ముంబై భ‌ళా..చెన్నై విల విల

ఐపీఎల్ -12 టోర్న‌మెంట్ ఛాంపియ‌న్‌గా భావిస్తున్న చెన్నై క్రికెట్ జ‌ట్టు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ముంబై ఇండియ‌న్స్ క్రికెట్ జ‌ట్టు దెబ్బ‌కు విల‌విల లాడి పోయింది. అద్భుత‌మైన ప‌ర్‌ఫార్మెన్స్‌తో వ‌రుస విజ‌యాలు న‌మోదు చేసుకుంటూ దుమ్ము రేపుతున్న చెన్నైకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ముంబై బౌల‌ర్ల తాకిడికి ప‌రుగులు చేసేందుకు నానా ఇబ్బందులు ప‌డ్డారు. స్వంత గ‌డ్డ‌పై తొలి సారిగా ఓట‌మి పాలైంది చెన్నై. ముందు బ్యాటింగ్ చేసిన ముంబై ఆశించినంత మేర ప‌రుగులు చేయ‌లేక పోయినా..ఆ జ‌ట్టు బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. చెన్నైని క‌ట్ట‌డి చేసింది. వీరంతా స‌మిష్టిగా రాణించ‌డంతో విజ‌యం సాధించ‌డం సుల‌భ‌మైంది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ చేసిన ప్ర‌ద‌ర్శ‌న‌కు తోడు జ‌ట్టు ఆట‌గాళ్లు అండ‌గా నిలిచారు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో చెన్నై ప‌రుగుల ప‌రంగా రెండో అతి పెద్ద అప‌జ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. 46 ప‌రుగుల తేడాతో ఓడించింది. ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 155 ప‌రుగులు మాత్ర‌మే చేసింది.

రోహిత్ 48 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, మూడు సిక్స‌ర్ల‌తో 67 ప‌రుగులు చేశాడు. ఈ సీజ‌న్‌లో తొలిసారిగా అర్ధ సెంచ‌రీ చేశాడు. చెన్నై జ‌ట్టు త‌ర‌పున సాన్ ట్న‌ర్ 2 వికెట్లు ప‌డ‌గొట్టాడు. టార్గెట్ ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన చెన్నై జ‌ట్టు 17.4 ఓవ‌ర్ల‌లో 109 ప‌రుగులు మాత్ర‌మే చేసి..చ‌తికిల‌ప‌డింది. ముర‌ళీ విజ‌య్ ఒక్క‌డే బాగా ఆడాడు. 35 బంతుల్లో ఎదుర్కొని మూడు ఫోర్లు, ఒక సిక్స‌ర్ సాయంతో 38 ప‌రుగులు చేశాడు. మ‌ళింగ 4 వికెట్లు తీశాడు. విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన రోహిత్ శ‌ర్మ‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ద‌క్కింది. టాస్ గెలిచిన చెన్నై జ‌ట్టు మొద‌టగా ఫీల్డింగ్ ఎంచుకున్నారు. రోహిత్, డికాక్ ప‌రుగులు చేసే క్ర‌మంలో మూడో ఓవ‌ర్ల‌లో సిక్స్‌, ఫోర్ కొట్టిన డికాక్ 9 బంతుల్లో 15 ప‌రుగులు చేశాడు. దీప‌క్ చ‌హ‌ర్ అవుట్ చేశాడు. హ‌ర్బ‌జ‌న్ 8వ ఓవ‌ర్ లో రోహిత్ సిక్స‌ర్ల‌తో మెరిపించ‌గా ..తాహిర్ 9వ ఓవ‌ర్లో లూయిస్ 6, 4 కొట్టాడు. మ‌ధ్య‌లో బ్రేవో, సాన్ ట్న‌ర్ మెరుగ్గా బౌలింగ్ చేయ‌డంతో ముంబై ఆశించినంత ప‌రుగులు చేయ‌లేక పోయింది.

లూయిస్ 32 ప‌రుగులు చేశాడు. 16 ఓవ‌ర్‌లో రోహిత్ రెచ్చి పోయాడు. తాహిర్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్స‌ర్ కొట్టాడు. అనంత‌రం బ‌రిలోకి దిగిన చెన్నై జ‌ట్టు ఏ ద‌శ‌లోనూ పోరాటాన్ని ప్ర‌ద‌ర్శించ లేక పోయింది. త‌మంత‌కు తామే వికెట్ల‌ను స‌మ‌ర్పించుకున్నారు. స‌గం ఓవ‌ర్ల‌కు ముందే పెవిలియ‌న్ బాట ప‌ట్టారు. వాట్స‌న్ మళింగ బౌలింగ్‌లో వెనుతిరిగాడు. క్రీజులోకి వ‌చ్చిన రైనా పాండ్యా బౌలింగ్‌లో అవుట‌య్యాడు. విజ‌య్ ఆదుకునే ప్ర‌య‌త్నం చేశాడు. రాయుడు ఖాతా తెర‌వ‌లేదు. ఓవ‌ర్లు గ‌డుస్తున్న కొద్దీ వికెట్ల‌ను చేజార్చుకుంటూ ల‌క్ష్యానికి దూర‌మైంది. పిచ్ పూర్తిగా బౌల‌ర్ల‌కు స‌హ‌క‌రించింది. 10 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్లు కోల్పోయింది. 109 ప‌రుగుల‌కే ఆల‌వుట్ అయింది. ఓట‌మిని చేజేతులా కొని తెచ్చుకుంది చెన్నై జ‌ట్టు . తీవ్ర జ్వ‌రం దెబ్బ‌కు ధోనీ ముంబైతో జ‌రిగిన మ్యాచ్ లో ఆడ‌లేక పోయాడు. ఒక‌వేళ ధోనీ ఆడి వుండివుంటే ..మ్యాచ్ చెన్నై పోగొట్టుకునేది కాద‌న్న‌ది ఫ్యాన్స్ అభిప్రాయం.

కామెంట్‌లు