అయ్యప్ప భారీ విగ్రహం..త్వరలో నిర్మాణం
ప్రపంచంలోని అయ్యప్ప భక్తులకు శుభ సూచకం. వేలాది మంది అయ్యప్ప దీక్ష చేపట్టిన భక్త జన బాంధవులు నిత్యం పూజా కైంకర్యాలతో పాటు శాశ్వతంగా, వసతి సౌకర్యాలు ఉండే విధంగా ఆ భూతనాథ అయ్యప్ప అన్నదాన క్షేత్రం నిర్మించాలని అయ్యప్ప ఆలయ సమితి నిర్ణయించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 44 నంబర్ జాతీయ రహదారిపై ఉన్న కొత్తకోట మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసేందుకు అహోరాత్రులు శ్రమిస్తోంది. అయ్యప్ప స్వామిని నిత్యం కొలిచే వారే ఈ సమితిని ఎర్పాటు చేయడం జరిగింది. 2017 సంవత్సరంలో మహబూబ్ నగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో 184 పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఇందులో భాగంగా పూర్తి స్థాయిలో అయ్యప్ప స్వామి పేరుతో ఆలయాన్ని నిర్మించాలని ప్రతిజ్ఞ చేయడం..ఆ దిశగా స్వామి వారి ఆశీస్సులతో, దాతలు, అభిమానులు, భక్తులు, కులమతాలకు అతీతంగా తమ వంతు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు.
ఈ మేరకు పూర్తి స్థాయిలో అన్నదాన కోసం ఎందరినో భక్త బాంధవులను సంప్రదించడం జరిగింది. చాలా మంది తమకు తోచిన రీతిలో స్పందించారు. ఆర్ధిక, హార్థిక పరంగా చేయూతను అందించారు. గత కొన్నేళ్లుగా ఈ ఆధ్యాత్మిక క్షేత్రం తప్పనిసరిగా అయ్యప్ప స్వాములకు ఉండాలనే సత్ సంకల్పాన్ని స్వాములు తెలియ పరచడం జరిగింది. దీంతో ఆలయ నిర్మాణంతో పాటు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దాదాపు 108 అడుగులతో అతిపెద్ద భారీ అయ్యప్ప స్వామి వారి విగ్రహాన్ని నిర్మించాలని ఆలయ సమితి సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. ఆ స్వామి వారి కృప తో ఇప్పటికే ఎందరో మహానుభావులు, దాతలు, భక్తులు ముందుకు వచ్చారు. ఆశించిన స్థాయి కంటే ఎక్కువ మంది తాము సహాయం చేస్తామని ఆలయ కమిటీకి మాట కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే ఆలయ స్థలం కొనుగోలు కోసం కొత్తకోటకు చెందిన దాత గుంత ప్రకాష్ తో పాటు మరికొందరు దాతలు పెద్ద ఎత్తున సహాయం చేశారు.
పాలమూరు జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల వారు సైతం స్వామి వారి ఆలయ నిర్మాణం కోసం విరాళాల రూపేణా ఇవ్వాలని ముందుకు వస్తున్నారు. ఆలయంతో పాటు స్వాముల కోసం విడిది, పూజ గది, నిత్య అన్నదానం కోసం అన్నదాన క్షేత్రం తో పాటు అతిపెద్ద హాలు, వృద్దులు, అనాధల కోసం ప్రత్యేకించి వృద్ధ, అనాధ ఆశ్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. అంతే కాకుండా తెలంగాణ ప్రాంతంలోని 33 జిల్లాల నుంచి అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళుతూ ఇదే దారిలో ఉన్న కొత్తకోటలో సేద దీరడం గతకొన్నేళ్ళుగా కొనసాగుతూ వస్తున్నది. ఇదే ప్రాంతానికి చెందిన గోపాలకృష్ణ గురు స్వామి తో పాటు ధూపం నాగరాజు, పొగాకు అనిల్ కుమార్, గంగాధర్ లు బృందంగా ఏర్పడి ఇక్కడ అయ్యప్ప స్వాములకు సకల సౌకర్యాలు కలిగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాతల సహాయ సహకారాలతో గత ఆరేళ్లుగా పట్టణంలోని మార్కండేయ ఆలయంలో అన్నదానం చేపడుతోంది.
స్వాముల తాకిడి ఎక్కువ కావడంతో ప్రత్యేకంగా స్వంతంగా అయ్యప్ప దేవాలయం ఉండాలని సంకల్పించింది. ఇందు కోసం అర ఎకరం స్థలాన్ని కొత్తకోట పోలీస్ స్టేషన్ కు ఎదురుగా..రెండు రోడ్ల మధ్యన కొనుగోలు చేయడం జరిగింది. దీనికి భూతనాథ అయ్యప్ప అన్నదాన క్షేత్రంగా పెద్దలు నామకరణం చేయడం జరిగింది. గతేడాది డిసెంబర్ 6న ఎమ్మెల్యే ఆల వేంకటేశ్వర రెడ్డి గారు ఆలయ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణం భారీ ఖర్చుతో కూడుకుని ఉన్నది. కావున భక్త బాంధవులు, మనసున్న మారాజులు, దాతలు, ప్రతి ఒక్కరు ఈ సత్ సంకల్పంతో ఏర్పాటు చేయబోయే ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని అయ్యప్ప ఆలయ సమితి వేడుకుంటోంది. దయచేసి మీ వంతు సహాయ సహకారాలను అందజేస్తారని, ఈ బృహత్ యజ్ఞంలో పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి