టాప్ 100 లో మన విమెన్స్

ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ రూపొందించిన ఈ ఏడాది అగ్రశ్రేణి వంద అత్యంత శక్తి వంతమైన మహిళల్లో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చోటు దక్కించుకున్నారు. అంతర్జాతీయంగా శక్తివంతమైన 100 మంది మహిళల 2019 జాబితాను ఫోర్బ్స్‌ తాజాగా విడుదల చేసింది. ఇందులో మన దేశ ఆర్థిక మంత్రి 34వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. గతంలో భారత రక్షణ రంగానికి సారథ్యం వహించిన ఆమె.. ప్రస్తుతం మొత్తం భారత ఆర్థిక వ్యవస్థకు పూర్తి స్థాయి బాధ్యతలు వహిస్తున్నారు. దేశ తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్ణయాత్మక పాత్ర పోసిస్తున్నారు. కార్పొరేట్‌ పన్నుల తగ్గింపు వంటి వ్యూహాత్మక నిర్ణయాలతో సత్తా చాటుతోన్న నిర్మలా సీతారామన్‌ ప్రతిభకు నిదర్శనంగా.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చోటు దక్కింది.

ఇక మన దేశం నుంచి మరో ఇద్దరు మహిళలకు కూడా ఈ  జాబితాలో స్థానం దక్కింది. హెచ్‌సీఎల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఎగ్జిక్యూ టివ్‌ డైరెక్టర్, సీఈఓ రోష్ని నాడార్‌ మల్హోత్రా 54వ స్థానంలో నిలిచారు. బయోకాన్‌ చీఫ్‌  కిరణ్‌ మజుందార్‌ షా 65వ స్థానాన్ని దక్కించుకున్నారు. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బయోకాన్‌ చైర్మన్, ఎండీ కిరణ్‌ మజుందార్‌ షా బెంగళూరు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ చైర్‌ పర్సన్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె నికర సంపద 310 కోట్ల అమెరికా డాలర్లు. దేశంలోనే అతిపెద్ద బయో ఫార్మాసూటికల్‌ కంపెనీ ఏర్పాటు చేసి, సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఇక రోష్ని నాడార్‌ విషయానికొస్తే, ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురుణ్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ ప్రకారం,  భారత్‌లోనే అత్యంత మహిళా సంపన్నురాలు.

ఈ ఏడాది ఫోర్బ్స్‌ జాబితాలోనూ జర్మనీ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కల్‌ టాప్‌లో నిలిచారు. గత తొమ్మిదేళ్ళుగా అత్యంత శక్తివంతమైన మహిళగా తన స్థానాన్ని సుస్థిర పరుచుకుంటూనే ఉన్నారు. యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ క్రిస్టీనా లగార్డ్‌ రెండో ర్యాంకును సొంతం చేసుకున్నారు. ఇక అమెరికా ప్రతినిధుల సభకు స్పీకర్‌ నాన్సీ పెలోసీ మూడో స్థానంలో నిలిచారు. జాబితాలో యూరోపియన్‌ కమిషన్‌ ప్రెసిడెంట్‌ ఉర్సులా వాన్‌ డెర్‌ లేయన్‌ 4 వ ర్యాంకు పొందింది. ఇక జనరల్‌ మోటార్స్‌ సీఈఓ మేరీ బరా ఐదవ ప్లేస్ లో నిలిచారు. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా 29 స్థానంలో ఉండగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ మాత్రం 42 ప్లేస్ తో సరిపుచ్చుకున్నారు. కొత్తగా ఈ జాబితాలో చోటు దక్కించుకున్న 23 మందిలో పర్యావరణ పరిక్షణకోసం గళమెత్తిన స్వీడన్‌కు చెందిన 16 ఏళ్ల గ్రేటా థంబర్గ్‌ కూడా ఉన్నారు. ఆమె 100వ స్థానంలో నిలవడం విశేషం. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!