తెలంగాణం పూలవనం..వెల్లివిరిసిన మహిళా చైతన్యం

తొమ్మిది రోజుల పాటు సాగిన బతుకమ్మ ఉత్సవం సద్దుల బతుకమ్మతో ముగిసింది. తెలంగాణ మొత్తం పూలవనంలా మారి పోయింది. లక్షలాది మంది మహిళలు బతుకమ్మలతో ఈ పండుగలో పాల్గొన్నారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై సంబురాలు అంబరాన్నంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు నభూతో నభవిష్యత్తు అన్న రీతిలో సాగాయి. భారీగా నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నా లెక్క చేయకుండా మహిళలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, వృద్దులు సద్దుల బతుకమ్మలో పాల్గొన్నారు. ఎక్కడ చూసినా పూలతో నిండి పోయాయి. కొన్ని రోజుల పాటు అద్వితీయమైన రీతిలో పండుగను చేసుకున్నారు. పల్లెలు, పట్టణాలు, నగరాలలో అంతటా బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. పోయి రావమ్మా... పోయిరా... వచ్చే సారి మళ్లీ రావమ్మా అంటూ మహిళలు పాటలు పాడుతూ బతుకమ్మను సాగ నంపారు. ఆనందోత్సవాలు, భక్తిశ్రద్ధలతో పూజించిన గౌరమ్మను గంగమ్మ ఒడికి చేర్చారు.

అమావాస్యతో ప్రారంభమై  వైభవంగా సాగిన పండుగలో చివరి రోజు రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. వర్షం పలుసార్లు ఆటంకం కల్పించినా మహిళలు తరగని ఉత్సాహంతో వేడుకల్లో పాల్గొనడం విశేషం. జంటనగరాలు, రాష్ట్రం నలు మూలల నుంచి తరలి వచ్చిన దాదాపు  వేల మంది మహిళలు ఉదయం నుంచే ఎల్బీ స్టేడియానికి చేరుకుని తీరొక్క పూలతో బతుకమ్మలను సిద్ధం చేశారు. అవసరమైన పూలను, ఇతర వస్తువులను రాష్ట్ర ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ సమకూర్చింది. ఇక్కడ రూపొందించిన 30 అడుగుల బతుకమ్మ శకటాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సతీమణి శోభ జెండా ఊపి ప్రారంభించారు. అంతకు ముందు ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి బతుకమ్మలను మహిళల నెత్తిన ఎత్తిపెట్టారు. రాష్ట్ర ఆబ్కారీ, సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌  పర్యవేక్షణలో ‘సద్దుల బతుకమ్మ’ సాగింది.

జానపద కళాకారుల హుషారైన ఆట పాటల నడుమ ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు కన్నులపండువగా సాగింది. ఎటు చూసిన పూలజాతర కనిపించింది. ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన ఉత్సవాలలో సీఎం సతీమణి శోభ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. పరిసరాలన్నీ బతుకమ్మ పాటలతో మార్మోగాయి. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్‌అలీ పాల్గొన్నారు. కోలాటాలు, ఆటలు, పాటలు రాత్రి పొద్దు పోయే వరకు సాగాయి. డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాలు, చిందు, ఒగ్గు కళాకారులు, కొమ్ము, కోయ, లంబాడా, గుస్సాడి, పోతురాజులు ఇతర కళాకారులు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం హుస్సేన్‌సాగర్‌లోని ఘాట్‌ వద్ద బతుకమ్మలను నిమజ్జనం చేశారు. తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో బహ్రెయిన్‌లో, తెలంగాణ అభివృద్ధి వేదిక నేతృత్వంలో కెనడాలోలోని టొరంటోలో సద్దుల బతుకమ్మ ఉత్సవాలు జరిగాయి. తెలంగాణ ఎన్నారైల ఫోరం ఆధ్వర్యంలో లండన్‌లో బతుకమ్మ, దసరా సంబురాలు నేత్రపర్వంగా జరిగాయి.  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!