తారల సందోహం..మెగా సంతోషం


మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో అలనాటి తారలు సందడి చేశారు. 1980 సంవత్సరం కాలంలో నటించిన నటులంతా  ప్రతి ఏడాది ఒక రోజు కలుసు కోవడం, అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా నటి రేఖను కూడా ఆహ్వానించానని ఇటీవల జరిగిన ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ ఫంక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. ఈ వేడుకలు రెండు రోజుల పాటు మెగాస్టార్ ఇంట జరిగాయి. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సినీ తారలు అంతా చిరంజీవి ఏర్పాటుచేసిన రీయూనియన్ ఫంక్షన్‌లో పాల్గొన్నారు.

అప్పటి తారలు ఏటా ఏదో ఒక చోట కలిసి సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈసారి ఈ వేడుకలకు మెగాస్టార్‌ చిరంజీవి ఇల్లు వేదికైంది. ఈ వేడుకల్లో 80ల నాటి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ నటులు ఒక చోట కలిసి సందడి చేశారు. ఇప్పటికే సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వైరల్‌గా మారాయి. అయితే, రీ యూనియన్‌లో పాల్గొన్న సినీ తారలంతా కలిసి తీసుకున్న ఫొటో తాజాగా బయటి కొచ్చింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ ఫొటోలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి మోహన్‌లాల్ కనిపించారు. నా అమేజింగ్ ఫ్రెండ్ చిరంజీవితో నేను అని ట్వీట్‌లో మోహన్ లాల్ పేర్కొన్నారు. ఈ ఫొటోలో చిరంజీవి కుర్చీలో కూర్చొని ఉండగా మోహన్‌ లాల్ ఆయన్ని వెనుక నుంచి ఆప్యాయంగా భుజాలపై నుంచి రెండు చేతులు వేసి పట్టుకున్నారు. మొత్తం మీద చిరంజీవి ఇల్లు గొప్ప, ప్రతిభావంతమైన నటీనటులతో కొలువు దీరడం అభిమానులకు సంతోషం కలిగించింది. 

కామెంట్‌లు