పెద్దన్న తలకు వెల

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచాన్ని భయపెడుతోంది. ఏ క్షణం లోనైనా మరో వార్ కు సై అంటున్నాయి. అంతే కాదు ఒకరిపై మరొకడు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇదే సమయంలో అమెరికా ఏకపక్ష దాడుల్లో ఇరాన్ భారీగా నష్ట పోయింది. ఈ దాడులను నిరసిస్తూ ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. కాగా ఇరాన్‌ జనరల్‌ సులేమానీ మృతికి కారణమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తలకు ఇరాన్‌ వెల కట్టింది. ఆయన్ను చంపిన వారికి దాదాపు 575 కోట్ల భారీ నజరానా ఇస్తామని ప్రకటించింది. మరోవైపు, అమెరికా డ్రోన్‌ దాడిలో చనిపోయిన జనరల్‌ సులేమానీ మృతదేహం ఇరాన్‌ రాజధాని బాగ్దాద్‌ చేరుకుంది. సులేమానీకి లక్షలాది మంది కన్నీళ్లతో నివాళులు అర్పించారు.

అనంతరం ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ నేతృత్వంలో ప్రార్థనలు జరిగాయి. జనరల్‌ సులేమానీ, తదితరులకు చెందిన శవ పేటికల వద్ద ప్రార్థనలు చేసే సమయంలో ఖమేనీ కన్నీటి పర్యంతమయ్యారు. అధ్యక్షుడు రౌహానీ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను చంపిన వారికి భారీ బహుమానం అందజేస్తామంటూ ఈ సందర్భంగా ఇరాన్‌ ప్రభుత్వ మీడియా తెలిపింది. ఇరాన్‌లోని 8 కోట్ల మంది పౌరుల నుంచి ఒక్కో అమెరికా డాలర్‌ చొప్పున చందాగా వసూలు చేసి ట్రంప్‌ను చంపిన వారికి అందజేస్తామని మిర్రర్‌ వెబ్‌సైట్‌ తెలిపింది.

అమెరికా బలగాలు తమ దేశం నుంచి వెంటనే వెళ్లి పోవాలంటూ ఇరాక్‌ పార్లమెంట్‌ తీర్మానించడంపై అధ్యక్షుడు ట్రంప్‌ స్పందించారు. పశ్చిమాసియాలో తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న చమురు ధరలు, అమెరికా, ఇరాన్‌లు చేస్తున్న తీవ్ర ప్రకటనల నేపథ్యంలో జర్మనీ చాన్సెలర్‌ మెర్కెల్, ఫ్రాన్సు అధ్యక్షుడు మేక్రాన్, బ్రిటన్‌ ప్రధాని జాన్సన్‌ ఒక ఉమ్మడి ప్రకటన చేశారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అన్ని పక్షాల వారు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. మొత్తం మీద నువ్వా నేనా అన్న రీతిలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.

కామెంట్‌లు