తగ్గనున్న సిటీ బస్సులు..సిటీవాసులకు కష్టాలు

తెలంగాణ ప్రభుత్వం  సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. మెలమెల్లగా ఆర్టీసీని ప్రక్షాళన చేసే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు చేపట్టారు. హైదరాబాద్ లో పెద్ద ఎత్తున సిటీ బస్సులు తిరుగుతున్నాయి. ఎక్కువగా బస్సు పాసులు కలిగిన వారే అధికంగా ఉన్నారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం భాగ్యనగర వాసులపై తీవ్రంగా పడనుంది. ఆర్టీసీ నష్టాల్లో సగం సిటీ నుంచే వస్తుండటంతో సిటీ సర్వీసులను భారీగా తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఈ నష్టాలను జీహెచ్‌ఎంసీ నిధులతో భర్తీ చేయాలని భావించినా, తాజా సమ్మె సమయంలో అది సాధ్యం కాదని స్వయంగా సర్కారే తేల్చేసింది.

హైకోర్టుకు సమర్పించిన వివరాల్లోనూ దీన్ని స్పష్టం చేసింది. దీంతో నష్టాలను తగ్గించు కునేందుకు సిటీ సర్వీసులను కుదించాలన్న దిశగా అధికారులు అందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అయితే ఉన్నఫళంగా సర్వీసులు తగ్గించకున్నా, సిటీ రీజియన్‌లో పదవీ విమరణ చేసే సిబ్బంది స్థానంలో కొత్త వారిని ఇక నియమించరు. దీంతో  బస్సుల సంఖ్యను కూడా కుదించేందుకు మార్గం సుగమమవుతుంది. ప్రస్తుతం నగరంలో ఉన్న 3,500 బస్సుల సంఖ్య క్రమంగా తగ్గనుంది. హైదరాబాద్‌లో బస్సు పాస్‌లతోనే ఆర్టీసీకి పెద్ద సమస్య ఉత్పన్నమవుతోంది. ఇది ఆర్టీసీకి ఎక్కువ నష్టాలను పెంచుతోంది. పాస్‌ల రూపంలో రాయితీ ఇచ్చే మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి ఆర్టీసీకి రీయింబర్స్‌ చేయాల్సి ఉండగా, సకాలంలో ఆ నిధులు అందక ఆర్టీసీ కొట్టు మిట్టాడుతోంది.

హైదరాబాద్ లో 9.17 లక్షల విద్యార్థి పాస్‌లు ఉన్నాయి. వాటిలో నెలవారీ 130తో కొనే జనరల్‌ పాస్‌లు 2.76 లక్షలుండగా  390తో 3 నెలకు ఒకసారి కొనే పాసులు 6.41 లక్షలు దాకా ఉన్నాయి. సాధారణ ప్రయాణికుల పాసులు 17.56 లక్షలున్నాయి. ఇందులో 770తో కొనే జనరల్‌ పాసులు 3.29 లక్షలుంటే 880తో కొనే మెట్రో పాసులు 14.27 లక్షలున్నాయి. భారీగా పాసులు ఉండటంతో ఆర్టీసీ ఆదాయం పడి పోతోందనేది అధికారులు చెబుతున్న మాట. ఇక ఉద్యోగులు, విద్యార్థులు ఉదయం, సాయంత్రం వేళల్లో ఒకేసారి బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు.

దీంతో ఆ వేళల్లో రద్దీగా తిరుగుతున్న బస్సులు, ఆ తర్వాత కొంత ఖాళీగా ఉంటున్నాయి. ఈ బస్సుల్లో దాదాపు 8 వేల మంది కండక్టర్లు, డ్రైవర్లు పనిచేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది సీనియర్లే కావడంతో వారి వేతనాలూ ఎక్కువగా ఉంటున్నాయి. నగరంలో 30 శాతం ఇంటి అద్దె భత్యం ఉండటంతో ఆ రూపంలో భారం పడుతోంది. దీంతో సిటీ సర్వీసుల సంఖ్యను తగ్గించడమే పరిష్కారమని అధికారులు నిర్ణయానికి వచ్చారు. మొత్తం మీద సిటీ సర్వీసెస్ తగ్గిస్తే సిటీ వాసులకు కష్టాలు తప్పేలా లేదు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!