అభిశంసనం..డోనాల్డ్ కు కష్ట కాలం


నిన్నటి దాకా ప్రపంచాన్ని గడగడ లాడించిన అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తన పదవిని కోల్పోయే పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌ను దిగువ సభ అభిశంసించింది. సెనేట్‌ లోనూ అభిశంసన ఆమోదం పొందితే అధ్యక్ష పదవి నుంచి ట్రంప్‌ దిగి పోవాల్సిందే. అమెరికాలోని డెమొక్రాట్లు మెజారిటీగా ఉన్న ప్రతినిధుల సభలో విశ్వాస పరీక్షలో ట్రంప్‌పై రెండు అంశాల ప్రాతిపదికగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. ట్రంప్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడన్న ఆరోపణ ఒకటైతే, కాంగ్రెస్‌ను అడ్డు కున్నారనేది రెండో ఆరోపణ. ట్రంప్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలకు అనుకూలంగా 230 ఓట్లు పడగా, వ్యతిరేకంగా 197 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్‌ను అడ్డకున్నారన్న ఆరోపణలకు అనుకూలంగా 229 ఓట్లు, వ్యతిరేకంగా 198 ఓట్లు వచ్చాయి.

తన ప్రత్యర్థి, డెమొక్రటిక్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలిచిన జో బిడెన్‌ మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టాలని ఉక్రెయిన్‌ను ఒత్తిడి చేసి, ఆ దేశాన్ని తనకు రాజకీయంగా సాయం చేయాలని ట్రంప్‌ కోరడం అధికార దుర్వినియోగమని అభియోగంలో పేర్కొన్నారు. ప్రతినిధుల సభ విచారణకు ట్రంప్‌ సహకరించ కుండా కాంగ్రెస్‌ను అడ్డుకున్నారన్నది రెండో అభియోగం. ప్రతినిధుల సభ ఆమోదం తర్వాత ట్రంప్‌ అభిశంసన తీర్మానం సెనేట్‌కు వెళుతుంది. అమెరికా అధ్యక్ష పదవిలో ట్రంప్‌ కొనసాగాలా, లేదా అన్నది సెనేట్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ప్రతినిధుల సభలో అభిశంసన పూర్తయినప్పటికీ సెనేట్‌లోనూ నెగ్గడం కీలకం. సెనేట్‌లోనూ అభిశంసన ఆమోదం పొందితే ట్రంప్‌ అధికారం నుంచి వైదొలగాలి.

అయితే అభిశంసన ఆమోదం పొందే అవకాశమే లేదు. సెనేట్‌లో ట్రంప్‌ సొంత పార్టీ అయిన రిపబ్లికన్లకు స్పష్టమైన మెజారిటీ ఉంది. అభిశంసన ఆమోదం పొందాలంటే అందుకు సెనేట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. అది జరిగే అవకాశమే లేదు. దీంతో ట్రంప్‌ అధికార పీఠాన్ని దిగక పోవచ్చు. అయినప్పటికీ అమెరికా రాజకీయ చరిత్రలో అభిశంసనను ఎదుర్కున్నారనే మరక మాత్రం ట్రంప్‌పై పడింది. అమెరికా చరిత్రలో అభిశంసనను ఎదుర్కొన్న అధ్యక్షుల్లో ట్రంప్‌ మూడోవ్యక్తి. గతంలో ఆండ్య్రూ జాన్సన్, బిల్‌క్లింటన్‌లకు ఈ చేదు అనుభవం ఎదురైంది. ప్రతినిధుల సభలో ఓటింగ్‌ జరుగుతున్నప్పుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌తో కలిసి మిచిగాన్‌లోని బాట్లే క్రీక్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!