వెల్లువెత్తిన ప్రజాగ్రహం..నిరసన మధ్య తరలింపు


వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ అత్యాచార, హత్య కేసులో నలుగురు నిందితులకు ఉరి శిక్షే ఖరారు చేయాలని కోరుతూ ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులను షాద్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ ఎవరినీ స్టేషన్ దరిదాపుల్లోకి రాకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా వేలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా పోలీస్ ఠాణాకు తరలి వచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. పరిస్థితి అదుపు తప్పడంతో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను రంగంలోకి దించారు. డీజీపీ నుంచి కచ్చితమైన ఆదేశాలు ఉండడం, సమస్య సున్నితమైనది కావడంతో ఎలాంటి లాఠీ ఛార్జి చేయలేదు.

కొన్ని గంటల పాటు స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ను ముట్టడించేందుకు ప్రయత్నం చేశారు. మెజిస్ట్రేట్ నిందితులకు14 రోజుల పాటు రిమాండ్ విధించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య నిందితులను మహబూబ్ నగర్ జైలుకు తరలించేందుకు అష్టకష్టాలు పడ్డారు. అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రియాంకను దారుణంగా చంపిన నిందితులను తమకు అప్పగించాలని నినాదాలు చేశారు. మరికొందరు జైలుకు కాకుండా ఉరి తీయాలని కోరితే, ఇంకొందరు తమ మధ్యలో ఎన్ కౌంటర్ చేయాలన్నారు. మొత్తం మీద పరిస్థితి ప్రస్తుతం అదుపులోకి వచ్చేలా అగుపించడం లేదు.

ఈ సంఘటనపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు మిన్నంటాయి. సామాన్యుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకు ప్రతీ ఒక్కరూ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. నిందితులకు ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రియాంకా రెడ్డి హత్య కేసు నిందితులకు ఉరి శిక్ష పడేలా చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ప్రియాంక కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. బ్రిటీష్ కాలంలో రూపొందించిన చట్టాలను త్వరలోనే మార్పులు చేయబోతున్నట్టు చెప్పారు. బాధితులకు సత్వర న్యాయ పరిష్కారం లభించే విధంగా ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాల్లో మార్పులు తీసుకు రాబోతున్నామని వెల్లడించారు.

చాలా కేసుల్లో ట్రయల్ కోర్టులు విధించిన తీర్పులను హైకోర్టులో సవాల్ చేస్తున్నారని, ఇక నుంచి అలాంటి ప్రక్రియ లేకుండా చేస్తామని అన్నారు. మరో కోర్టులో సవాల్ చేసే అవకాశం లేకుండా, ఏకంగా సుప్రీంకోర్టులోనే తేల్చుకునేలా చట్టాలను మారుస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే ఈ అంశంపై లోక్‌సభలో కూడా ప్రస్తావిస్తానని పేర్కొన్నారు. మహిళల రక్షణ కోసం112 ప్రత్యేక యాప్‌లను రూపొందించామని, ప్రతీ మహిళా ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో మహిళకు రక్షణ లేకుండా పోయిందని కాంగ్రెస్‌ నేత గీతారెడ్డి వాపోయారు.   ప్రియాంక తల్లిదండ్రులను ఆమె పరామర్శించారు. ప్రియాంక హత్య అందరిని కలచి వేస్తుందన్నారు.

ప్రియాంక ఘటన మరవక ముందే మరో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందడం బాధాకరమన్నారు. 50 శాతం ఉన్న మహిళలకు ఎలాంటి భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ అక్రమ రవాణా కూడా పెద్ద ఎత్తున జరుగు తోందన్నారు. తమ కూతురు కనిపించడం లేదని ప్రియాంక తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించు కోలేదని, వారితో కూడా సరిగా మాట్లాడలేదని గీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రియాంక రెడ్డి హత్య కేసు తర్వాత తెలంగాణలో ఆడ పిల్లల తల్లిదండ్రులు భయపడి పోతున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు.

మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయని విమర్శించారు. ఇటువంటి ఘటనలు మరోసారి జరగకుండా ఐపీఎస్ అధికారితో వెంటనే ఒక కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మహిళల భద్రత పట్ల డీకే అరుణ ఆందోళన వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ కాదు. భద్రత తెలంగాణ కావాలని కోరారు. మంత్రులకు భారీ భద్రత పెట్టుకున్న వారు మహిళలకు భద్రత కల్పించలేరా అంటూ ప్రశ్నించారు. పోలీస్‌ వ్యవస్థను, ఇంటెలిజెన్స్‌ను ముఖ్యమంత్రి స్వంతానికి వాడు కుంటున్నారని ఆరోపించారు.  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!