ఐపీవో వైపు స్టార్టప్‌ల చూపు..!

ఇండియాలో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో కొలువు తీరాక అంకుర సంస్థలకు ఎక్కడలేని ఊపు వచ్చింది. కొత్త ఐడియాలతో సరికొత్త ట్రెండ్స్ తో  స్టార్టప్‌ సంస్థలు వేలాదిగా ఏర్పాటు అయ్యాయి. భారత దేశంలో మొదటి సారిగా టెలికాం రంగానికి ఆద్యుడు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ. ఆయన హయాం లోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూపు దిద్దుకున్నది. మోడీ ఎప్పుడైతే పగ్గాలు చేపట్టారో సోషల్, డిజిటల్ మీడియా రంగాలకు ఎక్కడలేని ప్రాధాన్యతను కల్పించారు. దీంతో దేశ వ్యాప్తంగా  స్టార్టప్‌ లు లెక్కలేనన్ని పుట్టుకు వచ్చాయి. ఇందులో ఎక్కువ శాతం సక్సెస్ కాలేక పోయినప్పటికినీ, ఓ 30 శాతం సక్సెస్ బాటలో నడుస్తున్నాయి. అందులో మొదటగా చెప్పు కోవాల్సింది రితీష్ అగార్వల్ స్థాపించిన ఓయో స్టార్టప్‌ . ఒక మామూలు గదిలో ప్రారంభమైన ఈ  స్టార్టప్‌ ఇప్పుడు కంపెనీగా ఎదిగి ప్రపంచాన్ని ఏలుతోంది.

హాస్పిటాలిటీ రంగంలో బడా హోటల్స్ యాజమాన్యాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అలాగే జొమాటో, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్, స్విగ్గి, ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది అంకురాలు దుమ్ము రేపుతున్నాయి. కేంద్ర సర్కార్ మాత్రం  స్టార్టప్‌ లను ప్రోత్సహించేందుకు ఏకంగా ప్రత్యేకంగా స్టార్టప్‌ ఫండ్ ను ఏర్పాటు చేసింది. దీంతో ప్రభుత్వ పరిధిలోని అన్ని బ్యాంకులు, ఇతర సంస్థలు తప్పనిసరిగా అంకురాలకు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. తాజాగా శుభ పరిణామం ఏమిటంటే అన్ని  స్టార్టప్‌లు ఇప్పుడు ఐపీవో లోకి ఎంటర్ అయ్యేందుకు రెడీ అంటున్నాయి. దాదాపు 200 అంకుర సంస్థలు వెయ్యి కోట్లు సమీకరించాలని టార్గెట్ గా పెట్టుకున్నాయి. ఇందులోకి వస్తున్న మొదటి స్టార్టప్‌ ‘ఆల్ఫాలాజిక్‌ టెక్‌సైస్‌’. ఇవ్వన్నీ ఇండియాలోనివే కావడం గమనార్హం. బెంగళూరు, పుణె, ముంబై, హైదరాబాద్‌ తదితర నగరాలకు చెందిన స్టార్టప్‌లు ఐపీఓకి ముస్తాబయ్యాయి.

అన్ని అనుమతులతో పుణెకు చెందిన టెక్నాలజీ కన్సల్టింగ్‌ సర్వీసెస్‌ అండ్‌ సపోర్ట్‌ సంస్థ  ఇష్యూకు వచ్చింది. ముంబైకి చెందిన వైద్య పరికరాల తయారీ సంస్థ ట్రాన్స్‌పాక్ట్‌ ఎంటర్‌ప్రైసెస్‌ లిమిటెడ్‌ ఐపీఓకు కూడా అనుమతి వచ్చింది. ఒక్కో స్టార్టప్స్‌ తొలి దశలో 5 కోట్ల నిధులను సమీకరించనున్నాయి. లిస్టింగ్‌కు దరఖాస్తు చేసిన స్టార్టప్స్‌ కార్యకలాపాలు, లావాదేవీలు, మేనేజ్‌మెంట్‌ ఇతరత్రా అంశాలను పరిశీలించిన తర్వాత ఐపీఓకి అనుమతి వస్తుంది. ఇందు కోసం దాదాపు 3 నెలల సమయం పడుతుంది. ఇక పోతే దేశీయ అంకుర పరిశ్రమలో ఐపీవో అనేది కొత్త ట్రెండ్ గా భావించాలి. కార్యకలాపాల విస్తరణకు నిధులు కావాలంటే ఇప్పటిదాకా వెంచర్‌ క్యాపలిస్ట్‌, సంస్థాగత పెట్టుబడిదారుల వైపు చూడాల్సి వస్తోంది.

దీంతో స్టార్టప్‌లలో మెజారిటీ వాటా వారి చేతుల్లోకి వెళ్లటం, వారి నియంత్రణలో కార్యకలాపాలు సాగించాల్సి రావటం జరుగుతోంది. బీఎస్‌ఈ లిస్టింగ్‌తో ఈ ఇబ్బందులు తప్పుతాయని స్టార్టప్‌ వర్గాలు చెబుతున్నాయి. ఐటీ, ఐటీఈఎస్, ఆర్టిఫిషల్‌ ఇంటెలిజెన్స్‌ , బిగ్‌ డేటా, ఈ–కామర్స్, వర్చువల్‌ రియాలిటీ ,బయో టెక్నాలజీ అండ్‌ లైఫ్‌ సైన్సెస్, త్రీడీ ప్రింటింగ్, స్పేస్‌ టెక్నాలజీ, హైటెక్‌ డిఫెన్స్, నానో టెక్నాలజీ వంటి విభాగాల్లోని స్టార్టప్స్‌కు లిస్టయ్యే అవకాశముంది. మొత్తం మీద ఇదో బిగ్ చేంజ్ గా భావించాలి. ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న  స్టార్టప్‌లకు ప్రభుత్వ పరంగా మరిన్ని రాయితీలు కల్పిస్తే ఎంతో మందికి ఉపాధి దక్కే అవకాశాలు లేక పోలేదు. ఆ దిశగా ఆర్ధిక మంత్రి ఆలోచిస్తే బావుంటుందని మార్కెట్ వర్గాలు కోరుతున్నాయి. 

కామెంట్‌లు