అంకురాల్లో ఇండియా హవా
అంకుర సంస్థల ఏర్పాటు, ఉపాధి కల్పనలో భారత్ తన హవా కొనసాగిస్తోంది. ఈ మేరకు స్టార్టప్ వ్యవస్థకు సంబంధించి మన దేశం మూడో ప్లేస్ లో నిలిచింది. ఏకంగా ఈ ఏడాది కొత్తగా 1,100 స్టార్టప్స్ ఏర్పాటయ్యాయి. గడిచిన అయిదేళ్లలో టెక్నాలజీ అంకుర సంస్థల సంఖ్య దాదాపు 9,300 స్థాయికి చేరినట్లయిందని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ వెల్లడించింది. గతేడాది టెక్ స్టార్టప్‌ల సంఖ్య సుమారు 8,200 దాకా వుంటే ఈసారి కొద్దీ మేర పెరిగింది. ఇదే ఊపు కొనసాగితే 2014–2025 మధ్య కాలంలో భారత స్టార్టప్ వ్యవస్థ 10 రెట్లు వృద్ధి నమోదు చేయగలదని వెల్లడించింది.
ఇక 2025 నాటికి యూనికార్న్‌ల సంఖ్య దేశీయంగా 95 –105 శ్రేణిలో ఉండొచ్చని నాస్కామ్ అంచనా వేస్తోంది. 2014లో 10–20 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న స్టార్టప్ వ్యవస్థ వేల్యుయేషన్ 2025 నాటికి 350–390 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలదని, 10 లక్షల పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగగలదని పేర్కొంది. సంఖ్యా పరంగా అత్యధిక టెక్నాలజీ స్టార్టప్‌లతో బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ తర్వాత రెండో స్థానంలో ఉంది. కొత్తగా వస్తున్న టెక్ స్టార్టప్‌ల్లో 12–15 శాతం సంస్థలు వర్ధమాన నగరాల నుంచి ఉంటుండటం గమనార్హం.
స్టార్టప్స్‌లోకి గతేడాది 4.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా 4.4 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చాయి. గతేడాది 17గా ఉన్న యూనికార్న్‌ల సంఖ్య ఈసారి 24కి పెరిగితే ఈ ఏడాది ముగిసే లోగా మరో 2–3 కొత్తగా జత చేరే అవకాశం ఉంది. గతేడాది టెక్ స్టార్టప్‌లు ప్రత్యక్షంగా 40,000 ఉద్యోగాలు, పరోక్షంగా 1.6 లక్షల పైచిలుకు ఉద్యోగాలు కల్పించాయి. ఈ ఏడాది 60,000 ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పిస్తే, 1.8 లక్షల దాకా పరోక్ష ఉద్యోగాల కల్పన జరగడం విశేషం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి