సఫారీలపై ఇండియా సవారి

టీమిండియా సౌత్ ఆఫ్రికాపై మొదటి టెస్ట్ లో ఘన విజయం సాధించింది. వైజాగ్ లో జరిగిన మ్యాచ్ లో అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను మన ఆటగాళ్లు అద్భుత ప్రతిభ కనబరిచారు. రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా కుప్ప కూలింది. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ లో భారత్ చిరస్మరణీయమైన గెలుపు సాధించింది. ప్రపంచ కప్పులో ఘోరంగా వైఫల్యం చెందిన టీమిండియా వెస్ట్ ఇండీస్ టూర్ లో దుమ్ము రేపింది. స్వదేశం లో సఫారీలతో అన్ని ఫార్మాట్ లలో రాణిస్తోంది. ఏడాది తర్వాత ఇండియాలో టెస్ట్ మ్యాచ్ జరిగింది. వర్షం అడ్డంకి ఏర్పడినా ఎట్టకేలకు గెలుపు ఇండియా వశమైంది. 395 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా జట్టు 191 పరుగులకే చేతులెత్తేసింది. 204 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

ఓవర్ నైట్ స్కోర్ ఒక వికెట్ కోల్పోయి 11 పరుగులు చేసి మైదానంలోకి దిగిన సఫారీలు టీమిండియా బౌలర్లను ఎదుర్కోలేక పోయారు. మ్యాచ్ స్టార్ట్ అయిన రెండవ ఓవర్ లోనే దిబ్రుయిన్ ను అశ్విన్ అవుట్ చేశాడు. తర్వాతి ఓవర్ లో మహమ్మద్ షమీ బావుమాను పెవిలియన్ కు పంపించాడు. డుప్లెసిస్, డికాక్ లను కూడా షమీ అద్భుతమైన బంతులతో అవుట్ చేయడంతో సౌత్ ఆఫ్రికా జట్టు కష్టాల్లో పడింది. కేవలం 60 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. మరోసారి మైదానంలో రెండో స్పెల్ లో బౌలింగ్ చేసిన జడేజా ఫిలాండర్, కేశవ్, మార్ క్రామ్ లను అవుట్ చేశాడు. గెలుపు లాంఛనమే అనుకున్న టీమిండియా సారథికి చుక్కలు చూపించారు సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు.

ముత్తుస్వామి , డెన్ పిట్ లు. ఇండియన్ బౌలర్ల ధాటిని అడ్డుకున్నారు. దీంతో విజయం కోసం మరికొంత సేపు ఆగాల్సి వచ్చింది. ఈ ఇద్దరు ఆటగాళ్లు అడ్డుగోడగా నిలిచారు. ఇద్దరు కలిసి 91 పరుగులు చేశారు. 60 వ ఓవర్ లో తిరిగి బౌలింగ్ కు వచ్చిన షమీ పీట్ ను బౌల్డ్ చేయడంతో వీరిద్దరి భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. మైదానంలోకి వచ్చిన రబడా మెరుపులు మెరిపించాడు. ఈ ఆటగాడి జోరుకు మరోసారి అడ్డుకట్ట వేశాడు షమీ. ఇతడి బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. పది ఓవర్లలో కేవలం 35 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. మ్యాచ్ లో రెండు సెంచరీలు చేసిన రోహిత్ శర్మ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

కామెంట్‌లు