పాకిస్తాన్ కు ఇండియా షాక్

ఆసియా ఓసియానియా గ్రూప్‌–1 డేవిస్‌ కప్‌ మ్యాచ్‌లో భారత్‌ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. పాకిస్తాన్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లోనూ భారత్‌ విజయం సాధించి తన స్కోరు 3-0కు పెంచుకుంది. పురుషుల డబుల్స్‌ విభాగంలో లియాండర్‌ పేస్‌, జీవన్‌ నెడుంజెళియన్‌ జోడీ 6-1, 6-3 అబ్దుల్‌ హుజైఫా రెహ్మాన్‌, షోయబ్‌ మొహమ్మద్‌ తేడాతో గెలిచింది. తొలి సెట్‌ను అవలీలగా గెలుచుకున్న భారత జోడికి రెండో సెట్‌లో కాస్త ప్రతిఘటన ఎదురైంది. స్కోరు 3-3తో ఉన్నప్పుడు నువ్వా నేనా అన్నట్లు సాగింది. కాగా, లియాండర్‌ పేస్‌ జంట​ అద్భుతమైన స్మాష్‌లను సంధించడంతో పైచేయి సాధించింది.

ఇదే ఊపును కొనసాగించడంతో ఆ సెట్‌ను 6-3 తేడాతో గెలుచు కోవడంతో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకుంది. కేవలం 53 నిమిషాల పాటు జరిగిన పోరులో భారత్‌ ఏకపక్ష విజయం నమోదు చేసింది. ఇక్కడ పాకిస్తాన్‌ టెన్నిస్‌ ఆటగాళ్ల అనుభవలేమి స్పష్టంగా కనబడింది. గతేడాది డేవిస్‌ కప్‌ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన డబుల్స్‌ ఆటగాడిగా రికార్డు సాధించిన లియాండర్‌ పేస్‌ తన రికార్డును మరింత పెంచుకున్నాడు. తాజా విజయంతో డబుల్స్‌ విభాగంలో 44వ గెలుపును అందుకున్నాడు. ఆ తర్వాత స్థానంలో ఇటాలియన్‌ ఆటగాడు నికోలా పీట్రెంజెలీ ఉన్నాడు. 57 డేవిస్‌ కప్‌ మ్యాచ్‌లకు గాను 44 విజయాలను పేస్‌ సాధించగా, నికోలా 66 మ్యాచ్‌ల్లో 42 విజయాలు నమోదు చేశాడు.

పేస్‌ 44 డబుల్స్‌ డేవిస్‌ కప్‌ రికార్డు సుదీర్ఘ కాలం చరిత్రలో నిలిచి పోయే అవకాశం ఉంది. ప్రస్తుతం టెన్నిస్‌ ఆడుతున్న డబుల్స్‌ ప్లేయర్లు ఎవరూ టాప్‌10లో లేరు. పాకిస్తాన్‌తో తటస్థ వేదికపై మొదలైన ఈ పోరులో భారత్‌ 2–0తో ఆధిక్యంతో దూసుకుపోయింది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ 176వ ర్యాంకర్, 25 ఏళ్ల రామ్‌కుమార్‌ రామనాథన్‌ 6–0, 6–0తో 17 ఏళ్ల షోయబ్‌ మొహమ్మద్‌పై గెలిచాడు. రెండో మ్యాచ్‌లో ప్రపంచ 131వ ర్యాంకర్, 22 ఏళ్ల సుమీత్‌ నాగల్‌ 6–0, 6–2తో 17 ఏళ్ల అబ్దుల్‌ హుజైఫా రెహ్మాన్‌పై గెలిచాడు. వచ్చే ఏడాది మార్చిలో జరిగే వరల్డ్‌ గ్రూప్‌ క్వాలిఫయర్స్‌తో క్రొయేషియా జట్టుతో పోరుకు మార్గం సుగుమం అయ్యింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!