స్థిరంగా ఈక్విటీ మార్కెట్స్
గత ఏడాది కాలం నుండి తీవ్ర ఒడిదుడుకులకు లోనైన ఈక్విటీ మార్కెట్లు ఇప్పుడు కళకళ లాడుతున్నాయి. ప్రధాన సెన్సెక్స్, నిఫ్టీ నూతన గరిష్టాలకు చేరువయ్యాయి. స్టాక్స్ పని తీరులో ఎంతో వైవిధ్యం కనిపిస్తోంది. ఎంపిక చేసిన స్టాక్స్ మాత్రమే ర్యాలీ చేస్తున్నాయి. కొన్ని లార్జ్‌క్యాప్ స్టాక్స్ మంచి పనితీరు చూపిస్తుండగా, అధిక శాతం లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ వెనుకబడే ఉంటున్నాయి. మార్కెట్ ర్యాలీ చాలా సంకుచితంగా ఉంటోంది. దీంతో భిన్న మార్కెట్ క్యాప్ విభాగాల్లో పెట్టుబడుల పరంగా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భిన్న విభాగాల్లో ఎంపిక చేసిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే మల్టీక్యాప్ ఆధారిత ఫోకస్డ్ ఫండ్స్‌ను ఎంచు కోవడం మంచి నిర్ణయమే అవుతుంది.
ఈ విభాగంలో యాక్సిస్ ఫోకస్డ్–25 మ్యూచువల్ ఫండ్ పథకం మంచి పనితీరుతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఈ పథకం గడిచిన ఏడాది కాలంలో 20 శాతం రాబడులను ఇచ్చింది. కానీ, ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా చూసే నిఫ్టీ 50 టీఆర్‌ఐ పెరుగుదల 13.8 శాతంగానే ఉంది. మూడేళ్ల కాలంలో 17.5 శాతం, ఐదేళ్ల కాలంలో 12.9 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకం సొంతం. ఇదే కాలంలో నిఫ్టీ 50 టీఆర్‌ఐ వృద్ధి 14.2 శాతం, 8.6 శాతంగానే ఉంది. అంటే బెంచ్ మార్క్ పనితీరు కంటే ఎంతో ఉత్తమ రాబడుల చరిత్ర ఈ పథకంలో కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఈ పథకం 2012లో ఆరంభం కాగా, నాటి నుంచి నేటి వరకు వార్షిక రాబడులు సగటున 16 శాతం పైనే ఉండటం మెరుగైన పనితీరుకు నిదర్శనంగా చెప్పుకోవాలి.
ఫోకస్డ్ ఫండ్స్ విభాగంలోనూ అత్యుత్తమ పనితీరు చూపిస్తున్న పథకాల్లోనూ యాక్సిస్ ఫోకస్డ్ 25 అగ్ర పథాన ఉంది. సెబీ నిబంధనల ప్రకారం ఫోకస్డ్ ఫండ్స్ గరిష్టంగా 30 స్టాక్స్ వరకు పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉండొచ్చు. ఈ పథకం మాత్రం 25 స్టాక్స్‌నే పరిమితిగా పెట్టుకుంది. అది కూడా లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ నుంచి వీటిని ఎంపిక చేసుకుంటుంది. ప్రస్తుతం పోర్ట్‌ఫోలియోలో 24 స్టాక్స్ మాత్రమే ఉన్నాయి. ఇందులో టాప్ 10 స్టాక్స్‌లోనే మొత్తం పెట్టుబడుల్లో 64.5 శాతం వరకు ఇన్వెస్ట్ చేసి ఉంది. బోటమ్‌అప్ విధానాన్ని స్టాక్స్ ఎంపికకు పాటిస్తుంది. స్థిరమైన, అధిక నాణ్యతతో కూడిన వ్యాపారాల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది.
పెట్టుబడుల్లో సగం మేర తక్కువ అస్థిరతలు కలిగిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిస్క్ తగ్గించుకునే వ్యూహాన్ని అనుసరిస్తుంది. మార్కెట్ పరిస్థితులు, స్టాక్స్ వ్యాల్యూషన్లను గమనిస్తూ, రిస్క్ ఎక్కువగా ఉన్న విభాగం నుంచి తక్కువగా ఉండే విభాగానికి పెట్టుబడులను మళ్లించే వ్యూహాలను పాటిస్తుంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ స్టాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, పెట్టుబడుల్లో 42.5 శాతం మేర వీటిల్లోనే ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత కెమికల్స్, సేవల రంగంలోని కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి