రాజ్యం గవర్నర్ల భోజ్యం


రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవర్నర్లు ఇప్పడు కింగ్ మేకర్లుగా అవతారం ఎత్తారు. దేశంలో ఆయా రాష్ట్రాల్లో అన్ని కార్యకలాపాలు వీరి ఆధ్వర్యంలోనే నడుస్తాయి. ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ అంతా గవర్నర్ ద్వారానే నడుస్తుంది. విశిష్టమైన అధికారాలు ఉన్నప్పటికీ, కేంద్రంలో కొలువు తీరిన ప్రభుత్వం కనుసన్నలలోనే నడవాల్సి ఉంటుంది. దీంతో వీరు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. తాజాగా బీజేపీ పవర్ లోకి వచ్చాక అనైతిక నిర్ణయాలు తీసుకుంటూ, ప్రజాస్వామ్యానికి చేటు తెస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఎలాంటి మెజారిటీ లేకపోయినా మైనార్టీ సంఖ్యా బలం కలిగిన బీజేపీకి సర్కార్ ఏర్పాటుకు సహకరించారు అక్కడి గవర్నర్.

దీనిని సవాలు చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల అధినేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఇలాంటి సంఘటనలు సమున్నత భారతావనిలో చాలానే జరిగాయి. తమిళనాడు, ఉమ్మడి ఏపీ, కర్ణాటక, తదితర రాష్ట్రాలు ఇందుకేమీ మినహాయింపు కాదు. ప్రభుత్వ ఏర్పాటులో, కీలక చట్టాలు అమలు చేయడంలో గవర్నర్లే కీలక భూమిక పోషిస్తారు. వీరు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడం అసాధ్యం. ఇక్కడే బాబా సాహెబ్ చాలా తెలివిగా రాజ్యాంగాన్ని రాశారు. ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా కొలువుతీరే ప్రజాప్రతినిధులకు ఉంటాయి. దీనిని ఆసరాగా చేసుకుని పవర్ ను దుర్వినియోగం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

వీటిని కంట్రోల్ చేసేందుకే గవర్నర్ల వ్యవస్థను తీసుకు వచ్చారు. ఇదిలా ఉండగా దేశంలో గత మూడేళ్లలో అయిదు రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటులో గవర్నర్లు పోషించిన పాత్ర వివాదాస్పదం అయింది. ఈ రాష్ట్రాల్లో గవర్నర్లు బీజేపీ కోసం గేమ్‌ చేంజర్‌లుగా మారారు. గోవాలో 2017 ఎన్నికల్లో అసెంబ్లీలోని 40 స్థానాలకు 18 సీట్లు గెలుచుకుని కాంగ్రెస్‌ పెద్ద పార్టీగా అవతరించింది. కానీ, గవర్నరు మృదులా సిన్హా ప్రభుత్వం ఏర్పాటులో బీజేపీకే అవకాశమిచ్చారు. ఈ విషయంపై కాంగ్రెస్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. గవర్నర్‌ పాత్రపై అనేక అనుమానాలు వ్యక్త మయ్యాయి. దీంతోపాటు, 60 స్థానాలున్న మణిపూర్‌ అసెంబ్లీలో 28 సీట్లను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. బీజేపీ 21 చోట్ల మాత్రమే విజయం సాధించింది.

అయినప్పటికీ, గవర్నర్‌ కాంగ్రెస్‌ను కాదని, బీజేపీకి చాన్సివ్వడంతో కమలదళం ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. కర్ణాటకలో 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం గవర్నర్‌ వజూభాయ్‌ వాలా అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ ఆహ్వానించారు. అయితే, బలపరీక్షలో బీజేపీ ఓడి పోయింది. సీఎం యడియూరప్ప రాజీనామా చేయడంతో కాంగ్రెస్‌, జేడీఎస్‌ కూటమి అధికారంలోకి వచ్చింది. అనంతర పరిణామాల్లో అధికార కూటమిలోని 17 మంది ఎమ్మెల్యేలు ప్లేటు ఫిరాయించారు. ఆపై మళ్లీ యడియూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు.

ఈ వ్యవహారంలో కాంగ్రెస్‌, జేడీఎస్‌ వాదనలను గవర్నర్‌ వినిపించుకోలేదన్న ఆరోపణలున్నాయి. మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 60 సీట్లకు గాను 21 స్థానాలతో కాంగ్రెస్‌ పెద్ద పార్టీగా అవతరించింది. గవర్నర్‌ మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీని, దాని మిత్రపక్షం 19 సభ్యులున్న ఎన్‌పీపీని ఆహ్వానించడం వివాదాస్పదమైంది. తాజగా మహారాష్ట్రలో గవర్నర్ వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉంది. ఇది ప్రమాదకరమైన సంకేతాన్ని సూచిస్తోంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!