిషన్ హైకోర్టులో దాఖలైంది. దీనిని లాయర్ రాపోలు బాస్కర్ దాఖాలు చేశారు. తన కూతురు ఇంటర్ పరీక్ష రాసిందని, రీ వాల్యూయేషన్లో నిర్లక్ష్యం చోటు చేసుకోవడంతో తాను కోర్టును ఆశ్రయించానని తెలిపారు. బోర్లు నిర్లక్ష్యం వల్ల 21 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు.
ఇందులో ప్రతివాదులుగా విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, గ్లోబరీనా సంస్థ ఎండీలను చేర్చారు. మరో వైపు సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును 27 నుండి 29 వరకు పెంచారు. తక్షణమే ఉన్నతాధికారులను సస్పెండ్ చేయాలని, విద్యా శాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్న ..సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించినా ఇంటర్ విద్యార్థుల ఆందోళనలు ఆగడం లేదు. ధర్నాలు, ఆందోళనలు, రాస్తారోకోలు జరుగుతూనే ఉన్నాయి. విద్యార్థులకు బాసటగా విపక్షాలతో పాటు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు తమ సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. బాధిత కుటుంబాలకు బాసటగా నిలిచారు. మరికొందరు బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కోరారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి