చంపుతా..జైలుకు వెళతా


వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకను దారుణంగా హత్య చేసిన మృగాలను చంపేయాలంటూ ప్రజలు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తుంటే.. సోషల్ మీడియా ద్వారా ప్రముఖులు సైతం తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఈ ఘటనపై  సినీ నటి పూనమ్‌కౌర్‌ స్పందించారు. ఇలాంటి జంతువులను చంపడాని కైనా తాను సిద్ధమేనని అన్నారు. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన ఆ మృగాలకు జైలు శిక్ష అనుభవించడం కాదు, వాళ్లను చంపి నేను జైలుకు వెళతా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుల్లో ఒక వ్యక్తి మతం గురించి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మతమనేది సమస్య కానేకాదని స్పష్టం చేశారు. అడవుల్లో అయినా కాస్త మేలేమో, కానీ ఈ జనారణ్యంలోనే కొందరు మనుషులు అతి భయంకరంగా, జంతువుల కంటే ఘోరంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.

ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గాలు ఆలోచించాలి కానీ మత, రాజకీయ రంగులు పులిమి తప్పదోవ పట్టించొద్దని కోరారు. ఈ మేరకు ఆమె ఫేస్‌బుక్‌లో ఓ వీడియోని కూడా పోస్ట్‌ చేశారు. కాగా నిందితులను షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి చర్లపల్లి జైలుకు తరలించే క్రమంలో జనం ఆగ్రహంతో ఊగి పోయారు. వారిని తమకు అప్పగించాలంటూ నినాదాలు చేసుకుంటూ స్టేషన్‌లోకి వచ్చేందుకు యత్నించారు. ప్రియాంకా రెడ్డి హత్యను న్యాయవాదులు కూడా తీవ్రంగా ఖండించారు. నిందితులకు ఎటువంటి న్యాయ సహాయం అందించ కూడదని నిర్ణయించుకున్నారు. చర్లపల్లి జైలు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఎదురైన నిరసనలు, ఆందోళనలు చర్లపల్లి జైలు వద్ద కూడా కొనసాగుతున్నాయి. ప్రియాంకారెడ్డి హత్య కేసు నిందితులను తమకు అప్పగించాంటూ కొంత మంది యువకులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులతో యువకులు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వారిని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తన పోలీసులు రంగంలోకి దిగారు. కొంత మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో జైలు పరిసర ప్రాంత్తాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జైలు వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

నలుగురు నిందితులను హైసెక్యూరిటీ బ్లాక్‌లో ఉంచినట్లు సమాచారం. కాగా షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి కొంత సమయం​ క్రితమే నిందితులను చర్లపల్లికి తరలించిన విషయం తెలిసిందే. దీంతో జైలు వద్దకు ముందుగానే భారీగా ఆందోళనకారులు చేరుకున్నారు. నిందితులను తమకు అప్పగించాలని ధర్నాకు దిగారు. లేనిపక్షంలో వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చర్లపల్లి జైలు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాగా నిందితులకు 14 రోజుల రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!