సిటిజన్షిప్ బిల్లుపై ధిక్కార స్వరం


దేశమంతటా ఆందోళనలు కొనసాగుతున్నాయి. చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాన నగరాలు, పట్టణాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌ల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. జామియా మిలియా విశ్వవిద్యాలయం రణరంగంగా మారింది. పశ్చిమబెంగాల్‌లోని ముర్షీదాబాద్‌ జిల్లాలో ఉన్న బెల్డాంగ రైల్వే స్టేషన్‌ కాంప్లెక్స్‌ను ఆందోళనకారులు తగల బెట్టారు. అస్సాంలోని డిబ్రూగఢ్‌లో, మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌ల్లో కొద్దిసేపు కర్ఫ్యూ సడలించారు. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా కనిపిస్తోంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ పార్లమెంట్‌కు ర్యాలీగా వెళ్లాలనుకున్న జామియా మిలియా వర్సిటీ విద్యార్థులను పోలీసులు వర్సిటీ గేటు వద్దే అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పోలీసుల పైకి విద్యార్థులు రాళ్లు రువ్వడంతో, ప్రతిగా పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. టియర్‌ గ్యాస్‌ కూడా ప్రయోగించారని, రాళ్లు కూడా మొదట పోలీసులే రువ్వారని విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థులే బారికేడ్లను ధ్వంసం చేసి తమపైకి దూసుకువచ్చారని పోలీసులు వివరణ ఇచ్చారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు  గాయాలయ్యారు. దాదాపు 50 మంది విద్యార్థులను అరెస్ట్‌ చేశారు. ఆ ప్రాంత ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌  ఘటనాస్థలికి వెళ్లి విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. బెల్డాంగ రైల్వే స్టేషన్‌ కాంప్లెక్స్‌ను ఆందోళనకారులు తగల బెట్టారు. వేలాదిగా అక్కడికి వచ్చిన నిరసనకారులు రైల్వే కార్యాలయానికి, ఆర్‌పీఎఫ్‌ అవుట్‌పోస్ట్‌కు, ట్రాక్స్‌కు నిప్పంటించారు.

బెల్డాంగ పోలీస్‌ స్టేషన్‌ను ధ్వంసం చేశారు. రఘునాథ్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌లోని వాహనాలకు నిప్పంటించారు. బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో ఉండే ముర్షీదాబాద్‌ జిల్లాలో ముస్లిం జనాభా ఎక్కువ. అలాగే, ముస్లిం జనాభా అధికంగా ఉన్న గ్రామీణ హౌరా, బిర్భుమ్, బుర్ద్వాన్‌ల్లో కూడా నిరసన ప్రదర్శనలు జరిగాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌లో కూడా నిరసనలు కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు పరీక్షలను బహిష్కరించి, వీధుల్లో ప్రదర్శనలు నిర్వహించారు. ఈటానగర్‌లోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ నుంచి రాజ్‌భవన్‌ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ జరిపారు. 30 కి.మీల దూరం సాగిన ఈ ర్యాలీలో పాల్గొని, గవర్నర్‌ బీడీ మిశ్రాకు వినతిపత్రం ఇచ్చారు. అస్సాంలోని గువాహటిలో   నిత్యావసర సరుకుల కోసం ప్రజలు వేలాదిగా దుకాణాల ముందు బారులు తీరారు.

నగరంలోని అన్ని చోట్ల భద్రతా బలగాలు మోహరించాయి. పలు చోట్ల ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించాయి. ఆల్‌ అస్సాం స్టూడెంట్స్‌ యూనియన్‌  శాంతియుత ప్రదర్శన నిర్వహించింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో అమిత్‌ షా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. జపాన్‌ ప్రధాని షింజో ఆబే భారత పర్యటన రద్దయింది. పౌరసత్వ చట్టంపై ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న హింసాత్మక ఘటనల కారణంగా గువాహటిలో ప్రధాని మోదీతో జరగాల్సిన భేటీ రద్దయినట్లు తెలిపింది. పౌరసత్వ చట్ట సవరణ..తదనంతర పరిణామాలపై అమెరికా స్పందించింది.

రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి అల్పసంఖ్యాక మతాల వారి హక్కులకు రక్షణ కల్పించాలని భారత్‌ను కోరింది. పౌరసత్వ చట్ట సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు వేశారు. కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేశ్, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రాతోపాటు ఆల్‌ అస్సాం స్టూడెంట్స్‌ యూనియన్‌ , పీస్‌ పార్టీ, కొన్ని ఎన్జీవోలు, న్యాయవాది ఎంఎల్‌ శర్మ, కొందరు న్యాయ విద్యార్థులు కూడా పిటిషన్లు దాఖలు చేశారు.  

కామెంట్‌లు