పల్లె బాట పట్టిన నగరం

సంక్రాంతి పండుగ దెబ్బకు మహానగరం పల్లె బాట పట్టింది. రైళ్లు, బస్సులు, విమానాలు, వాహనాలు ప్రయాణీకులతో నిండి పోయాయి. రహదారులపై వాహనాలు నిలిచి పోవడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పండుగ కోసం రెండు రోజులు ముందుగానే బయలుదేరారు. దీంతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి ప్రధాన రైల్వే స్టేషన్‌లతో పాటు, మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, జూబ్లీ బస్‌స్టేషన్‌  ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడాయి. రైళ్లు, బస్సులు కిక్కిరిసి పోయాయి. మరోవైపు పండుగ రద్దీని సొమ్ము చేసుకునేందుకు రైల్వేతో సహా, ఆర్టీసీ, ప్రైవేట్‌ ఆపరేటర్లు రంగంలోకి దిగారు. ప్రైవేట్‌ రైళ్లలో ప్రత్యేక చార్జీలను విధించారు. 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు పెంచగా, రాష్ట్రంలోని ప్రాంతాలకు నడిచే ప్రత్యేక బస్సుల్లో 10 నుంచి 20 శాతం వరకు చార్జీలను పెంచారు.

ఇక ప్రైవేట్‌ బస్సులు యథావిధిగా దారి దోపిడీ సాగిస్తున్నాయి. సాధారణ రోజుల్లో వసూలు చేసే చార్జీలను రెట్టింపు చేశాయి. సంక్రాంతి సందర్భంగా సుమారు 20 లక్షల మందికి పైగా తెలుగు రాష్ట్రాల్లోని సొంత ఊళ్లకు వెళ్లనున్నారు. పండుగ రద్దీ విమానాలను సైతం తాకింది. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఆర్టీసీ 3,500 రెగ్యులర్‌ బస్సులకు తోడు సుమారు 5,500 బస్సులను అదనంగా నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. విజయవాడ, విశాఖ, రాజమండ్రి, తిరుపతి తదితర దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో 50 శాతం, తెలంగాణలోని వివిధ జిల్లాలకు రాకపోకలు సాగించే బస్సుల్లో 10 నుంచి 20 శాతం అదనపు చార్జీలు విధించారు. ఇప్పటికే అన్ని రెగ్యులర్‌ బస్సుల్లో సీట్లు రిజర్వ్‌ అయినట్లు అధికారులు తెలిపారు. కాగా వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రైవేట్‌ బస్సుల్లో చార్జీలు రెట్టింపయ్యాయి.

ఒక్కో ట్రావెల్స్‌ సంస్థ ఒక్కో విధంగా చార్జీలు వసూలు చేస్తోంది. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి ఉండగా ప్రస్తుతం కొన్ని ట్రావెల్స్‌ 1,800, మరికొన్ని 2,090 వరకు వసూలు చేస్తున్నాయి. పలు రూట్లలో ప్రయాణికుల డిమాండ్‌ పెరగడంతో విమాన చార్జీలు సైతం పెరిగాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు  3,000 నుంచి 3,500 వరకు చార్జీ ఉండగా, తిరుపతికి 4,600 వరకు ఉంది. ఇక రాజమండ్రికి11,339 వరకు చార్జీలున్నాయి. ఏ రోజుకు ఆ రోజు డిమాండ్‌ మేరకు చార్జీల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాధారణంగా హైదరాబాద్‌ నుంచి ప్రతిరోజు సుమారు 40 వేల మంది వివిధ ప్రాంతాలకు బయలు దేరుతుండగా, పండుగ రద్దీ దృష్ట్యా ఈ సంఖ్య మరో 5 వేలకు పెరిగినట్లు అధికారులు తెలిపారు. 

కామెంట్‌లు