అనిల్ అంబానీ రాజీనామా వాపస్

భారతీయ వ్యాపార, ఆర్ధిక రంగాలపై తీవ్ర ప్రభావితం చూపే రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఓ వైపు లాభాలు ఆర్జిస్తుండగా, మరికొన్ని కంపెనీలు దివాళా అంచున నిలబడ్డాయి. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ప్రతి రంగంలోకి ఎంటర్ అయ్యేలా రిలయన్స్ ను తీర్చి దిద్దాడు ధీరూభాయ్ అంబానీ. ఓ పెట్రల్ బంకులో సాధారణ ఉద్యోగిగా పనిచేసిన అంబానీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో చోటు సంపాదించేలా కంపెనీని తీర్చి దిద్దాడు. ఇదెలా సాధ్యమైందంటే ఎలా చెప్పగలం. ఇండియన్ మార్కెట్ ను రిలయన్స్ శాసిస్తోంది. తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇదిలా ఉండగా ధీరూభాయ్ అంబానీ మృతి చెందాక, అన్నదమ్ములు ఇద్దరు ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ విడి పోయారు.

ఒకానొక దశలో ఒకరిపై మరొకరు కేసులు వేసుకున్నారు. చివరకు ఒక్కటయ్యారు. ఇదంతా తమను నమ్ముకుని పెట్టుబడులు పెట్టిన ప్రజలు, వినియోగదారులు, వ్యాపారులను బురిడీ కొట్టించేందుకే ఇది ప్లాన్ చేశారన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. తాజాగా ఇండియన్ టెలికం సెక్టార్ లో ఒక ఊపు ఊపుతోంది రిలయన్స్ కంపెనీ. దీనిని అడ్డం  పెట్టుకుని ఆయిల్, దుస్తులు, జవెలరీ, ఫ్యాషన్, షూస్, ట్రెండ్స్, ఇలా ప్రతి ఒక్క రంగానికి విస్తరించింది. తాజాగా ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతోంది. అక్కడ వ్యాపార పరంగా ఆదాయం కలిగిన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తోంది రిలయన్స్. అయితే ఇద్దరు అన్నదమ్ముల్లో అన్న ముకేశ్ అంబానీ గొప్ప బిజినెస్ మెన్ గా పేరు సంపాదిస్తే , తమ్ముడు అనిల్ అంబానీ మాత్రం అపజయాన్ని మూటగట్టుకుని దివాళా అంచున నిలబడ్డాడు. అయితే ఇటీవల ముంబయిలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ముకేశ్ అంబానీ తమ్ముడికి భరోసా ఇచ్చాడు.

ఆస్తులను అమ్మి మొత్తం నష్టాలను చెల్లిస్తామని చెప్పారు. దీంతో ఎన్నడూ లేని రీతిలో రిలయన్స్ షేర్స్ అమాంతం పెరిగాయి. మదుపరులకు లాభాన్ని తెచ్చి పెట్టాయి. తాజాగా రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ డైరక్టర్స్‌ పదవికి అనిల్‌ అంబానీ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయనతో పాటు ఛాయా విరానీ, రైనా కరానీ, మంజరి కక్కర్, సురేశ్‌ రంగాచార్‌లు కూడా తమ పదవులకు రిజైన్ ఇచ్చేశారు. అయితే వీరి రాజీనామాలను రుణ సంస్థల కమిటీ పక్కన పెట్టినట్లు ఆర్‌కామ్‌ తెలిపింది. సీవోసీ కమిటీ అంబానీతో పాటు మిగతా వారి రాజీనామాలను తిరస్కరించింది. రాజీనామా చేసిన వారందరూ ఆర్‌కామ్‌లో యధావిధిగా తమ విధుల్లో కొనసాగవచ్చని తెలిపింది. దివాల ప్రక్రియలో ఉన్న కంపెనీకి పరిష్కార మార్గం చూపించాలని ఆర్‌కామ్‌ బీఎస్‌ఈ ఫైలింగ్‌లో పేర్కొంది.

కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి లైసెన్సు ఫీజులు, స్పెక్ర్టం బకాయిలకు కేటాయింపుల అనంతరం రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ నష్టాలు 30,142 కోట్లకు చేరిన క్రమంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. టెలికాం కంపెనీలు వరుసగా భారీ నష్టాలను ప్రకటిస్తుండటం గుబులు రేపుతోంది. ఇక లైసెన్స్‌ ఫీజు, స్పెక్ట్రం బకాయిలకు కేటాయింపుల అనంతరం వొడాఫోన్‌ జులై, సెప్టెంబర్‌ కాలానికి 50,921 కోట్ల నష్టాలు ప్రకటించగా, భారతి ఎయిర్‌టెల్‌ 23,000 కోట్ల నష్టాలను నమోదు చేసింది. మొత్తం మీద దొడ్డి దారిన తప్పుకుందామనుకున్న అనిల్ అంబానీకి షాక్ తగిలింది.

కామెంట్‌లు