తప్పుడు నిర్ణయాలు..బలవుతున్న ఆటగాళ్లు

ప్రపంచంలో అత్యంత క్రేజ్ ఉన్న ఆటల్లో క్రికెట్ కూడా ఒకటి. బంతికీ బ్యాట్ కు మధ్య జరిగే పోరాటం నరాలు తెగిపోయేలా చేస్తుంది. టీ-20 , వన్డే మ్యాచుల్లో ఈ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. టార్గెట్ ను ఛేదించే క్రమంలో కొందరు విజేతలుగా నిలుస్తారు. మరికొందరు నిమిషాల్లో పాపులర్ అవుతారు. ఇదే సమయంలో జరిగే ప్రతి మ్యాచులో అంపైర్ డిసిషన్ కీలకంగా ఉంటుంది. దీంతో ఒక్కోసారి వీరు తీసుకునే నిర్ణయాలు క్రికెటర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గత కొంత కాలంగా క్రికెట్‌లో అంపైరింగ్‌ ప్రమాణాలు రోజురోజుకి దిగజారి పోతున్నాయి. పదే పదే తప్పుడు నిర్ణయాలతో అటు ఆటగాళ్లకు.. ఇటు అభిమానులకు విసుగు తెప్పిస్తున్నారు.
తాజాగా రంజీ ట్రోఫీలో భాగంగా ముంబైతో మ్యాచ్‌ సందర్భంగా బరోడా ఆల్‌రౌండర్‌ యూసుఫ్‌ పఠాన్‌ అంపైర్‌ తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు.

ముంబై నిర్దేశించిన 533 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బరోడా 169 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలుచుంది. ఈ క్రమంలో దీపక్‌ హుడాతో కలిసి పఠాన్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ 48 ఓవర్‌లో ముంబై స్పిన్నర్‌ శశాంక్‌ వేసిన బంతిని పఠాన్‌ డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే ఆ బంతి అనూహ్యంగా బౌన్స్‌ కావడంతో పఠాన్‌ ఛాతికి తగిలి షార్ట్‌ లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న జయ్‌ బిస్తా చేతుల్లో పడింది. దీంతో ముంబై ఫీల్డర్లు బ్యాట్‌కు తగిలిందనుకోని అప్పీల్‌ చేశారు. అయితే అంపైర్‌ కాసేపు సంకోచించి అనూహ్యంగా పఠాన్‌ అవుటని ప్రకటించాడు.

ముంబై క్రికెటర్లు సంబరాల్లో మునిగి తేలగా.. పఠాన్‌ షాక్‌కు గురయ్యాడు. అంతే కాకుండా క్రీజు వదిలి పోవడానికి నిరాకరించాడు. అంపైర్ల వైపు అసంతృప్తితో చూస్తూ ఉండి పోయాడు. ఈ క్రమంలో ముంబై కెప్టెన్‌ అజింక్యా రహానే పఠాన్‌ దగ్గరికి వచ్చి అది ఔటని సముదాయించే ప్రయత్నం చేశాడు. ఇక  చేసేదేమిలేక పఠాన్‌ భారంగా క్రీజు వదిలి వెళ్లాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్‌ చల్‌ చేస్తోంది. అంపైర్లపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ముంబైపై బరోడా 309 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లోనే ముంబై ఆటగాడు పృథ్వీ షా డబుల్‌ సెంచరీతో సాధించాడు.  

కామెంట్‌లు